– మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట: వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో కంది కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కందుల మద్దతు ధర 7,550 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందని, రైతులు మద్దతు ధరకు కందులను అమ్ముకోవాలని అన్నారు. వడ్లకు 48 గంటల్లో పేమెంట్ చేశామని, సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇచ్చామని మంత్రి తెలిపారు.
ఈ నెల 26వ తేదీ నుంచి రైతు భరోసా ఇస్తామని ప్రకటించారు. వ్యవసాయ భూముల అన్నింటికి, రైతు భరోసా అర్హులైన లబ్ధిదారులు ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందిస్తామని, భూమిలేని రైతు కూలీలకు రూ 12,000 చెల్లిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
జనవరి 26వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సోమవారం (జనవరి 7వ తేదీ) సిద్దిపేట జిల్లా, అక్కన్నపేట మండలం, రామవరంలో రూ. 25 కోట్లతో చేపట్టే హుస్నాబాద్ – రామవరం డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
హుస్నాబాద్‌లో మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వ్యవసాయ యోగ్యమైన భూములకు ఏడాదికి రెండు దఫాలుగా ఎకరానికి రూ.12 వేలు రైతుల అకౌంట్‌లో జమ చేస్తామని చెప్పారు. గుట్టలు, రాళ్లు రప్పలు, రోడ్లు, నాలా కన్వెన్షన్ ఉన్న భూములకు రైతు భరోసా పథకం వర్తించదని స్పష్టం చేశారు. భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ కానుక కింద రూ.12 వేలు అందజేస్తామని తెలిపారు. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు.