Suryaa.co.in

Editorial

గణపతి…ఇక్కడ ఇలా..దుబాయ్‌లో అలా!

( మార్తి సుబ్రహ్మణ్యం)
వినాయకచవితి.. దేశంలో హిందువుల అతిపెద్ద పండుగ. ముంబాయి, హైదరాబాద్, పుణే, అహ్మదాబాద్ వంటి నగరాల్లో ఈ పండుగ హంగామా, దాని లెక్కనే వేరు. ఇక గణపతి నిమజ్జనం మస్త్, జబర్దస్త్! 1893లో సమర యోధుడు బాలగంగాధర తిలక్, దేశ ప్రజల్లో కులాలు, మతాలకు అతీతంగా స్వాతంత్య్రకాంక్షను రగిలించేందుకు, పుణేలో ప్రారంభించిన ఈ గణపతి ఉత్సవాలు.. తర్వాత దేశం మొత్తానికి శరవేగంగా వ్యాపించి, ప్రతి ఏటా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడం ఒక సంప్రదాయమయింది. హిందువుల జీవితాల్లో అదో భాగమయిపోయింది. అది వేరే కథ.
ఇక ఇప్పుడు మళ్లీ అసలు కథలోకి వెళ్దాం. కరోనా తొలిదశలో లక్షలమంది కన్నుమూసిన నేపథ్యంలో.. స్వయంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే, పండుగలపై ఆంక్షలు విధించింది. దానితో పండుగల సందడి తగ్గిపోయింది. అయితే సినిమా హాళ్లు, మాల్స్, బార్లు, వైన్లు, స్కూళ్లు, రాజకీయ పార్టీల సమావేశాలు, ర్యాలీలకు లేని కరోనా ఆంక్షలు.. ఒక్క వినాయకచవితికి మాత్రమే ఎందుకున్నది ఇప్పుడు ఓ వివాదంగా మారింది. కానీ.. ప్రజల ప్రాణాలు కాపాడేందుకే ఈ నిబంధనలు రూపొందించామన్నది పాలకుల వాదన. సరే.. ఈ వాదాలు, ప్రతివాదాలు, వివాదాలను పక్కకుపెట్టి.. కాసేపు అలా దుబాయ్ వెళ్లొద్దాం రండి.


ఈ వీడియోలోని సూపర్‌మార్కెట్‌లో కొలువుదీరిన వినాయక విగ్రహాలు చూశారు కదా? ఈ సూపర్‌మార్కెట్ ఏ ఉప్పల్‌లోనో, ఏ పద్మారావునగర్‌లోనో, లేకపోతే ఏ పంజాగుట్టలోనో.. అదీకాకపోతే.. ఏ బెజవాడ బెంజిసర్కిలో, వైజాగ్ జగదాంబా సెంటర్‌లో అనుకుంటే ఖచ్చితంగా తప్పులో కాలేసినట్లే. ఇది దుబాయ్‌లోని మధుర సూపర్‌మార్కెట్! బుల్లి వినాయకుడి నుంచి, 40 అంగుళాల వినాయక విగ్రహం వరకూ ఇక్కడ అమ్ముతున్నారు. దుబాయ్‌లో హిందువులు పెద్ద సంఖ్యలో ఉండటంతో, వారక్కడ వినాయకచవితి సంబరాలు చేసుకుంటారు. అయితే..ఇన్నేళ్లలో ఇలా ఎప్పుడూ సూపర్‌మార్కెట్లలో గణపతి విగ్రహాలు అమ్మిన దాఖలాలు లేవు. ఇటీవల తొలిసారి ఏర్పాటుచేసిన ఈ విగ్రహాలను దుబాయ్‌లోని హిందువులు, తెలుగువారు తెగ కొనుగోలు చేస్తున్నారట. ఏకో గణపతులతోపాటు, దీపావళి టపాసులు కూడా ఈ సూపర్ మార్కెట్‌లో అడ్వాన్సుగా దర్శనమిస్తున్నాయి.అక్కడ షేకులకు ఇవన్నీ కొత్తగా అనిపిస్తున్నాయట. వివిధ కళాకృతులతో రూపొందించిన రకరకాల గణపతి విగ్రహాలను చూసి, దుబాయ్‌లో నివసించే మిగిలిన దేశాల వారూ కూడా ఆశ్చర్యపోతున్నారు. వాటి గురించి సూపర్‌మార్కెట్ నిర్వహకులను ఆరా తీస్తున్నారు. సో.. మన గణపతి దుబాయ్‌లోనూ దర్జాగా వెలిగిపోతున్నాడన్నమాట!

LEAVE A RESPONSE