జగన్ రెడ్డి పాలనలో ఈ సంక్రాంతి చీకటి సంక్రాంతిగా మారింది

-చంద్రన్న పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా సంక్రాంతి జరుపుకున్నారు
-పెరిగిన నిత్యవసర ధరలు, పేదల ఆకలి ఆర్తనాదాలు
-రాష్ట్ర సస్యశ్యామలంగా ఉండాలన్నా, ప్రజలు సంతోషంగా ఉండాలన్నా మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలి
– టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ

చంద్రన్న పాలనలో రైతులు, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా సంక్రాంతి జరుపుకునేవారని, కానీ నేడు జగన్ రెడ్డి పాలనలో పెరిగిన నిత్యవసర ధరలు, పేదల ఆకలి ఆర్తనాదాలతో ఈ సంక్రాంతి ప్రజల జీవితాల్లో చీకటి సంక్రాంతిగా మారిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ద్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ……

టీడీపీ 5 ఏళ్ల పాలనలో ప్రతి సంవ్సరం పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లభించి రైతులు, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. కానీ చంద్రన్న కానుక రద్దు చేసి, నిత్యవసర ధరలు పెంచి ప్రజలు పండుగ జరుపుకోలేని పరిస్థితి కల్పించిన హీన చరిత్ర జగన్ రెడ్డిది. నేడు రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా పండుగ జరుపుకునే పరిస్థితి లేదు. పండుగ నాడు బంధువుల్ని పిలిచి పట్టెడన్నం పెట్టే పరిస్ధితి లేదు.

చంద్రన్న పాలనలో నాడు రూ. 86 ఉన్న సన్ ప్లవర్ ఆయిల్ నేడు 165 కి, రూ. 74 ఉన్న కందిపప్పు రూ. 144 కి పెరిగింది. నాడు రూ. 106 ఉన్న వేరు శనగ నూనె రూ. 210 కి, రూ. 74 ఉన్న కందిపప్పు రూ. 170 కి పెరిగింది. రూ. 75 ఉన్న పెసరపప్పు రూ. 165కి రూ. 80 ఉన్న వేరుశనగా పప్పు రూ. 160కి, రూ.122 ఉన్న చింతపండు రూ. 310 కి పెరిగింది. దీనిపై వైసీపీ నేతలు ఏం సమాధానం చెబుతారు? లోటు బడ్జెట్ లో సైతం సంక్రాంతి కానుకకు రూ. 1600 కోట్లు ఖర్చు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదే.

సంక్రాతి కానుక కింద కందిపప్పు,శనగపప్పు,పెసరపప్పు, బెల్లం, నెయ్యి, చింతపండు,కారం వంటివి ప్రజలకు ఉచితంగా అందజేశాం. 2014-15లో 1.3 కోట్ల మందికి, 2015-16లో 1.15 కోట్ల మందికి, 2016–17లో 1.8 కోట్ల మందికి, 2017-18 లో 1.27 కోట్ల మందికి, 2018-19లో 1.46 కోట్ల మందికి సంక్రాంతి కానుక అందజేశాం. మూడున్నరేళ్లలో కనీసం ఒక్కరికి కూడా సంక్రాంతి కానుక ఇవ్వని జగన్ రెడ్డి ప్రభుత్వ భవనాలకు తన పార్టీ రంగులు వేయటం కోసం రూ. 3500 కోట్లు వృధా చేశారు.

పింఛన్ల పంపిణీలో వాలంటీర్లు దొంగనోట్లు పంచుతున్నా చర్యలు లేవు. సోషియో ఎకనిమిక్ సర్వే ప్రకారం రాష్ట్రంలో 1.44 కోట్ల మంది రేషన్ కార్డుదారులుంటే జగన్ రెడ్డి వారికి చేసిన మేలు శూన్యం. నిత్యవసరధరలు, పెట్రోల్, డీజిల్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు పెంచి పేదలపై మోయలేని భారం మోపారు. ఈ సంక్రాంతి కేవలం వైసీపీ నేతలకు మాత్రమే పండుగ, పేదలకు పండుగ కాదు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలన్నా, రైతులు, ప్రజలు సంతోషంగా ఉండాలన్నా చంద్రన్న ప్రభుత్వం మళ్లీ రావాలి, వస్తుందని అదే నిజమైన సంక్రాంతి అని పంచుమర్తి అనురాధ అన్నారు.

Leave a Reply