-వరద బాధిత ప్రాంతాల్లో సమర్థవంతంగా సహాయక చర్యలు
-దీనికోసం అధికారులకు అన్నివనరులూ సమకూర్చాం
-గట్టిగా పనిచేయాలని ఆదేశించాం, వారికి తగిన సమయం ఇచ్చాం
-బాగా చేశారా? లేదా? తెలుసుకునేందుకు బాధితులకు ముందుకు వచ్చాం
-సరిగ్గా చేయకపోతే, సహాయం అందకపోతే నేరుగా నా దగ్గరకు వచ్చి మైకులో చెప్పొచ్చు
-ఫిర్యాదులుంటే చెప్పాలని కూనవరం సభలో వరద బాధితులను స్వయంగా ఆహ్వానించిన ముఖ్యమంత్రి వైయస్.జగన్
ఈ ప్రభుత్వం వచ్చాకే పోలవరం పునరావాసంపై అడుగులు
చొరవ తీసుకుని లిడార్ సర్వే చేయించాం
తద్వారా పోలవరం పునరావాసంలో ప్రాధాన్యతలోకి మరో 48 ఆవాసాలు
వారందరికీ తొలి ప్రాధాన్యత కింద సహాయ, పునరావాసం కల్పిస్తామన్న సీఎం
పోలవరంకు నిధులపై ఈ నెలాఖరులోగా కేంద్ర కేబినెట్ నిర్ణయంపై ఆశాభావం
దీనికోసం గట్టిగా కృషిచేస్తున్నాం, సానుకూల పరిస్థితులు ఉన్నాయి
బాధితుల కుటుంబాలకు ప్రధానిమంత్రి బటన్ నొక్కి జమచేసినా ఇబ్బందిలేదు
ఘనత కోసం పాకులాడ్డం లేదు
నా ప్రజలకు మంచిజరిగితే చాలని తాపత్రయపడుతున్నానన్న సీఎం
నాన్నగారి హయంలో పోలవరం నిర్వాసితులకు ఇచ్చిన అదనపు ప్యాకేజీపై కట్టుబడి ఉన్నా
రాష్ట్ర ప్రభుత్వం అందాల్సిన డబ్బు కచ్చితంగా అందుతుంది
చంద్రబాబు చేసిన బుద్ధిలేని పనులను సరిదిద్దుకుంటూ వస్తున్నాం
మీ బిడ్డ వల్ల నష్టపోయాం అన్న మాట ఎక్కడా వినపడదు
చేతనైతే మంచి చేస్తాడు తప్ప చెడు మాత్రం చేయడు
పోలవరం నిర్వాసితుతో సీఎం
కూనవరం, అల్లూరి సీతారామరాజు జిల్లా:
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా అల్లూరి జిల్లా కూనవరంలో బాధితులతో మాట్లాడిన సీఎం వైఎస్.జగన్. ఈ సందర్భంగా సీఎం శ్రీ వైఎస్ జగన్ ఏమన్నారంటే…
“ప్రచారంకోసం కాకుండా సమర్థవంతంగా సహాయ కార్యక్రమాలు’’
వారం రోజుల కిందట గోదావరి నది పొంగడంతో వరదలు వచ్చాయి. దాదాపుగా 16 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. ఈ వరదలవల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలపై అప్పుడే కలెక్టర్‌కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వరదలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, సహాయం అందుతున్న విధానాలు గతంకటే భిన్నంగా ఉండడం ఈ నాలుగు సంవత్సరాల పరిపాలనలో మీరంతా కూడా చూశారు.
ఎవరికి ఎప్పుడు ఏ నష్టం వచ్చినా, ఏ ఫొటోల కోసమో లేకపోతే అప్పటికప్పుడు వచ్చి అధికార యంత్రాంగం అంతా కూడా ముఖ్యమంత్రిగా నా చుట్టూ తిరుగుతూ ఉండేందుకు చేయడం కోసమో చేయలేదు. బాధితులకు సహాయం చేయడంలో అధికారులకు కావాల్సిన వనరులన్నింటినీకూడా అందిస్తున్నాం. బాధితులను ఆదుకోవడంలో ఎలాంటి అలసత్వం చూపకుండా అన్నిరకాలుగా అధికారులకు తోడుగా నిలుస్తున్నాం.
సహాయ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించేందుకు వారికి వారంరోజులపాటు తగిన సమయం ఇస్తున్నాం. గ్రామ సచివాలయాల దగ్గర నుంచి, వలంటీర్ల వ్యవస్థ దగ్గర నుంచి ప్రతి వ్యవస్థనూ కూడా క్రియాశీలకం చేసి ముందుండి నడిపించేలా చేస్తున్నాం. ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా, నష్టం జరగకుండా ప్రతి ఒక్కరికీ కూడా సహాయం అందించే కార్యక్రమాన్ని ఈ నాలుగు సంవత్సరాల పరిపాలనలో మనం చూశాం.
“మీకు సహాయం అందకపోతే… నేరుగా వచ్చి మైకులో చెప్పొచ్చు, మీ తరఫున అధికారులను నేనే ప్రశ్నిస్తా’’
విధానంలో భాగంగానే ఈసారి వరద వచ్చినప్పుడుకూడా ఏదో ఫొటోలుదిగి వెళ్లిపోకుండా, వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు అందరికీ ఇవ్వాల్సిన డబ్బులు వారి చేతిలో పెట్టాం. సరైన ఆదేశాలు ఇచ్చాం. అమలు చేయడానికి, సమర్థవంతంగా పనిచేయడానికి తగిన సమయం ఇచ్చాం. బాధితుల్లో ఎవ్వరూ, ఎక్కడా మిగిలిపోకుండా, ప్రతి ఒక్కరికీ కచ్చితంగా సహాయం అందించాలని చెప్పడం జరిగింది. ఒక వారం రోజుల తర్వాత నేనే వస్తాను, ఆయా గ్రామాల్లో పర్యటిస్తాను, ఏ ఒక్క కుటుంబమైనా నా దగ్గరకు వచ్చి కలెక్టర్ బాగా పలకలేదు, మాకు రావాల్సిన మంచి జరగలేదు అని ఏ ఒక్కరైనా చెప్తే, బాగుండదని కలెక్టర్‌కు గట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంలో ఇప్పుడు ఇక్కడికి నేనే స్వయంగా వచ్చి మిమ్మల్ని స్వయంగా అడుగుతున్నాను. మీ కలెక్టర్ మీకు బాగా పలికాడా? మీకే మైక్ ఇస్తాను, ఎవ్వరైనా సరే ముందుకు వచ్చి, కలెక్టర్ గానీ, అధికారులు గానీ మీకు మంచి జరగాల్సిన పరిస్థితుల్లో, మంచి జరగని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని మీకు అనిపిస్తే నేరుగా నా వద్దకేరండి. మీకే మైక్ ఇస్తా. మీ తరఫున ఎందుకు చేయలేదో కూడా నేనే అడుగుతా. ఇంత గొప్పగా, ఇంత పారదర్శకంగా, ప్రతి ఒక్కరికీ మంచి చేయాలని అనే తపన, తాపత్రయ పడుతున్న ప్రభుత్వం మనది.
“జవాబుదారీ ప్రభుత్వం మనది – సహాయం అందకపోతే నేరుగా ఇక్కడకు వచ్చి చెప్పొచ్చు’’:
బాధితులకు సహాయాన్ని ఎగరగొట్టి, డబ్బులు ఎలా మిగిలించుకోవాలని అనే ఆరాటం మనందరి ప్రభుత్వానికి లేదు. బాధితులు ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదనే తపన, తాపత్రయమే మన అందరి ప్రభుత్వంలో ఉంది. ఇళ్లలోకి నీళ్లు వచ్చిన పరిస్థితుల్లో ఏ కుటుంబానికైనా, ఏ ఒక్కరికైనా నిత్యావసర సరుకులన్నీ ఇవ్వడమే కాకుండా ఆ ఇంటికి రూ.2 వేలు ఇవ్వకపోయి ఉంటే అది కచ్చితంగా తప్పే. అలా జరగకపోయి ఉంటే ఎవరైనా కూడా వచ్చి నాకు చెప్పవచ్చు.
