-టీడీపీ రాష్ట్ర కమిటీ సమావేశం
-టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 175 నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం పార్టీ విజయ దుందుభి మోగించడం ఖాయం. మూడేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సర్వ నాశనమైంది. ఈ 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో మనం ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరించాం. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలను అధిగమించేలా చర్యలు తీసుకున్నాం. ప్రతిపక్షంలో నిరంతరం ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళుతున్నాం. స్వతంత్ర్య భారతావనిలో ఇంతటి దుర్మార్గపు పాలన, ప్రభుత్వాన్ని చూడలేదు. జగన్ రెడ్డి అధికార మదంతో వ్యవహరిస్తున్నాడు. ఏపీలో తన పార్టీ ఒక్కటే ఉండాలని అనేక కుట్రలు చేస్తున్నాడు. మూడేన్నరేళ్లలో మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో తెలుగుదేశం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. జగన్ రెడ్డి ఎన్ని సమస్యలు సృష్టించినా , ఆటకాంలు కలిగించినా ధైర్యంగా ఎదుర్కొని మళ్లీ అధికారంలోకి రావడానికి తెలుగుదేశం సిద్ధంగా ఉందంటే అందుకు మన నాయకుడు చంద్రబాబు గారు పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే కారణం. ప్రతి రెండేళ్లకు ఒకసారి పార్టీ సభ్యత్వ కార్యక్రమం చేపడుతున్నాం.60 లక్షలమంది కుటుంబసభ్యులను తయారుచేశాం. ఈ ఏడాది ఏప్రిల్ 21న సభ్యత్వ నమోదును చంద్రబాబుగారి ఆధ్వర్యంలో ప్రారంభించగా 16 లక్షల సభ్యత్వాలు పూర్తిచేసుకున్నాం. టెక్నాలజీ సాయంతో పార్టీకి సేవ చేసే వారిని సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సభ్యులుగా చేర్చుకున్నాం. రేపు అధికారంలోకి రావాలంటే ప్రధాన ఆయుధం ఓటరు. ఓటర్ల లిస్ట్ పై ఎన్నికల సమయంలోనే దానిపై దృష్టి పెట్టడం సరికాదు. అధ్యక్షుల వారి ఆదేశాలతో ఏడు నియోజకవర్గాల్లో కార్యక్రమం ప్రారంభించాం. చంద్రబాబు గారు సీఎం అవుతారని సర్వేలు చెప్పడంతో జగన్ లో భయం పట్టుకుంది. ఓటమి తప్పదని జగన్ రెడ్డిలో అసహనం పెరిగింది. అందుకే ఉన్మాదిలా వ్యవహరిస్తున్నాడు. మూడేళ్ల వైసీపీ పాలనలో సంక్షేమం అటకెక్కింది. పేదలకు అన్నం పెట్టాలని అన్నా క్యాంటీన్లు పెడితే కూల్చేశారు. బటన్ ముఖ్యమంత్రిని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దౌర్జన్యాలు, దొంగఓట్లు, ఫేక్ ఐడీలు ఇకపై పనిచేయవు .
70 నియోజకవర్గాల్లో ఓటరు నమోదు, పరిశీలన మనమింకా ప్రారంభించలేదు. ఓటరు నమోదు కార్యక్రమాన్ని మన వాళ్లు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. అలాగే టీడీపీ కమిటీల ఏర్పాటును వీలైనంత త్వరగా పూర్తిచేయాలి. ఈ విషయంలో మన నాయకులు కాలయాపన చేస్తే మేమే ఆ భాధ్యత తీసుకుంటాం. సెక్షన్ , డివిజన్, గ్రామ , అనబంధ కమిటీలు వేసుకుని ముందుకెళుతున్నాం. నేడు సోషల్ మీడియా సమాజంలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. నారా లోకేష్, చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో టీడీపీలో ఐ టీడీపీ పనిచేసినంతగా మరే అనుబంధ సంస్థ పనిచేయడంలేదు. హెచ్ ఆర్డీ కూడా బాగా పనిచేస్తోంది. ఇప్పటికే మనం యువత, మహిళలకు శిక్షణ ఇచ్చాం. ఇకపై అవసరమైతే పార్లమెంటు, నియోజకవర్గం వారీగా మీటింగ్ లు పెట్టాలని అధ్యక్షుల వారు సూచించారు. మొన్నటి ఒంగోలు మహానాడు అద్భుతంగా జరిగింది. క్యాడర్ లో నూతనోత్సాహం వచ్చింది. ఎన్టీఆర్ స్పూర్తి- చంద్రన్న భరోసా కార్యక్రమం వర్షాల వల్ల వాయిదా పడ్డా మళ్లీ వచ్చే వారం నుంచి ప్రారంభమవుతుంది. మన నేతలు జిల్లాలకు వెళితే ప్రభుత్వం అడ్డుకుంటోంది. మొన్న శ్రీకాకుళం జిల్లాలో లోకేష్ పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. చిత్తూరులో లోకేష్ గారి పర్యటనను అధికారపార్టీ అడ్డుకోలేనంతగా మన క్యాడర్ పోరాడింది. ఇదే స్పూర్తి ఇకపైనా కొనసాగాలి. అధ్యక్షుల వారు రెండు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు.
యువకులు, ఉద్యోగులు, జగన్ ప్రభుత్వంపై దండెత్తుతున్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో మనల్ని గెలిపించేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. 6 ఉమ్మడి జిల్లాల నాయకులు రేపటి నుంచే ఓటరు లిస్ట్ పై దృష్టి పెట్టాలి. ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు అక్టోబర్ 1 నుంచి నవంబర్ 7 వరకే సమయం ఉంది కాబట్టి దీన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని ప్రతి ఒక్క ఇన్ చార్జ్ దీనిపై దృష్టి పెట్టాలి. మన అధినేత దీనిపై ప్రతిరోజూ చర్చిస్తున్నారు. ఇన్ చార్జ్ నియోజకవర్గంలో పది రోజులు తిరగాలి. రిపోర్ట్ మాకు పంపాలి. ఒక్కో నియోజకవర్గానికి ఒక సెక్రటరీని వేశాం. సమయం ఎక్కువ లేదు కాబట్టి ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించి పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. మనం అధికారం కోరుకుంటోంది వ్యక్తిగత స్వార్థం కోసం కాదు రాష్ట్ర భవిష్యత్ కోసమే. అమరావతిలో జాతీయ పార్టీ కార్యలయం ఏవిధంగా ఉందో నియోజకవర్గాల్లో అదే విధంగా ఉండాలి. కొన్ని చోట్ల మనకు కార్యాలయాలే లేవు. దీని వల్ల స్థానిక నేతలు, క్యాడర్ కు ఇబ్బందులు వస్తున్నాయి. మేము ఒక సిస్టమ్ ఆఫీస్ కు ఇస్తున్నాం. కేంద్ర కార్యాలయం లాగే నియోజకవర్గ స్థాయిలోనూ మన కార్యాలయాలు పనిచేసేలా ఆయా నేతలు బాధ్యత తీసుకోవాలి. మీకు ఏసమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురండి . వెంటనే పరిష్కారం చేస్తాము. జగన్ రెడ్డి అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేద్దాం.