-
నాలుగు జిల్లాల్లో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు
-
మంత్రి పవన్, లోకేష్, అనగాని, కొల్లు, కొలుసు, రామానాయుడు, సుభాష్, దుర్గేష్ ఇలాకాలో ఎమ్మెల్సీ ఎన్నికలు
-
గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎమ్మెల్యే ధూళిపాళ్ల దూరం
-
మాజీ మంత్రి దేవినేని ఉమ రాయబారం
-
ఇప్ప్టవరకూ పొన్నూరులో ప్రారంభం కాని ఎన్నికల ప్రచారం
-
అభ్యర్ధి ఆలపాటి రాజా అభ్యర్ధిత్వంపై నరేంద్ర అసంతృప్తి?
-
విపక్ష అభ్యర్ధి లక్ష్మణరావుపై విద్యావంతుల సానుభూతి
-
అయినా గెలుపుపై కూటమి ధీమా
-
ఆలపాటికి వైసీపీ కీలక నేతల పరోక్ష మద్దతు
-
గుంటూరు-గోదావరి జిల్లాల్లో రంగంలోకి దిగిన 12 వైసీపీ వ్యూహబృందాలు
-
పిడిఎఫ్ అభ్యర్ధుల విజయానికి చాపకిందనీరులా ప్రచారం
-
గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ల వద్దకు వెళ్లని నేతలు
-
గ్రాడ్యుయేట్లు కానివారి ఇళ్లకూ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తున్న వైచిత్రి
-
తమతో సమన్వయం చేసుకోవడం లేదంటున్న బీజేపీ నేతలు
-
మంత్రుల ప్రతిభకు ఎన్నికల పరీక్ష
( మార్తి సుబ్రహ్మణ్యం)
రెండు ఉమ్మడి జిల్లాలు.. రెండు ఎన్నికలు.. ఏడుగురు మంత్రులు. ఇదీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ముఖచిత్రం. అందులో ఒకరు జనసేన అధినేత, ఉప ముఖ్యంత్రి పవన్ కల్యాణ్. మరొకరు మంత్రి-టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నియోజవర్గాలున్న జిల్లాలు. నాలుగు జిల్లాల్లో అంతా కూటమి ఎమ్మెల్యేలే. సో. మరి ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్ధులు బ్రహ్మాండమైన మెజారిటీతో కచ్చితంగా గెలిచి తీరాలి. ఒకరకంగా ఇవి మంత్రుల ప్రతిభ-పనితీరుకు పరీక్ష. సవాలు కూడా! ఎవరి జిల్లాలో ఎవరి సత్తా ఏమిటో చాటే ఎన్నికలు!!
ఈనెల 27న జరగనున్న రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు మంత్రులు, జిల్లా ఇన్చార్జి మంత్రులకు సవాలుగా పరిణమించాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, కొలుసు పార్ధసారధి, వాసంశెట్టి సుభాష్, కందుల దుర్గేష్, రామానాయుడు సత్తాకు ఈ ఎన్నికలు పరీక్షగా నిలిచాయి. ఇక ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలో, అభ్యర్ధి కలిదిండి రఘు వర్మకు టీడీపీ మద్దతు ప్రకటించింది. ఆయన గతంలో వైసీపీలో పనిచేసి, టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.
కాగా ప్రధానంగా గుంటూరు-కృష్ణా, ఉభయ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు.. ఆ జిల్లాల పరిథిలోని ఎనిమిది మంది మంత్రుల పనితీరును చాటే వేదిక కానున్నాయి. వారితో పాటు ఆయా జిల్లా ఇన్చార్జి మంత్రుల సమర్ధతకు, ఈ ఫలితాలు సవాలుగా పరిణమించాయి.
ప్రస్తుతం కాకినాడ జిల్లాకు మంత్రి నారాయణ, తూర్పు గోదావరి జిల్లాకు నిమ్మల రామానాయుడు, ఏలూరుకు నాదెండ్ల మనోహర్, కోనసీమ జిల్లాకు అచ్చెన్నాయుడు, పశ్చిమగోదావరి జిల్లాకు గొట్టిపాటి రవికుమార్, ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకు సత్యకుమార్ యాదవ్, మచిలీపట్నం జిల్లాకు వాసంశెట్టి సుభాష్, బాపట్ల జిల్లాకు పార్ధసారథి, పల్నాడు జిల్లాకు గొట్టిపాటి రవికుమార్, గుంటూరు జిల్లాకు దుర్గేష్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల సీఎం-పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మంత్రులతో నిర్వహించిన ఓ సమావేశంలో.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా ఇన్చార్జి మంత్రుల పనితీరుకు మార్కులు ఇస్తానని, వారి పనితీరును పరిశీలిస్తానని చెప్పడం గమనార్హం. దానితో ఆయా జిల్లాల మంత్రులతోపాటు, జిల్లా ఇన్చార్జి మంత్రులూ ‘శ్రమ’టోడాల్చిన పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నాలుగు జిల్లాల్లోనూ కూటమి ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి టీడీపీ అభ్యర్ధుల విజయం నల్లేరుపై నడకే. కానీ టీచర్లు-విద్యావంతులు-నిరుద్యోగులపై ప్రభావితం చూపే పీడీఎఫ్ అభ్యర్ధులు, కూటమిని సవాల్ చేస్తుండటంతో ఎన్నికలపై సహజంగానే ఆసక్తి పెరిగింది. ఈ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉంది. అయితే ఆ పార్టీ పిడిఎఫ్ అభ్యర్ధులకు మద్దతునిస్తోంది. ప్రచారంలో ఎక్కడ కనిపించకపోయినా, అన్ని రంగాల్లోనూ పిడిఎఫ్ అభ్యర్ధులకు దన్నుగా నిలుస్తోంది.
