Suryaa.co.in

Telangana

డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ అరెస్ట్

– ఖండించిన బీఆర్ఎస్ నేతలు
– బీఆర్ఎస్ పార్టీకి, తెలుగు స్క్రైబ్ కు ఏం సంబంధం?
– సీఎం ఆదేశాలతోనే అక్రమంగా అరెస్ట్ చేశారంటూ సీసీఎస్ స్టేషన్ లో నిరసన
– వెంటనే దిలీప్ ను విడుదల చేయాలని డిమాండ్

హైదరాబాద్: తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్, కొణతం దిలీప్ అరెస్ట్ ను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఎలాంటి ఆధారం లేకుండా ఆయనను అరెస్ట్ చేయటంపై మండిపడ్డారు. అక్రమంగా బషీర్ బాగ్ లోని సీసీఎస్ కార్యాలయంలో కొణతం దిలీప్ ను నిర్బంధించారన్న విషయం తెలియటంతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పెద్ది సుదర్శన్ రెడ్డి, దాసోజు శ్రవణ్, కార్తీక్ రెడ్డి సహా పలువురు పార్టీ సీనియర్ నేతలు సీసీఎస్ కు చేరుకున్నారు.

కొణతం దిలీప్ ను ఎందుకు అక్రమంగా నిర్భంధించారని పోలీసులను ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానం చెప్పలేదు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో పోలీసులకు, బీఆర్ఎస్ నేతలకు వాగ్వాదం జరిగింది. పై నుంచి ఆదేశాలు రావటంతోనే అరెస్ట్ చేశామంటూ కొణతం దిలీప్ అరెస్ట్ కు సంబంధించి పోలీసులు ఎలాంటి ఆధారాలు చూపలేదు.

దీంతో ఆయనను వెంటనే విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. పోలీసులు దిలీప్ ను విడుదల చేసే వరకు అక్కడే ఉంటామని చెప్పారు. అనంతరం బీఆర్ఎస్ నేతలు జగదీష్ రెడ్డి, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.

ఇది పోలీసు రాజ్యం కాదు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

పోలీసుల మీద ఆధారపడి బతకాలని ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మిగతా డిపార్ట్ మెంట్లతో పనిచేయించే పరిస్థితి లేదు. ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. కనుకనే పోలీసులను వాడుకొని భయపెట్టే పని చేస్తున్నారు. దిలీప్ ని ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలంటే సహేతుకమైన కారణం చెప్పటం లేదు. ఏదో అనుమానం ఉంది. ఏందో ప్రశ్నిస్తాం అంటే మీ ఇష్టరాజ్యం కాదు. ఇది పోలీసు రాజ్యం కాదు. ఏ కారణం లేకుండా కొణతం దిలీప్ ని పోలీస్ స్టేషన్ లో పెట్టారు. దీనికి క్షమాపణ చెప్పాలి.వెంటనే కొణతం దిలీప్ ను విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.

ట్విట్టర్ వాళ్లు మీకు చెప్పారా?: బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కొణతం దిలీప్ ని ఏం ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారు. ఆయన కుటుంబ సభ్యులతో ఏమాత్రం కమ్యూనికేషన్ లేకుండా గంటల పాటు నిర్భంధంలో పెట్టారు. ఏం ఆధారం ఉందో చూపించాలని పోలీసులను అడిగితే సమాధానం చెప్పలేకపోతున్నారు. తెలుగు స్క్రైబ్ అనే ట్విట్టర్ హ్యాండిల్ కు కొణతం దిలీప్ కు ఏమాత్రం సంబంధం లేదు. ఆధారాలు చూపించాలంటే చూపరు. తెలుగు స్క్రైబ్ హ్యాండిల్ ఒక న్యూస్ పోస్ట్ చేసింది. అది మత కలోల్లానికి సంబంధం ఉందంటారు. తెలుగు స్క్రైబ్ కు కొణతం దిలీప్ కు సంబంధం ఉందంటారు. అసలు ట్విట్టర్ వాళ్లు మీకు చెప్పారా?

మత కల్లోలాలను బీఆర్ఎస్ ఎప్పుడు ప్రమోట్ చేయలేదు. కేసీఆర్ గంగా జమున తెహజీబ్ సంస్కృతి ని కాపాడారు. బీజేపీ వాళ్లు ఓపెన్ గా రాష్ట్ర వ్యాప్తంగా మత కల్లోలాలను వ్యాప్తి చేసేలా వాళ్ల అఫిషీయల్ హ్యాండిల్స్ లోనే ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ అనేది లౌకిక వాద పార్టీ. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిని అరెస్ట్ చేయండి. మేము కూడా సహకరిస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఐటీ సెల్ కు దిలీప్ అపాయింట్ అయినట్లు లెటర్ ఏమైనా ఉందా? బీఆర్ఎస్ పార్టీకి, తెలుగు స్క్రైబ్ కు ఏం సంబంధం?

సీఎం ఆదేశాలతోనే దిలీప్ ను అరెస్ట్ చేశారు. అక్రమ నిర్భందం ఇది. మీరు అరెస్ట్ చేయాల్సిన వాళ్లు వేరే ఉన్నారు. మతం పేరుతో చిచ్చు పెడుతున్న వాళ్లను కనీసం పట్టుకోవటం లేదు. ముఖ్యమంత్రి హోంమంత్రి గా కూడా ఉన్నారు. వెంటనే అక్రమంగా నిర్భంధించిన కొణతం దిలీప్ ను విడుదల చేయాలి. అక్రమంగా నిర్బంధించిన దిలీప్ ను విడుదల చేసే వరకు మేము ఇక్కడ నుంచి వెళ్లం. ఖమ్మంలో మా బీఆర్ఎస్ నాయకుల మీద పెట్టిన అక్రమ కేసులను కూడా వెంటనే ఉపసంహరించుకోవాలి.

LEAVE A RESPONSE