ఉర్రూతలూగించిన క్రియేటివ్ సోల్ దాండియా గార్భా నైట్ 2022

-నగరంలో నాలుగోసారి కేక పుట్టించిన కళాకారులు
-దాండియా కింగ్, క్వీన్, గార్భా రాజా, రాణి పురస్కారాలు
-ఆకట్టుకున్న చిన్నారుల ర్యాంప్ వాక్

విజయవాడ: దాండియా వేడుక ఉర్రూతలూగించింది. క్రియేటివ్ సోల్ దాండియా గార్భా నైట్ 2022 అదరహో అనిపించింది. లబ్బీపేట ఎస్ఎస్ కన్వేన్వన్ సెంటర్లో ఆదివారం పొద్దుపోయే వరకు జరిగిన ఈ కార్యక్రమం ఆహుతులను అలరించింది. దాండియా, గర్బా నృత్యాలతో పాటు గుజరాతీ సంగీత కళాకారుల పాటలు, వాద్య కళాకారులు వీనుల విందైన సంగీతం అబ్బుర పరిచాయి. కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతులు, హోరెత్తించే వాద్యంలతో మెగా ఈవెంట్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

చిన్నారుల మొదలు యువత, వారికీ ధీటుగా పెద్దలు తమదైన ప్రతిభను ప్రదర్శించారు. వరుసగా మూడు సంవత్సరాలు నగరంలో దాండియా వేడుక జరగగా, కరోనా నేపధ్యంలో గత రెండు సంవత్సరాలుగాd నిర్వహించలేదు. చిన్నారుల ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంస్ధ వ్యవస్ధాపకులు సుమన్ మీనా, నేహా జైన్ విజేతలను దాండియా కింగ్, దాండియా క్వీన్ , గార్బా రాజా, గార్బా రాణి పేరిట సత్కరించారు.మంచి వస్త్రధారణకు కూడా బహుమతులు అందించారు.

సాధారణంగా ఉత్తర భారత దేశానికే పరిమితం అయిన గార్బా, దాండియా నృత్యరీతులను ఆంధ్రప్రదేశ్ కు పరిచయం చేసే క్రమంలో క్రియేటివ్ సోల్ పదిహేను రోజుల వర్క్ షాపు, మెగా ఈవెంట్ ను నిర్వహించింది. క్రియోటివ్ సోల్ వ్యవస్ధాపకులు సుమన్ మీనా, నేహాజైన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కళలతో దేశసమైఖ్యతను చాటేలా, గుజరాతీ, రాజస్ధానీ పడతుల కార్యక్రమానికి నగర వాసుల నుండి మంచి స్పందన లభించిందిదన్నారు.

జాతీయ స్ధాయిలో గుర్తింపు కలిగిన శిక్షకులతో విజయవాడ యువత కోసం ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం 15 రోజుల పాటు దాండియా శిక్షణ అందిస్తున్నామన్నారు. దుర్గాదేవికి మహిషాసురునికి మధ్య జరిగే యుద్దానికి ప్రతీకగా ఉత్తర భారత దేశంలో దాండియా అడతారని, అమ్మవారికి హారతి ఇచ్చే ముందు చిన్నా, పెద్ద కలిసి ఈ నృత్యం చేస్తారని నిర్వాహకులు వివరించారు.