దానితోపాటు రెడ్డి, దళిత విద్యావంతుల ఓట్లను ప్రభావితం చేసేందుకు.. వైసీపీకి చెందిన 12 బృందాలు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఈ ు బృందాలు చాపకింద నీరులా ప్రచారం చేస్తున్నాయని, ఈ బృందాలే పిడిఎఫ్ అభ్యర్ధులకు ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వారి సూచనల మేరకు పిడిఎఫ్ అభ్యర్ధులు ప్రచార వ్యూహం మార్చుకుంటున్నారని చెబుతున్నారు.
కాగా గుంటూరు జిల్లా నుంచి మంత్రి లోకేష్, గోదావరి నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకర్గాలు కూడా.. ఎన్నికల పరిథిలో ఉండటంతో, సహజంగానే ఆ రెండు జిల్లాల ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికల్లో టీడీపీ తమ బలగాలను క్షేత్రస్థాయిలో దింపింది. ప్రతి 50 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని, నియోజకవర్గానికి ఒక ఇన్చార్జి నియమించింది. ఈ ఇన్చార్జిలు రోజూ జరిగే ప్రచారాలకు సంబంధించిన ఫొటోలు, వివరాలను ఎప్పటికప్పుడు పార్టీ ఆఫీసుకు పంపిస్తున్నారు.
అయితే కూటమి ఎమ్మెల్యేలు, నాయకులు గ్రాడ్యుయేట్ ఓటర్ల వద్దకు కాకుండా.. అసెంబ్లీ ఎన్నికల తరహాలో ప్రచారం చేస్తుండటంపై, శ్రేణుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఒక కమ్యూనిటీ హాలులో కార్యకర్తలతో మీటింగ్, బుల్లెట్‌ర్యాలీ, సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అసలు ఓటర్లు కాని వారి ఇళ్లకు వెళ్లి, ఆ ఫొటోలను మీడియాకు ఇస్తున్న వైచిత్రి గోదావరి జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. రాజమండ్రిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రచారం ఇదే తరహాలో ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గోదావరి జిల్లాల్లో అంతటా ఇదే పరిస్థితి.
గోదావరి జిల్లాల టీడీపీ అభ్యర్ధి పేరాబత్తుల రాజశేఖర్ బలమైన నాయకుడు. కాపు కులానికి చెందిన ఈయన, ఇద్దరు దళిత అభ్యర్ధులను ఎదుర్కొంటున్నారు. మాజీ ఎంపి హర్షకుమార్ తనయుడు జివి హర్షవర్ధన్‌తో పాటు.. బలమైన పిడిఎఫ్ అభ్యర్ధి డివి రాఘవలు బరిలో ఉన్నారు. వీరిలో గతంలో యుటిఎఫ్ అధ్యక్షుడిగా చేసిన రాఘవులుకు మంచి పేరుంది. టీచరుగా పనిచేసిన సందర్భంలో చాలామంది విద్యార్ధులు ఇప్పుడు ఓటర్లుగా ఉన్నారు. ఇప్పుడు అది ఆయనకు ప్లస్ పాయింటుగా మారిందంటున్నారు. దానికితోడు దళిత వర్గానికి చెందిన నాయకుడు కావడంతో, ఆ సామాజికవర్గ దన్ను కూడా కనిపిస్తోంది.
ఇక జివి సుందర్ ప్రచారంలో దూసుకుపోతున్నప్పటికీ, రాఘవులు స్థాయిలో ప్రభావితం చూపలేరంటున్నారు. అయితే కొంతమేరకు ఆయన చీల్చే ఓట్లు రాజశేఖర్ విజయంపై ప్రభావితం చూపుతాయంటున్నారు. దానితో ఇక్కడ పోటీ టీడీపీ-పిడిఎఫ్ మధ్యనే కేంద్రీకృతమయింది. ఈ జిల్లాల్లో ఎస్సీ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండగా, రెండోస్థానంలో బీసీ, మూడవ స్థానంలో బ్రాహ్మణ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉందంటున్నారు. అయితే టీడీపీ అభ్యర్ది కాపు అయినప్పటికీ, గ్రాడ్యుయేట్ ఓటర్లలో కాపుల సంఖ్య అత్యల్పం కావడం కొంత మైనస్ పాయింట్ అంటున్నారు.
