– ఎన్నికల ముందు సీబీఐ విచారణ పేరుతో హడావుడి
– ఇప్పుడు ప్రీతి తల్లి ఆవేదనను పట్టించుకోని డిప్యూటీ సీఎం
– ఆమెకు ఎప్పుడు న్యాయం చేస్తారు ?
– పవన్ కళ్యాణ్ ని నిలదీసిన వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
విశాఖపట్నం:.తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు అధికార మదంతో మహిళలను అవమానించడం అలవాటుగా మారిందని వైయస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖపట్నం వైయస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తప్పుడు పనులు చేసిన ఎమ్మెల్యేల మీద చర్యలకు పోలీసులను ఉపయోగించని ప్రభుత్వం.. అమాయకురాలైన సుగాలీ ప్రీతి తల్లిని అరెస్టు చేయడానికి మాత్రం పోలీసులను ఉపయోగిస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన 16 నెలలుగా తన కుమార్తెను చంపిన వాళ్లను పట్టుకోవాలని పోరాటం చేస్తుంటే… కనీసం పట్టించుకోలేదు. ఎన్నికల ముందు మాత్రం పవన్ కళ్యాణ్ కర్నూలు వెల్లినప్పుడు సుగాలీ ప్రీతి తల్లిని అడ్డంపెట్టుకుని ఓట్లు అడిగారు. .
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే… సుగాలీ ప్రీతి కేసును సీబీఐతో విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ ఉదయం నుంచి సుగాలీ ప్రీతి తల్లిని అక్రమంగా నిర్భంధించారు. ఈ ప్రభుత్వం మహిళలను అక్రమంగా నిర్భంధించడానికే పోలీసులను వాడుతున్నారే తప్ప… తప్పు చేసిన మీ ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవడం లేదు. సుగాలీ ప్రీతి హత్య కేసులో సాక్ష్యాలు తారుమారు అయ్యాయని చెబుతున్న పవన్ కళ్యాణ్ .. అసలు హత్య జరిగిందే తెలుగుదేశం పార్టీ, మీరు అధికారంలో ఉన్నప్పుడు కాదా? మరి ఎందుకు సిబీఐ ద్వారా ఈ కేసు దర్యాప్తు చేయించి ఆ తల్లికి న్యాయం చేయడం లేదు?
వైఎస్సార్సీపీ మహిళా నేత కృపాలక్ష్మిపై అత్యంత నీచంగా మాట్లాడిన ఎమ్మెల్యే థామస్ వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. తక్షణమే ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని, సీఎం చంద్రబాబు ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వైయస్సార్సీపీ జీ డీ నెల్లూరు సమన్వయకర్త కృపాలక్ష్మిపై ఎమ్మెల్యే థామస్ అత్యంత సంస్కారహీనంగా మాట్లాడారు. ఒక దళిత మహిళపై ఇంత నీచంగా ఎమ్మెల్యే ఏ ధైర్యంతో మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే ధామస్ ను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీ ఇంట్లో మహిళల గురించి కనీస సభ్యత లేకుండా ఇంత నీచంగా మాట్లాడగలరా ? మీ మహిళల గురించి ఎవరైనా ఇలా మాట్లాడితే మీరు మౌనంగా ఉంటారా? ఎమ్మెల్యే థామస్ వ్యాఖ్యలపై పోలీస్ స్టేషన్ తో పాటు, ఎస్సీ కమిషన్, నేషనల్ ఉమెన్ కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నాం.
ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారి వ్యవహారాన్ని ఇప్పటికే కధలు, కథలుగా చెప్పుకుంటున్నారు. కూటమి భాగస్వామి పార్టీ జనసేన నాయకురాలు కోట వినుత ప్రైవేటు వీడియోలు తీయించడానికి ఆమె డ్రైవరుకు ఏకంగా రూ. 60 లక్షలు ఎర చూపారని ఆమె పలుమార్లు ఆవేదవ వ్యక్తం చేశారు. తాజాగా ఆమె డ్రైవర్ సెల్ఫీ వీడియో ద్వారా మరిన్ని దారుణాలు వెలుగుచూశాయి.
కోట వినుతను హత్య చేయడానికి కూడా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్లాన్ చేసిన విషయం కూడా బయటపడింది. ఇలాంటి ఎమ్మెల్యే మీద చంద్రబాబు, లోకేష్ లు ఎందుకు చర్యలు తీసుకోలేదు.
జనసేన పార్టీకి చెందిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అనుచరులు… పవన్ కళ్యాణ్ కు చెందిన పంచాయతీరాజ్ శాఖలో పీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగినిని.. ప్రతినెలా మామూళ్లు ఇవ్వాలి లేదంటే పక్కలోకి రావాలని వేధిస్తే ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ వేధింపులు తాళలేక ఆయన కార్యాలయం ముందే… ఆ పార్టీకి చెందిన మహిళా కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే కనీసం కేసు కూడా నమోదు చేయలేదు.