అదే రకంగా ఇళ్లలోకి నీళ్లు రాకపోయినా కూడా గ్రామాలు కటాఫ్ అయిపోయి ఉంటే, కటాఫ్ అయిపోయి ఉంటే, ఆ ఇళ్లకూ ఇవ్వాల్సిన రేషన్ ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 25 కేజీల బియ్యం గానీ, కందిపప్పు గానీ, పామాయిల్ గానీ, పాలు గానీ, కూరగాయలు గానీ ఇటువంటివన్నీ కలిపి 5 రకాల సరుకులన్నీ పంపిణీచేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సహాయం ఎవరికైనా రాకపోయి ఉంటే వారుకూడా ఇక్కడకు వచ్చి చెప్పొచ్చు. దేనికైనా జవాబుదారీ తనం తీసుకొనేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
కచ్చా ఇళ్లుగానీ, ఇళ్లు దెబ్బతినడం గానీ ఇటువంటివేవైనా జరిగి ఉంటే వాటినా పాక్షికంగా, సంపూర్ణంగా దెబ్బతిన్న ఇళ్లుగా వర్గీకరణ చేసి సహాయం అందించే విషయంలో వ్యత్యాసం చూపించొద్దని అధికారులకు స్పష్టంచేశాను. ఇల్లు దెబ్బతింటే పేదవాడు బతకడం కష్టం అవుతుంది కాబట్టి ఎటువంటి వ్యత్యాసం చూపించొద్దని చెప్పాను. ఆ ప్రతి ఇంటికీ కూడా 10 వేల రూపాయలు కచ్చితంగా ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఏ ఒక్కరి ఇళ్లయినా దెబ్బతింటే, వాళ్ల ఇళ్లు ఎన్యుమరేషన్ చేసే ఖాతాలోకి రాకపోయి ఉంటే, రూ.10 వేలు వారి బ్యాంకు ఖాతాలోకి రాకపోయి ఉంటే, అది తప్పేనని భావిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గ్రామ సచివాలయాల్లోనే అర్హుల జాబితాలన్నీ పెట్టడం జరుగుతోంది.ఒక వేళ పొరపాటున మీకేదైనా నష్టం జరిగి ఉండి ఆ జాబితాలో మీ పేరు లేకపోయి ఉంటే వెంటనే ఆ జాబితాలోకి ఆ పేరు చేర్చించి కచ్చితంగా వాళ్లకు మంచి జరిగించే కార్యక్రమం చేయడం కోసమే మీ జగన్ మీ దగ్గరకు వచ్చాడు అని తెలియజేస్తున్నా.
ఈరోజు మరొక్కసారి చెబుతున్నాను ఈ ప్రభుత్వం మీది. మీరంతా తోడుగా ఉన్నారు కాబట్టే మీ బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు. మీ బిడ్డ మీకోసమే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్నాడు అన్నది మాత్రం మర్చిపోవద్దు, ఏ ఒక్కరికి ఏ కష్టమొచ్చినా కూడా దానికి తీర్చడం కోసం, దాన్ని పరిష్కరించడం కోసం ఎళ్లవేళలా మీ బిడ్డ కృషి చేస్తాడు.
పోలవరం పునరావాసంలో తొలి ప్రాధాన్యతలోకి మరో 48 ఆవాసాలు:
ఈ ప్రాంతానికి సంబంధించి ఒక జనరల్ ఇష్యూ ఉంది. పోలవరం ప్యాకేజీకి సంబంధించిన అంశం ఉంది. ఇంతకు ముందు కూడా నేను మీ అందరికీ ఇదే చెప్పా. మీ జగన్‌లో కల్మషం లేదు. మీకు మంచి చేయడం కోసమే ఎప్పటికీ కూడా మీ జగన్ ఆరాటపడతాడు, పోరాడతాడు అని మరోసారి స్పష్టంచేస్తున్నాను.
కిందట సారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు గ్రామాలు కొన్ని 41.15 మీటర్ల కాంటూర్ స్థాయిలో లేవని, అయినా సరే ఆస్థాయిలో నీరు నిల్వచేస్తే గ్రామాలకు వెళ్లే పరిస్థితి ఉండదని, కటాఫ్ అయిపోయిన గ్రామాలుగా ఉండిపోతామని చెప్పారు. అటువంటి గ్రామాలకు మంచి చేయడం కోసం తర్వాత లిడార్ సర్వే చేయించాం.
లిడార్ సర్వే చేయించి అత్యంత పారదర్శకంగా కొన్ని గ్రామాలను, వాటికింద ఉండే ఆవాసాలను గుర్తించడం జరిగింది. 41.15 మీటర్ల స్థాయిలో నీరు నిల్వచేసేటప్పుడు 48 ఆవాసాలకు వెళ్లడానికి దారికూడా ఉండదని నిర్ధారించారు. సైంటిఫిక్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా, సర్వే చేసిన తర్వాత ఆయా గ్రామాలనుకూడా పునరావాస పనుల్లో ప్రాధాన్యతా గ్రామాలు కింద తీసుకుని రావడం జరిగింది. ఈ గ్రామాల మొత్తం జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తూ కొన్ని విషయాలు వారికి చెప్పడం జరిగింది.
కేంద్ర జలసంఘం నియమనిబంధనల ప్రకారం ఏదైనా డ్యాంను నిర్మిస్తే మొత్తం మూడు దఫాల్లో దాన్ని నింపుతారు. భద్రతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని మొదటి ఏడాది కొంతమేర, రెండో ఏడాది మరికొంతమేర, మూడో ఏడాది పూర్తిగా నింపుతారు. ఎక్కడైనా లీకేజీలు లాంటి సమస్యలు వస్తే వాటిఎప్పుకప్పుడు సరిచేసుకుంటూ మూడు దఫాలుగా పూర్తిస్థాయిలో నింపుతారు.
ప్రాజెక్టుల భద్రతా నియమాల్లో భాగంగా ఇదంతా చేస్తారు. పోలవరంలో 41.15 మీటర్ల వరకూ ఫస్ట్ ఫేజ్‌లో డ్యామ్‌లో నీళ్లు నింపే కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ రకంగా చేయడానికి సిద్ధపడుతున్నారు.డ్యాంను పూర్తిస్థాయిలో నిర్మించి, మొదటి విడతలో 41.15 మీటర్ల వరకూ నింపుతారు.
41.15 కాంటూర్ లెవల్‌లో వచ్చే ప్రతి నిర్వాసిత కుటుంబాలకు ఇవ్వాల్సిన ప్యాకేజీలు ఇస్తారు, ఆర్ అండ్ ఆర్‌కు వెళ్లాల్సిన వాళ్లు.. దానిప్రకారం వెళ్తారు. ఆ రకంగా వాళ్లందరికీ న్యాయం చేయడం జరుగుతుంది. 41.15 మీటర్ల స్థాయిలో నింపడంతో పాటు అంత వరకు ముంపునకు గురైన ఆ నిర్వాసితులను మాత్రమే చూసుకోవడం కాకుండా ఈ లిడార్ సర్వే ద్వారా గుర్తించిన ఈ 32 గ్రామాలకు సంబంధించి 48 హ్యాబిటేషన్స్ కూడా ఫస్ట్ ఫేజ్‌లోకి తీసుకురావడం జరుగుతోంది. దాని వల్ల 41.15 మీటర్లకు సంబంధించి ఎవరెవరికి ఏమేం రావాలో అవే పరిష్కారాలు 32 గ్రామాలకు సంబంధించి 48 హ్యాబిటేషన్స్‌లో వాళ్లకు కూడా ఫస్ట్ ఫేజ్‌లోనే ఇవ్వడం జరుగుతుంది.
నెలాఖరుకల్లా కేంద్ర కేబినెట్ ఆమోదం పొందేలా సానుకూల పరిస్థితులు:
మనం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ లిడార్ సర్వే చేయడం జరిగింది. లిడార్ సర్వేలో మొదటి దఫా నిల్వలోనే ఇబ్బందికి గురయ్యే గ్రామాల జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపించడం, దీనికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడం ఇవన్నీ కూడా జరిగాయని చెప్పడానికి మీ బిడ్డగా సంతోషపడుతున్నా. ఇవన్నీ కూడా ఒకవైపున జరుగుతున్నాయి.
దేవుడి దయతో ఈ నెలాఖరునాటికి కేంద్ర మంత్రివర్గానికి ఈ అంశం చేరే కార్యక్రమం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ వాళ్లు ఇప్పటికే సంతకాలు పెట్టి సీడబ్ల్యూసీకి పంపించడం జరిగింది. మరో వారం దాటేలోపల సీడబ్ల్యూసీ వాళ్లు క్లియర్ చేసి కేంద్ర జలశక్తికి వాళ్లకు పంపడం, వాళ్లుకూడా క్లియర్ చేసి, ఈ నెలాఖరుకల్లా కచ్చితంగా కేంద్రం కేబినెట్ ఆమోదించే దిశగా అడుగులు పడుతున్నాయని, ఈమేరకు సానుకూల వాతావరణం కనిపిస్తోందని చెప్పడానికి ఈ సందర్భంగా సంతోషపడుతున్నాను.
