Suryaa.co.in

Business News

38 శాతం పెరిగిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఆదాయం

• అత్యాధునిక టెక్నాలజీతో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ కేంద్రం
• మహారాష్ట్ర ఆర్టీసీ నుంచి 100 లగ్జరీ బస్సులకు ఆర్డర్‌
హైదరాబాద్; నవంబర్ 9: దేశంలో అగ్రగామి విద్యుత్‌ వాహనాల కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ 30తో ముగిసిన రెండో త్రైమాసికానికి ఆదాయంలో 38 శాతం వృద్ధిని సాధించింది. మొత్తం ఆదాయం రూ.69.05 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ. 50.19 కోట్లుగా నమోదు అయింది. రెండో త్రైమాసికంలో 18 ఎలక్ట్రిక్‌ బస్సులను సరఫరా చేయడంతో ఆదాయంలో వృద్ధికి దోహదపడింది. గత ఏడాది రెండో త్రైమాసికంలో కేవలం ఏడు బస్సులను మాత్రమే సరఫరా చేసింది. కాగా, పూణేలో బస్సుల నిర్వహణ ద్వారా అధిక నిర్వహణ ఆదాయం సాధ్యపడింది. ఎలక్ట్రిక్‌ బస్సుల డివిజన్‌ ఆదాయం రూ.17.8 కోట్ల నుంచి రూ. 42.1 కోట్లకు పెరిగింది. కాగా, ఇన్సూలేటర్ల డివిజన్‌ ఆదాయం మాత్రం 17 శాతం తగ్గి రూ.32.4 కోట్ల నుంచి 27 కోట్లకు తగ్గింది. స్థూల లాభం రూ.3.4 కోట్ల నుంిచ 5.7 కోట్లకు పెరిగింది. కాగా, నికరలాభం రూ. 2.3 కోట్ల నుంచి రూ. 3.71 కోట్ల పెరిగింది.
అత్యాధునిక విద్యుత్‌ వాహనాల ప్లాంట్‌
విద్యుత్‌ వాహానాల తయారీ కోసం హైదరాబాద్‌ సమీపంలో అత్యంత ఆధునిక ప్లాంట్‌ను ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ నిర్మించనుంది. ఇందుకు సంబంధించి తెలంగాణా రాష్ట్ర పారిశ్రామిక సదుపాయాల కార్పోరేషన్‌ లిమిటెడ్‌ (TSIICL) నుంచి 150 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ స్థలం రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం, సీతారాంపూర్‌లో ఉంది. ఈ ప్లాంట్‌ మానవ ప్రమేయం అతితక్కువగా ఉండి, పూర్తి స్థాయిలో ఆటోమేషన్‌తోనూ, మెషిన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీలతో నెలకొల్పనున్నారు. ఇందులో ఏటా 10,000 బస్సుల వరకు తయారు చేయవచ్చు. అలాగే ట్రక్కులు, త్రీ వీలర్స్, ఎల్‌సీవీలు, ఎంసీవీలను కూడా తయారు చేయవచ్చు. ఇది దేశంలోనే అత్యాధునిక ఆటోమోబైల్‌ తయారీ కేంద్రంగా ఉండనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తిని ప్రారంభించనుంది.
ఈ సందర్భంగా ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరక్టర్‌ శ్రీ కే.వీ. ప్రదీప్‌ మాట్లాడుతూ, “విద్యుత్‌వాహానాల రెవల్యూషన్‌లో భాగంగా వస్తున్న ఈ ఈవీ ప్లాంట్‌ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు భవిష్యత్‌ను మలుపుతీప్పేదిగా ఉండబోతున్నది. దేశంలోనే అగ్రగామి విద్యుత్‌ వాహానాల కంపెనీగా ఎదగాలన్న లక్ష్యంతో ఓలక్ట్రా పనిచేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ మేక్‌ ఇన్‌ ఇండియా, ఆత్మనిర్బర్‌ భారత్‌ విధానాల్లో భాగంగా స్థానికంగా ఉత్పత్తిని ప్రోత్సహించినట్టు అవుతుంది. దానికి తోడు రాష్ట్రంలో ఉపాథి అవకాశాలు మెరుగుపడడంతో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పతుంది.” అని అన్నారు.
ఎంఎస్ఆర్టీసీ నుంచి 100 లగ్జరీ ఎలక్ట్రిక్‌ బస్సులకు ఆర్డర్‌ 
మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎంఎస్ఆర్టీసీ) నుంచి ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్‌, ఈవిట్రాన్స్‌ కన్సార్షియంలకు 100 లగ్జరీ ఇంటర్‌ సిటీ ఎలక్ట్రిక్‌ బస్సుల ఆర్డర్‌ వచ్చింది. ఈ మేరకు లెటర్‌ ఆఫ్‌ అవార్డ్‌ను ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్‌ ఈ రోజు అందుకుంది. ఈ బస్సులు ముంబయ్‌, పూణేల మధ్య నడవనున్నాయి. దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఇంటర్‌ సిటీ విద్యుత్‌ బస్సులు నడవడం ఇదే మొదటి సారి. ఈ ఆర్డర్‌ విలువ దాదాపు రూ. 250 కోట్లు. కాగా, ఈ బస్సులను వచ్చే పది నెలల్లోగా సప్లయ్‌ చేయనుంది. ఈ కొత్త ఆర్డర్‌తో ఒలెక్ట్రా ఆర్డర్‌ బుక్‌ దాదాపు 1550 బస్సులకు చేరుకుంది.

LEAVE A RESPONSE