Suryaa.co.in

Telangana

సాగునీటి ప్రాజెక్టులపై పెట్టే ప్రతి పైస ప్రజలకు ఉపయోగపడాలి

-తక్కవ నిధులతో ఎక్కువ నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులకు ప్రాధన్యత
-ప్రాణహిత, చిన్న కాళేశ్వరం, నక్కలగండి, ఎస్ ఎల్ బి సి ప్రాజెక్టులను పూర్తి చేయాలి
-రాజీవ్ సాగర్ ను ఎన్ఎస్ పిఎల్ కెనాల్ కు అనుసంధానం చేయండి

సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి వెచ్చించే ప్రతి పైస ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. తక్కువ నిధులతో ఎక్కువ నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రాధన్యతగా తీసుకోవాలన్నారు. మంగళవారం డాక్టర్ అంబేద్కర్ సచివాలయంలోని డిప్యూటి సీఎం కార్యాలయంలో 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ కోసం రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ రూపొందించిన బడ్జెట్ ప్రతిపాదనల పై మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారిన నేపత్యంలో గత కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో చేపట్టిన ప్రాణహిత ప్రాజెక్టును పూర్తి చేయడం వల్ల ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ప్రజల త్రాగు, సాగు నీరు అవసరాలను తీర్చే అవకాశం ఉన్నద‌న్నారు. ప్రాణహిత ప్రాజెక్టును పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

అదే విధంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల కరీంనగర్ జిల్లాకు సాగు నీరు ఇవ్వొచ్చన్నారు. తక్కవ బడ్జెట్తో వీటిని పూర్తి చేయడానికి తగిన ప్రణాళికలు రూపొందించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. నల్లగొండ జిల్లాలో 4లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావడానికి ఎస్ఎల్ బిసి టన్నెల్, నక్కలగండి ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయడానికి టాప్ ప్రియార్టీగా పెట్టుకోవాలన్నారు.

రీ డిజైన్ పేరిట గ‌త ప్ర‌భుత్వం చేపట్టిన సీతరామ ప్రాజెక్టు పూర్తి కావడానికి జాప్యం జరుగుతున్న క్రమంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో డిజైన్ చేసినటువంటి రాజీవ్ సాగర్ ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసి ఎన్ఎస్ పిఎల్ రెండవ జోన్ లోని కెనాల్ కు లింక్ చేయడం వల్ల ఖమ్మం జిల్లాలోని రైతులకు సాగు నీటి ఎద్దడి లేకుండ ఉంటుందన్నారు. గత ప్రభుత్వంలో నిర్మాణం జరిగిన చెక్ డ్యాంల పరిస్థితి చాలా ఆద్వాన్నంగా ఉందని గత వర్షాలకు కొన్ని చోట్ల చెక్ డ్యాంలు కొట్టుకొని పోవడం దారుణమన్నారు.

నాణ్యత ప్రమాణాలు పాటించకుండ అడ్డ‌గోలుగా నిర్మాణం చేడ‌యం వ‌ల్ల ప్ర‌జ‌ల సంప‌ద దుర్వినియోగం అయ్యింద‌న్నారు. ఇక నుంచి నిర్మాణం చేసే చెక్ డ్యాంల విష‌యంలో నాణ్య‌త ప్ర‌మాణాలు పాటించాలన్నారు. చెక్ డ్యాంల నిర్మాణానికి శాస్త్రీయంగా డిజైన్ చేసుకోవాల‌న్నారు. మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతూ 2024 జూన్ నాటికి పూర్తయ్యే పెండింగ్ ప్రాజెక్టులను ప్రాధన్యతగా తీసుకొని యుద్ద ప్రాతిపదికన వాటి పనులు పూర్తి చేయాలన్నారు.

వీటికి నిధుల కొరత లేకుండా బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఉప ముఖ్య‌మంత్రిని కోరారు. వచ్చే సంవత్సరం నాటికి 6లక్షల ఎకరాలను సాగులోకి తీసుకువచ్చే విధంగా ప్రాధన్యత క్రమంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రణాళికలు తయారు చేశామన్నారు. ఎస్ఎల్ బిసి, నక్కలగండి, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుల‌ను పూర్తి చేయ‌డానికి కావాల్సిన నిధుల‌ను స‌ముచితంగా ఇవ్వాల‌ని కోరారు.

సాగునీటి ప్రాజెక్టుల‌కు వెచ్చించిన నిధులు, చేసిన ఖ‌ర్చులు, ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన పురోగ‌తి ప‌నులు, ఇంకా చేయాల్సిన ప‌నుల వివ‌రాల‌ను అధికారులు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జేంటేష‌న్ ద్వారా మంత్రుల‌కు వివ‌రించారు.

ఈ సమావేశంలో హాజరైన ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఈఎన్సీ మురళీధర్ రావు, ఫైనాన్స్ జాయింట్ సెక్రటరీ హరిత, డిప్యూటీ సీఎం సెక్రెటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE