* కాళేశ్వరంలో భాగమని తెలియక నేడు శంఖుస్థాపన చేశారా?
* మల్లన్న సాగర్ నుంచే గంధమల్లకు నీటి తరలింపు
* రాజకీయాల కోసమే కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం
* యాదాద్రి సాక్షిగా ప్రమాణం చేసి రైతురుణమాఫీ పూర్తిచేయలేదు.
* హామీలు నేరవేర్చనందుకు రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణలు చెప్పాలి
* తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్
హైదరాబాద్: కాళేశ్వరమే కూలిపోయిందని వంకర మాటలు మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడేలా గంధమల్ల ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేశారని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ప్రశ్నించారు. లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న కాళేశ్వరం మీద కాంగ్రెస్ నేతలు చేసింది దుష్ప్రచారమని తెటతెల్లమైందని స్పష్టం చేశారు.
గంధమల్ల రిజర్వాయర్ పూర్తైతే నీటిని మల్లన్న సాగర్ నుంచి తరలించాలని ఇది కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ లోనే ఉందని గుర్తుచేశారు. హైదరాబాద్ కు తాగునీరు, గంధమల్ల రిజర్వాయర్‌కు నీటిని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్ నుంచే తరలించాలనే విషయం మర్చిపోయారా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
కేసీఆర్ ను సీఎంగా గద్దె దించేందుకు ఎన్నికల్లో అమలు కానీ దొంగ హామీలను ఇచ్చారని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఇప్పుడు గద్దెనెక్కిన తరువాత హామీల అమలు ప్రక్కకు పెట్టి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా అమలు కానీ హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
10 ఏళ్ల కేసీఆర్ పాలనలో చేసిన 4లక్షల కోట్ల అప్పుతో ఎన్నో ప్రాజెక్టులు కడితే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో చేసిన లక్ష 75 వేల కోట్లతో ఏం అభివృద్ది చేసిండో చెప్పాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ కు అధికారం ఇస్తే అటు ప్రజల సంక్షేమం, ఇటు రైతుల సంక్షేమం కోరుకుంటే.. రేవంత్ రెడ్డికి అధికారం ఇస్తే తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ చావు కోరుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇది రేవంత్ రెడ్డి నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు. ఎన్నికల వేళ యాదాద్రి సాక్షిగా 100 శాతం రైతు రుణమాఫీ చేస్తానని ప్రమాణం చేసి 50 శాతం కూడా మాఫీ చేయని రేవంత్ రెడ్డి పాపాలు పుణ్యాల గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు.
కేసీఆర్ కమీషన్ ముందు హాజరుకానని ఎప్పుడు అనలేదని 11వ తేదిన హాజరవుతానని చెప్పారని గుర్తుచేశారు. అసలు విషయం తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో అహంకారపూరిత మాటలు మాట్లాడడం మానుకోవాలని సూచించారు.
విచారణకు హజరవడానికి కేసీఆర్ ఎందుకు భయపడతారు. లక్షల ఎకరాలకు నీళ్లిచ్చి తెలంగాణను సస్యశ్యామలం చేశాడని తెలిపారు. ఓటుకు నోటు కేసులో డబ్బుల బ్యాగుతో దొరికిన వారు విచారణ, జైలు అంటే భయపడతారని వివరించారు.
18 నెలల కాలంలో కాంగ్రెస్ సర్కార్ చేసిందేమి లేదు కాబట్టే ఇలా డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ హయంలో కరోనా ఆపద్కాలంలో సైతం రేషన్ బియ్యం అందించామని, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తరువాత రేషన్ బియ్యం కోసం రోజుల కొద్ది లైనులో నిలబడాల్సి వస్తుందన్నారు.