ఒకసారి దేవుడి దయతో కేంద్ర కేబినెట్ దానికి ఆమోదం తెలిపితే మీ అందరికీ మంచి జరుగుతుంది. నేను ప్రధాని మోడీ గారికి ఒకటే చెప్పా. నేను రాసిన లేఖలోఒకటే అడిగా.. అయ్యా.. మీరే బటన్ నొక్కండి. నేరుగా మీరే బ్యాంకు అకౌంట్లలోకి డబ్బులు పంపించండి. మేమే చెయ్యాలని మేము ఆరాట పడటం లేదు. మాకు కావాల్సిందల్లా మా ప్రజలకు మంచి జరగాలనేది మాత్రమే నేను తాపత్రయ పడుతున్నా.
కాబట్టి ఆ క్రెడిట్ ఎవరికి వస్తుందనేది నాకు బాధ లేదు. ఆ క్రెడిట్ ఎవరికి వచ్చినా పర్వాలేదు. క్రెడిట్ కోసం కాదు నేనుండేది. నాకు కావాల్సిందల్లా నా ప్రజలకు మంచి జరగాలి. నాకు కావాల్సిందల్లా మా వాళ్లకందరికీ కూడా బ్యాంకు అకౌంట్లలో డబ్బులు పడాలి. నాకు ఇంతకన్నా వేరేది ఏమీ అవసరం లేదని చెప్పడం జరిగింది.
ఒక్కసారి కేబినెట్ ఆమోదం తెలిపిందంటే ఆ తర్వాత- 41.15 మీటర్ల వరకూ ఆర్‌అండ్ ఆర్ కింద ఇవ్వాల్సినవన్నీ కూడా అన్నీ జరిగిపోతాయి. 41.15తో పాటు లిడార్ సర్వేలో వచ్చిన 48 హేబిటేషన్ష్ కూడా ఇవన్నీ కూడా కవర్ అవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకనంటే ఇది మోస్ట్ ప్రిస్టేజెస్ ఇష్యూ అని నాకు తెలుసు. ఇక్కడికి వచ్చిన ప్రతి సందర్భంలోనూ కూడా ఇక్కడి ప్రజలు సంతోష పడాలంటే- ఇదొక్కటి కచ్చితంగా చేయాలనికూడా నాకు తెలుసు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.
ఇంకో విషయం కూడా.. నేను ఇంతకు ముందే చెప్పా. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.6.8 లక్షల ప్యాకేజీకి తోడు మరో 3.2 లక్షల ప్యాకేజీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనమే ఇస్తాం అని చెప్పి కూడా దానికి సంబంధించిన జీవో కూడా ఇప్పటికే రిలీజ్‌చేయడం జరిగింది. దీనికి కూడా మీ బిడ్డ కట్టుబడి ఉన్నాడని ఈ సందర్భంగా కచ్చితంగా తెలియజేస్తున్నా. కచ్చితంగా కేంద్రం నుంచి 41.15 కాంటూరుకు సంబంధించిన ఆ డబ్బులు ఎప్పుడైతే కచ్చితంగా వాళ్లు ఇవ్వడంమొదలు పెడతారో అదే రకంగా ఆ 48 హ్యాబిటేషన్లకు సంబంధించి వాళ్లకు కూడా రావడం మొదలు పెడుతుందో కచ్చితంగా ఆ 6.8 లక్షలతో పాటు కచ్చితంగా మీ బిడ్డ ఇవ్వాల్సిన 3.2 లక్షలుకూడా జతకలిపి ఇచ్చే కార్యక్రమం చేస్తాడు. ఆ నీళ్లు నింపే కొద్దీ, ఆ నీళ్ల వల్ల ఏరకంగా అయితే ఆర్‌అండ్ ఆర్ ప్యాకేజీ గానీ, ఎల్‌ఏ ప్యాకేజీ గానీ- స్టేజ్ వైజ్‌గా అది జరిగే కొద్దీ ఇది కూడా మనం ఇచ్చుకుంటూ పోతాం అని ఈ సందర్భంగా చెబుతున్నా.
కచ్చితంగా ఈ ఎన్నికలకు వెళ్లేలోపలే 41.15 కాంటూకు సంబంధించిన, 48 హ్యాబిటేషన్లకు సంబంధించినవి, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినవి, దానికి తగ్గట్టుగా వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి రావాల్సినవి అన్నీ కూడా ఈ నెక్స్ట్ ఆరేడు పూర్తిగా అందరికీ కూడా అందుతాయని నాకు మనస్పూర్తిగా నమ్మకం ఉంది అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా.
మీ అందరూ ఒకటే ఒకటి గుర్తు పెట్టుకోమని మరొక్కసారి కోరుతున్నా. ఇక్కడ మీ బిడ్డ మీ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. మీకోసం గట్టిగా కృషి చేస్తున్నాడు. కాబట్టే లిడార్ సర్వే అనేది చేయించాం, సర్వేలతో పాటు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. కాబట్టే కేంద్ర ప్రభుత్వం కేబినెట్ దాకా తీసుకొనిపోయే కార్యక్రమాన్ని బలంగాచేస్తున్నాం. ఇంతకు ముందు పాలకుల మాదిరిగా మేము ఇంత ఇస్తే సరిపోతుంది, మేమే పోలవరం ప్రాజెక్టు కట్టే అధికారం మాకు ఇస్తే సరిపోతుంది, ఇంక ఇవ్వకపోయినా పర్వాలేదు అని ఏనాడూ భావించలేదు.
గతంలో పాలకులు చేసిన తప్పులన్నింటినీకూడా సరిదిద్దుకుంటూ వస్తున్నాం. 2013-2014 రేట్లకు 2022లో ఆ రేట్లతోనే ఈ ప్రాజెక్టును ఎలా కట్టగలుగుతారు? ఎల్‌ఏ ఎలా చేయగలుగుతారు? ఆర్‌అండ్ ఆర్ ఎలా చేయగలుగుతారు? అని ఆలోచన చేయమని కోరాం.
ఆ టైమ్‌లో ఆ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు బుద్ధి లేకుండా సంతకం పెడితే పెట్టాడు కానీ ఇప్పుడు మీరైనా ఆలోచనచేయాలని మనం గట్టిగా అడిగాం. మీ బిడ్డ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే కార్యక్రమం చేస్తూ అడుగులు వేశాడని , ఈ విషయం అందరూ కూడా గుర్తు పెట్టుకోమని సవినయంగా కోరుతున్నా.
ఈరోజు ఒక మంచి వార్త కూడా విన్నా. మా కూనవరం ఎస్‌ఐ వెంకటేశ్ గురించి మంచి వార్త విన్నా. చాలా గొప్పగా ఆదుకున్నాడు, చాలా గొప్పగా నిలబడ్డాడని ఎస్‌ఐ గురించి చెబుతున్నారు. నేను కలెక్టర్ గారికి ఇదే చెప్పా ఆగస్టు 15న మనం ఇచ్చే మెడల్స్‌లో ఆయన పేరు ఉండేట్టుగా చూసుకోండని చెప్పా.
వరద సహాయక కార్యక్రమాల్లో ఎక్కడైనా, అక్కడో ఇక్కడో పొరపాటున ఏదైనా జరిగిపోయి ఉంటే అధికారులు అందరం ఇక్కడే ఉన్నాం. ముఖ్యమంత్రి సహా ఇక్కడే ఉన్నాడు. ఏదైనా కూడా పరిష్కరించడం కోసమే ఇక్కడ ఉన్నాం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.
ఇంతకు ముందు పోలవరం ప్రాజెక్టు మొదట్లో నాన్నగారి హయాంలో ల్యాండ్ అక్విజేషన్ జరిగినప్పుడు రూ. లక్ష, లక్షన్నరకు కొనుగోలు చేసిన కార్యక్రమం ఏదైతే జరిగిందో ఆ లక్షన్నరకు జరిగిన దాన్ని నేను 5 లక్షలు ఇస్తాము అని హామీ ఇచ్చాం. బ్యాలెన్స్ డబ్బు ఏదైతే ఇస్తామని చెప్పానో ఆ 5 లక్షలు మైనస్ లక్షన్నర అంటే రూ. మూడున్నర లక్ష కూడా కచ్చితంగా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీ బిడ్డ వల్ల ఏ ఒక్కరూ కూడా నష్టపోయాం అనే మాట ఎక్కడా వినపడదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చేతనైతే మీ బిడ్డ మంచే చేస్తాడు. చెడు మాత్రం మీ బిడ్డ ఎప్పుడూ చెయ్యడు అని మాత్రం కచ్చితంగా గుర్తుపెట్టుకోండి.