కాగా పవన్‌కల్యాణ్, వాసంశెట్టి సుభాష్, కందుల దుర్గేష్ నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ నేతలు ఆశించిన స్థాయిలో ఓటర్లను చేర్పించలేదంటున్నారు. తొలుత వాసంశెట్టి సుభాష్ తన నియోజకవర్గంలో పెద్దగా ఉత్సాహం చూపించని నేపథ్యంలో.. సీఎం చంద్రబాబునాయుడు, ఆయనను టెలికాన్ఫరెన్స్‌లో మందలించిన విషయం తెలిసిందే.
ఇదిలాఉండగా..గోదావరి జిల్లాల్లో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధి తమను ప్రచారానికి పిలవడం లేదని, బీజేపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ పోటీకి దిగుతుందన్న అంచనాతో, గతంలో తాము కూడా ఓటర్లను చేర్పించామని గుర్తు చేస్తున్నారు. అయితే ఇప్పటివర కూ తమ వద్దకు ఎవరూ రాలేదని, సమావేశాలకు సైతం పిలవడం లేదని చెబుతున్నారు. ప్రధానంగా బ్రాహ్మణ, కమ్మ, వైశ్య, క్షత్రియ యువతను తాము ఓటర్లుగా చేర్పించామని గుర్తు చేస్తున్నారు.
ప్రధానంగా గోదావరి జిల్లాల్లో కూటమి మధ్య, సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నాలుగురోజుల క్రితం కాకినాడలో నిర్వహించిన సమన్వయ సమావేశం రసాభాసాగా మారి, బీజేపీ-జనసేన నేతలు సమావేశం నుంచి వెళ్లిపోవడం చర్చనీయాంశమయింది. ఆయా నియోజకవర్గాల ప్రచారంలో అభ్యర్థి, బీజేపీ-జనసేనలో ఉన్న కీలక నేతలను వెంటతీసుకువెళ్లడం లేదన్న ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. దానితో బీజేపీ నేతలు ప్రచారానికి దూరంగా ఉంటున్నారు.
ఇక గుంటూరు-కృష్ణా జిల్లా పార్టీ అభ్యర్ధి ఆలపాటి రాజాకు ఇప్పటివరకూ సానుకూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. అయితే పొన్నూరు సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, ఇప్పటిదాకా ప్రచారంలో కనిపించలేదు. ఆయన నియోజకవర్గంలో ప్రచారం మొదలుకాకపోవడం ప్రస్తావనార్హం. ఆలపాటి అభ్యర్థిత్వంపై ధూళిపాళ్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దానితో ప్రచారానికి దూరంగా ఉన్న నరేంద్రతో, మాజీ మంత్రి దేవినేని ఉమను రాయబారానికి పంపించారు. అయినా ఫలితం శూన్యం. అయినప్పటికీ రాజా విజయం ఖాయమని టీడీపీ నేతలు చెబుతున్నారు.
గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు వైసీపీ కీలక నేతలు, విజయవాడకు చెందిన మరో వైసీపీ నేత కూడా ఆలపాటికి పరోక్షంగా సహకరిస్తున్నారన్న ప్రచారమే ఆ ధీమాకు కారణమంటున్నారు. అయితే పార్టీ అభ్యర్ధిత్వం ప్రకటించిన తర్వాత, గుంటూరుకు చెందిన సొంత సామాజికవర్గ విద్యావంతులు, తమ ఓట్లు నమోదు చేసుకునేందుకు ఇష్టపడలేదని టీడీపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అందువ ల్ల కమ్మ సామాజికవర్గ ఓట్లు ఆశించిన స్థాయిలో నమోదుకాలేందంటున్నారు.
కాగా పిడిఎఫ్ అభ్యర్ధి, సిట్టింగ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావుకు టీచర్లు, విద్యావంతుల్లో మంచి పేరే ఉంది. వివాదరహితుడైన ఆయనకు టీచర్ల సంఘాల పాటు, విద్యార్ధి సంఘాలు బహిరంగంగానే పనిచేస్తున్నాయి. ఆయన నామినేషన్‌కు వేలమంది తరలివచ్చారు. వైసీపీ తెరవెనుక మద్దతు కొంత కలసివచ్చే పరిణామమే అంటున్నారు. ఈ నేపథ్యంలో లక్ష్మణరావు, టీడీపీ అభ్యర్ధి ఆలపాటి రాజాకు గట్టి పోటీనిస్తున్నారు.