Suryaa.co.in

Editorial

ఎన్డీయే వైపే ఎగ్జిట్ పోల్స్

– 40 ఎగ్జిట్‌పోల్స్‌లో ఐదు వైసీపీకి
– మిగిలిన 35 కూటమి వైపే
– లోక్‌సభలోనూ కూటమికే ఓటు
– ఏపీలో కూటమికే పగ్గాలు
– జగన్ సర్కారు పతనాన్ని శాసించిన ఏపీ ఓటర్లు
– వైసీపీకి జై కొట్టిన జగన్ అనుకూల పెయిడ్ చానెల్స్
– మార్పు కోరిన ఆంధ్రా ఓటరు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌పోల్స్ అన్నీ ఎన్డీయే కూటమి వైపే అనుకూల ఫలితాలు స్పష్టం చేశాయి. కేవలం 5 సంస్థలు మినహా, మిగిలిన అన్ని ఎగ్జిట్‌పోల్స్‌లోనూ కూటమి విజయదరహాసం చిందించింది. అసెంబ్లీ-లోక్‌సభ స్థానాల్లో సింహభాగం, ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని ఎగ్జిట్‌పోల్స్ తేల్చేశాయి. గత ఐదేళ్ల నుంచి వైసీపీకి భజన చేస్తున్న కొన్ని మీడియా చానెల్స్ మినహా, మిగిలిన అన్ని చానెళ్లూ టీడీపీనే అధికారంలోకి వస్తుందని కుండబద్దలు కొట్టాయి.

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయలక్ష్మి తెలుగుదేశం పార్టీనే వరించబోతోందని 35 సంస్థలు ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. ఎగ్జిట్‌పోల్స్ ప్రకటించిన 40 సంస్థల్లో…చాణక్య, ఆరా మస్తాన్, సీపీఎస్, పర్దాదాస్, జనమత్‌పోల్స్ మినహా.. మిగిలిన అన్ని సంస్థల ఎగ్జిట్‌పోల్స్, ఎన్డీయే విజయం సాధిస్తుందని ఘంటాపధంగా తేల్చిచెప్పాయి. చాణక్య సంస్ధ వైసీపీకి 110-120, కూటమికి 55-65; ఆరా మస్తాన్ వైసీపీకి 94-104, కూటమికి 71-81; సీపీఎస్ వైసీపీకి 97-108; పర్దాదాస్ వైసీపీకి 110-120, కూటమికి 55-65; జన్‌మత్‌పోల్స్ 95-103, కూటమికి 65-75 సీటు వస్తాయని పేర్కొంది.

పీపుల్స్ పల్స్ వైసీపీకి 45-60, రైజ్ పొలిటికల్ రీసెర్చ్ 48-66, కెకె సర్వే 14-24, చాణక్య స్ట్రాటజీస్ 39-49, స్మార్ట్‌పోల్ 82-90, జంగలం 44-57, పయనీర్ 31, ప్రిజం31, శాన్ సర్వే 60, ఎస్-జెడ్ 48, నెఫోపోల్ 36, ఇండియాటుడే 65-1, సీఎన్‌ఎన్ న్యూస్ 56, ఏబీపీ న్యూస్ 49, న్యూస్ ఎక్స్ 35, జీ న్యూస్ 50, ఇండియా టీవీ 46, ఆర్‌టివి 54, బిగ్ టీవీ 63, సొసైటీ ఫర్ గ్లోబ్ 59, సీపీఆర్ సర్వే 30, పోల్ స్ట్రాటజీ 49, స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ 45-55, వన్ భారత్ 6-0, పీపుల్స్ రైట్ 35, పీపుల్స్ ఒపీనియన్ 19, ఆలిండియా పీపుల్ సర్వే 29, పవర్ తెలుగు 24, రాకెట్ సర్వే 24, ఓపెన్‌టాక్ సర్వే 23, పాప్‌కార్న్ మీడియా 11, సర్వే ఫ్యాక్టరీ 24, సీ మ్యాక్ 64, ఎన్‌ఎఫ్‌ఓ 30-45, పల్స్ టుడే 45-54 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్‌పోల్స్ ప్రకటించాయి. ఇవన్నీ కూటమికి 133-144, 114-125, 115, 127, 139, 104, 145, 120, 90, 156, 150 స్థానాలు ఇవ్వడం గమనార్హం.

కాగా వైసీపీ గెలుస్తుందంటూ ఎగ్జిట్‌పోల్స్ ప్రకటించిన ఓ సంస్థ.. తాజా ఎన్నికల్లో చిలకలూరిపేట, సత్తెనపల్లి, గుంటూరు-, గుంటూరు-2లో ఒక స్థానం నుంచి తెలుగుదేశం సీటు ఆశించగా, ఆ పార్టీ నాయకత్వం తిరస్కరించినట్లు సోషల్‌మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ సర్వే సంస్థకు టీడీపీ ఏడాది పాటు.. నియోజవర్గానికి నెలకు 3 లక్షల చొప్పున, 25 నియోజకవర్గాల్లో ఏడాదిపాటు సర్వే నిమిత్తం కాంట్రాక్టు కుదుర్చుకుందన్నది సోషల్‌మీడియా కథనాల సారాంశం.

కాగా మరో సర్వే సంస్థ అధినేత తొలుత టీడీపీ నాయకత్వంతో సర్వే కాంట్రాక్టు కోసం తిరిగారని, కానీ ఆయనలో ‘మూర్తీ’భవించిన నైజం వల్ల, ఆ పార్టీ నాయకత్వం సర్వే కాంట్రాక్టును తిరస్కరించగా, ఆయన వైసీపీకి జై కొట్టారన్న ప్రచారం సోషల్‌మీడియాలో జరుగుతోంది.

ఇక వైసీపీకి గత ఐదేళ్ల నుంచి భజన చేస్తున్న కొన్ని తెలుగు మీడియా అగ్ర చానెళ్లు కూడా, పెయిడ్ పద్ధతిలో ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయన్న చర్చ సొషల్‌మీడియా వేదికగా జోరుగా సాగుతోంది.

LEAVE A RESPONSE