Suryaa.co.in

Features

రాజధాని ఆవశ్యకతను వివరించిన రాజధాని ఫైల్స్

ఊకదంపుడు మూస చిత్రాలకు భిన్నంగా , అసలు జరిగిన – జరుగుతున్న వాస్తవ సంఘటనలను వాస్తవికంగా చూపిన రాజధాని ఫైల్స్ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలి, చూపించాలి. ముఖ్యంగా హైద్రాబాద్ లో ఉన్న సీమాంధ్రులు ఈ చిత్రాన్ని చూడాలి. చిత్రంలో అసభ్యకర సన్నివేశాలు , అసందర్భ సన్ని వేశాలు ఎక్కడా లేవు. వీలైనంత వరకు రాజధాని సమస్యను ఎత్తి చూపారు. ఎక్కడా వ్యక్తిగత విషయాల జోలికి పోలేదు. ప్రతిపక్ష నాయకులను గానీ , అలాంటి పాత్రలు గానీ ఎక్కడా చూపించలేదు.

కేవలం రాజధాని సమస్య పై మాత్రమే ఫోకస్ చేసారు. రాజధాని ఫైల్స్ చిత్రం విడుదల రోజు సెంట్రల్ లో 1.30 మాట్నీ షో ఉందని వెళితే ఎవ్వరూ టికెట్స్ కొనని కారణాన షోను కాన్సిల్ చేశారు. దానితో సత్యం థియేటర్ కు వెళితే షో ఉంది. నేనూ , నా స్నేహితుడు శ్రీ గోపాలకృష్ణ వెళ్ళి చూసాము. మొత్తం 30 నుండి 40 మంది మాత్రమే ప్రేక్షకులు వచ్చారు. ఒకింత ఆశ్చర్యానికి గురికావాల్సి వచ్చింది. పోనీ తీయకూడని, చూడకూడని చిత్రమా అంటే అలాంటిది కాదనిపించింది మాకు. సమకాలిక రాజకీయాలలో జరుగుతున్న విషయాలను చర్చించిన చిత్రమది.

అసలు ఇంతకాలం ఏమి జరిగింది , ఎలా జరిగిందనేది చూపే ప్రయత్నం చేసారు. ఎలా ప్రజలు అపోహ పడి ఓట్లు కుమ్మరించి ఎలా గెలిపించారో చూపించడం జరిగింది. అలాగే తెలుగు భాష రాని, దక్షిణ భారతీయుడు కాని ఒక వ్యూహకర్తను పెట్టుకుని వందల కోట్లు సమర్పించుకుని , ఒక్కసారి అనే నినాదానికి ఎలా మోసపోయారో చూపించే ప్రయత్నం చేశారు.

అధికారం లోకి వచ్చాక ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తోంది , రాష్ట్రాన్ని ఎలా దివాళా తీయిస్తోంది , ఒకేఒక్కడి అహంకారం వల్ల రాష్ట్రం ఎలా దెబ్బతింటోందో విపులంగా చర్చించడం జరిగింది. పార్టీ సిద్ధాంతాలు కాకుండా , వ్యూహ కర్తల వ్యూహాలు మీద పార్టీలు ఎలా ఆధారపడుతున్నాయో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ ఉత్తరాది వ్యూహకర్తల వల్ల దక్షిణాది ఎలా నాశన మవ్వ బోతోందో చూపించే ప్రయత్నం జరిగింది.
రేపు జరగబోయే ఎన్నికల్లో, ఎలా ఓట్లతో , ఎలా ఎదుర్కోవాలో కూడా దర్శకుడు చూపించాడు.

ఈ చిత్రాన్ని రాజకీయ , కుల , మత కోణంలో చూడకుండా, వాస్తవాలను ప్రతిబంభించిన చిత్రంగానే చూడాలి. తోటివారు నాశన మయితే వారి సమాధుల మీద మనం కాపురం చెయ్యాలనే దుష్ట ఆలోచనలో కొందరు ఉన్నట్లుగా మాకు అనిపించింది. తెలుగు వారి మధ్యన ఇలాంటి భావనలు ఉన్నాయంటే వినడానికి, చూడడానికి భయమేస్తోంది.

కనీసం రాజధాని ఫైల్స్ సినిమా చూడడానికి కూడా భయపడు తున్నారంటే వీరు ఇంతటి పిరికి పందలా అనిపించింది. రేపు రాబోయే కాలంలో హైదాబాద్ లో కూడా ఇప్పటి ఆంధ్రా పరిస్థితులు రావని ఏమైనా గారంటీ వుందా ? అప్పుడు వీరి ఆస్తులను ఎవరు రక్షిస్తారు? వాస్తవాలను, నిజాలను గ్రహించి సమాజం పట్ల బాధ్యతతో ఉండాలి గానీ, ఎవరికి ఏమైతే నాకేమిటి నా ఆస్తులు ఇక్కడ సేఫ్ గా వుంటే చాలు , వాటి ధరలు పెరుగుతుంటే చాలు అనుకునే కొందరి భావజాలం , వారి బాధ్యతా రాహిత్యాన్ని సూచిస్తోంది.

ఆంధ్రా ప్రాంతం పట్ల, రాజధాని పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని ఈ చిత్రంకు వచ్చే వీక్షకుల సంఖ్యను బట్టి అర్థమవుతోంది. పైకిమాత్రం అలా చెయ్యాలి , ఇలా చెయ్యాలి అని సొల్లు చెప్పే సోదిగాళ్ళు, చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా కనిపిస్తోంది. వాస్తవాలను, భూములిచ్చిన రైతుల ఆక్రందనలను కళ్లకు కట్టినట్లుగా చూపించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

కాశ్మీర్ ఫైల్స్ కు ఏమాత్రం తీసిపోని చిత్రం ఇది. యువతరం కూడా రాష్ట్రంపట్ల, సమాజం పట్ల ఎలా భాద్యతతో మెలగాలో కూడా ఇందులో చూపించారు. ముఖ్యంగా రాజధాని కోసం మహిళలు నిర్వహిస్తున్న పోరాటాలను విపులంగా చూపించడం జరిగింది.

అసలు రాజధాని ఎందుకు అవసరమో, రాజధాని ఉంటే అభివృద్ధి ఎలా పరుగులు పెడుతుందో వివరించే ప్రయత్నం చేశారు. 4 రాజధానులు వెనుక ఉన్న కుట్ర కోణాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలోవివరించారు. పరదాల మాటున ప్రజలకు మొహం చూపించకుండా వెళ్లే నాయకుని వికృత కోణాన్ని చూపించిందీ చిత్రం.

– వి. ఎల్. ప్రసాద్

LEAVE A RESPONSE