– పుస్తకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు
దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం కంటి చూపులేని వారి కోసం ప్రత్యేకంగా చట్టాన్ని బ్రెయిలీ లిపిలో రూపొంచదించడం జరిగిందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. కంటి చూపులేని వారికి కూడా మున్సిపల్ చట్టాన్ని అందుబాటులోకి తీసుకరావాలనే ఆలోచనలో భాగంగానే బ్రెయిలీ లిపిలో మున్సిపల్ చట్టాన్ని ముద్రించినట్లుగా రాష్ట్ర మంత్రి కే తారక రామారావు తెలిపారు.
ప్రగతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ శాఖ బ్రెయిలీ లిపిలో ముద్రించిన మున్సిపల్ చట్టం 2019 పుస్తకాన్ని రాష్ట్ర మున్సిపల్ వ్యవహరాలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారక రామారావు ఆవిష్కరించారు. రాష్ట్రంలో రోజు వారి వ్యవహరాల్లో అనేక మందికి మున్సిపల్ చట్టం అవసరం ఉంటుందని, ఈ నేపథ్యంలో కంటి చూపు లేని వారి కోసం బ్రెయిలీ లిపిలో ముద్రించడం జరిగిందన్నారు.
బ్రెయిలీలో ముద్రించిన పుస్తకం అనేక మందికి ఉపయోగపడుతుందని, దీనిని సద్వనియోగం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. బ్రెయిలి లీపిలో ముద్రించినందుకు మున్సిపల్ శాఖ సీడీఏంఎ ఎన్.సత్యనారాయణ, ఇతర అధికారులను మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా అభినందించారు. మున్సిపల్ చట్టాన్ని దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా, పారదర్శకంగా ఉండే విధంగా రూపొందించడం జరిగిందన్నారు. దివ్యాంగులు కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందన్నారు.
వారికి ఆసరా ఫించన్ కింద నెలకు రూ.3016 ఇస్తుందన్నారు. దీనితో పాటుగా మూడు చక్రాల వాహనాలు , ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు. దివ్యాంగుల కోసం మానవతా దృక్పదంలో సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలను చేపడుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే మున్సిపల్ చట్టం తెలుగు, ఇంగ్లీషులో ముద్రించడం జరిగిందన్నారు. ఉద్యోగులు, ఉద్యోగులు కానీ వారు కంటి చూపులేని వారు సులభంగా ఉపయోగించుకునే విధంగా దీనిని ముద్రించాం. వారు ఎదుర్కొనే సందేహాలు, సమస్యలపై అవగాహన ఏర్పడుతుందన్నారు. బ్రెయిలీ లిపిలో ముద్రించిన ఈ పుస్తకాన్ని కంటి చూపులేని వారు ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు.
మున్సిపల్ చట్టంలో హరితహారం, గ్రీన్ బడ్జెట్, నీటి సరఫరా, వైద్యం, పారిశుద్ద్యం, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, అందుబాటులో మరుగుదోడ్లు, వీధి దీపాలు, వీదులు, మార్కెట్లు, వైకుంఠదామాలు, శశ్మాన వాటికలు, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, వ్యాధుల నియంత్రణ, కాలుష్య నియంత్రణ, విపత్తు నిర్వహణ, భూముల అభివృద్ధి, భవనాల నిర్మాణం, భవనాల అనుమతులు, ట్రెడ్ లైసెన్సులు, సిటిజన్ సెంట్రిక్, ఈ-మున్సిపల్ సర్వీసెస్ , ప్రజా ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలు ఉంటాయన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ , గ్రామీణాబివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ , ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, దివాకర్ రావు, మాగంటి గోపినాథ్, సీడీఎంఏ ఎన్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.