Suryaa.co.in

Andhra Pradesh

వరద సాయంలోనూ అంతులేని అవినీతి

– రూ.534 కోట్ల దాతల సాయం దుర్వినియోగం
– భోజనానికి రూ.368 కోట్లు. మంచినీళ్లకు రూ.26 కోట్లు
– వామ్మో.. కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23 కోట్లా?
– మరి అక్షయపాత్ర రోజూ పంపిన లక్ష భోజనాలు ఏమైనట్లు?
– ఆహార పంపిణీకి 412 డ్రోన్లు వాడినట్లు తప్పుడు లెక్కలు
– అలా ఏకంగా రూ.534 కోట్ల లెక్కల గోల్‌మాల్‌
– వెంటనే కాంట్రాక్టు సంస్థ వివరాలు బయటపెట్టాలి
– వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి

తాడేపల్లి: విజయవాడ వరద బాధితుల అవస్థలు చూసి ప్రపంచ వ్యాప్తంగా దాతలు చలించిపోయి విరాళాలు అందజేస్తే, కూటమి నేతలు వరద బాధితులను ఆదుకోవాల్సింది పోయి రూ.534 కోట్లకు తప్పుడు లెక్కలు చూపి మొత్తం దోచేశారని ఎన్టీఆర్‌ జిల్లా వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, విజయవాడ నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి ఆక్షేపించారు.

వరదలను పబ్లిసిటీ కోసం వాడుకోవడమే కాకుండా, వరద సాయంలోనూ అవినీతి చేయొచ్చని కూటమి ప్రభుత్వం చూపిందని దేవినేని అవినాష్‌ స్పష్టం చేశారు. వరద బాధితులకు ఒక్క పునరావాస కేంద్రం కూడా ఏర్పాటు చేయకుండానే రూ.1.40 కోట్లు ఖర్చు చేశామని తప్పుడు లెక్కలు చూపుతున్నారని ఆయన తెలిపారు. వరద బాధితుల భోజనాలకు రూ.368 కోట్లు, మంచినీళ్ల బాటిళ్లకు రూ.26 కోట్లు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం లెక్కలు చూపుతోందని వెల్లడించారు.

కానీ, వరద బాధితులకు మూడు రోజుల పాటు కనీసం మంచినీరు, పాలు, భోజనం కూడా అందలేదన్న అవినాష్, అంతంత ఖర్చు చేసినట్లు చెబుతున్న ప్రభుత్వం, ఏ కాంట్రాక్టర్‌ ద్వారా ఆ ఏర్పాట్లు చేశారో వివరాలు బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు.

నిజంగా ప్రభుత్వం ఆ స్థాయిలో వరద బాధితులకు సాయం చేసి ఉంటే, ఇప్పుడు కలెక్టరేట్‌ దగ్గరకి వేలాది బాధితులు ఎందుకు పోటెత్తుతున్నారని అవినాష్‌ ప్రశ్నించారు. పారిశుద్ధ్య కార్మికులకు రూ.51 కోట్లు ఇచ్చామంటున్న ప్రభుత్వం, ఎవరి ద్వారా అవి చెల్లించారో చెప్పాలని కోరారు. ఇప్పుడు వరద బాధితులను పలకరిస్తుంటే గతంలో జగనన్న పాలనలో వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు ఇంటికే వచ్చి సాయం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారని చెప్పారు. కూటమిని గెలిపించి తప్పు చేశామన్న భావన వారిలో వ్యక్తమవుతోందని అన్నారు.

చివరకు బాధితులకు అందాల్సిన దాతల సాయాన్ని కూడా మెక్కేశారని నగర మేయర్‌ భాగ్యలక్ష్మి ఆక్షేపించారు. వరద బాధితులకు ఆహారం పంపిణీ కోసం 412 డ్రోన్లు ఉపయోగించి, అందుకోసం రూ.2 కోట్లు చెల్లించినట్లు చెబుతున్నారని గుర్తు చేసిన ఆమె, నిజానికి అప్పుడు కనీసం 10 డ్రోన్లు కూడా కనపడలేదని చెప్పారు.

వరద బాధితుల భోజనాలపై రూ.368 కోట్లు ఖర్చు చేస్తే.. అక్షయపాత్ర ఫౌండేషన్‌ రోజూ లక్ష మందికి అందించిన భోజనాలు ఏమయ్యాయని?, ఇతర స్వచ్ఛంద సంస్థలు చేసిన సాయం మాటేమిటని మేయర్‌ నిలదీశారు. ప్రభుత్వ వరద బాధితుల సాయంపై, కార్పొరేషన్‌ తరపున వివరాలు అడిగినా ఇవ్వడం లేదని ఆమె తెలిపారు. ప్రభుత్వం ఆ రూ.534 కోట్లకు సరైన లెక్కలు చెప్పే వరకు ఊర్కోబోమని, వరద బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని వైయస్సార్‌సీపీ నేతలు ప్రకటించారు.

LEAVE A RESPONSE