Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ సిద్ధం అంటే..మనం సై అని ముందుకు దూకాలి

– రాష్ట్ర భవిష్యత్తును ఓటు అనే ఆయుధంతో నిలబెట్టాలి
– పుంగనూరు పర్యటనలో భువనమ్మ వ్యాఖ్య

రానున్న ఎన్నికల కురుక్షేత్రానికి వైసీపీ సిద్ధం అంటే…టీడీపీ కార్యకర్తలు సై అంటూ ముందుకు దూకాలని పుంగనూరు పార్టీ శ్రేణులకు చంద్రబాబు సతీమణి భువనమ్మ సూచించారు. నాలుగున్నరేళ్లుగా టీడీపీ కార్యకర్తలను వేధింపులు, ఇబ్బందులకు గురిచేసిన దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడేందుకు కార్యకర్తలు కంకణబద్దులు కావాలని కోరారు.

పుంగనూరు నియోజకవర్గం, పుంగనూరు మండలం, ఒంటిమిట్ట గ్రామంలో పార్టీ కార్యకర్త సొరకాయల శ్రీనివాసులు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం గ్రామస్తులు, పార్టీ శ్రేణులతో భువనమ్మ మాట్లాడుతూ… జగన్ పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది.. రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు లేక ప్రక్క రాష్ట్రాలకు వలసపోవాల్సిన దుస్థితి వచ్చింది.

జగన్ ప్రజావ్యతిరేక పాలనను ప్రశ్నిస్తున్నారనే కక్షతో చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టి 53రోజులు జైల్లో నిర్బంధించారు.పుంగనూరులో చంద్రబాబుకు సంఘీభావంగా సైకిల్ ర్యాలీ చేసే టీడీపీ కార్యకర్తలను వైసీపీ దుర్మార్గులు ఏ విధంగా వేధించాలో, దాడి చేశారో రాష్ట్రమంతా చూసింది. గతంలో నందం సుబ్బయ్య వైసీపీకి జై కొట్టలేదని నడిరోడ్డమీద గొంతు కోసి చంపేశారు..నందం సుబ్బయ్య పార్టీకోసం ప్రాణాలిచ్చిన కార్యకర్త. ఆయన త్యాగానికి నా జోహార్లు.

టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు, నిర్బంధాలు, దాడులు, హత్యలతో పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే అడ్డూ అదుపు లేకుండా రెచ్చిపోతున్నాడు. చంద్రబాబు పాలనలో ఏపీకి కంపెనీలు క్యూ కట్టేవి…జగన్ పాలనలో ఏపీ నుండి పక్కనున్న రాష్ట్రాలకు కంపెనీలు క్యూ కడుతున్నాయి. చంద్రబాబు పాలనలో ప్రక్కనున్న రాష్ట్రాల ప్రజలు, యువత ఏపీకి వలసలు వచ్చేవారు…నేడు జగన్ పాలనలో ఏపీ నుండి యువత, ప్రజలు ప్రక్క రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోతున్నారు.

ఏపీకి పూర్వవైభవం తెచ్చుకుని మన భవిష్యత్తును మనమే నిలబెట్టుకోవాలి.రాష్ట్ర భవిష్యత్తును కూలదోసిన ప్రభుత్వాన్ని కూలదోసే ఎన్నికల యుద్ధంలో యువత కీలకపాత్ర పోషించాలి. రాష్ట్ర ప్రజలంతా ఓటు అనే ఆయుధంతో భవిష్యత్తును నిలబెట్టుకునేందుకు సై అంటూ ముందుకు రావాలి. ఓటు వేసే ముందు మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే నాయకులు ఎవరో ఆలోచించి ఓటు వేయాలి.. చంద్రబాబు పాలనతోనే ఏపీకి భవిష్యత్తు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుందాం…భావితరాల భవిష్యత్తును కాపాడుకుందాం.

LEAVE A RESPONSE