– హోమీబాబా క్యాన్సర్ సెంటర్కు అనుమతి
– వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
అమరావతి: దీర్ఘకాలిక చికిత్సతో పాటు రోగికి బాగా నొప్పి కలిగించే వ్యాధులు సంక్రమించినప్పుడు అటువంటి రోగులకు కలిగే తీవ్రమైన నొప్పి నుంచి ఉపశమనం కల్పించడం చాలా అవసరమవుతుంది. ఆ నొప్పిని తగ్గించే ప్రత్యేక చికిత్సా విధానాన్ని ఉపశమన సంరక్షణ(ప్యాలియేటివ్ కేర్) అంటారు. ప్రత్యేక చికిత్సా విధానం, నైపుణ్యతలతో కూడిన ఈ చికిత్సకు సంబంధించి పీజీ డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టడానికి విశాఖపట్నంలోని హోమీ బాబా క్యాన్సర్ ఆసుపత్రి, చికిత్సా కేంద్రానికి వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అనుమతించారు. దీంతో రాష్ట్రంలో మొదటిసారిగా ఈ పీజీ కోర్సు ప్రారంభంకానుంది. 4 పీజీ సీట్లలో ప్రవేశాలు జరుగుతాయి.
ఉపశమన చికిత్స
క్యాన్సర్ వంటి కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు సంక్రమించినప్పుడు రోగులు విపరీతమైన నొప్పితో బాధపడడం వల్ల వారి జీవన నాణ్యత తగ్గిపోతుంది. అటువంటి నొప్పి నుండి ఉపశమనం కల్పించి రోగుల జీవన నాణ్యతను పెంచేందుకు తగిన మందుల వినియోగం, మానసిక సలహాలు, కుటుంబ సభ్యుల సహాయం, ఫిజియోథెరపీ ఉపయోగపడతాయి. నొప్పి తరంగాలు (సిగ్నల్స్) ప్రసరించకుండా చేయడం కూడా ఈ ఉపశమన సంరక్షణలో అంతర్భాగం.
ఉపశమన సంరక్షణలో అందుబాటులో కొస్తున్న ఆధునిక సమగ్ర చికిత్సా విధానాలను పీజీ కోర్సు ద్వారా విస్తరింపచేయడానికి ముందుకొచ్చిన హోమీ బాబా క్యాన్సర్ ఆసుపత్రి, చికిత్సా కేంద్ర నిర్వాహకులను మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందించారు. కొద్ది నెలల క్రితం గైనికాలజికల్ అంకాలజీ, సర్జికల్ అంకాలజీ, మెడికల్ అంకాలజీల్లో నాలుగేసి సీట్లతో సూపర్ స్పెషాలిటీ విద్యను ప్రవేశపెట్టడానికి హోమీ బాబా ఆసుపత్రికి మంత్రి అనుమతించారు.