– రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్
బొండపల్లి: బాలికల విద్యాభివృద్దికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రతీ ఆడపిల్లా చదువుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. బొండపల్లి, గజపతినగరం మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు. మంత్రికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు.
ముందుగా మండల కేంద్రంలోని మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. సుమారు రూ.125.40 కోట్ల అంచనా వ్యయంతో ఇంటింటి కుళాయిలు ఏర్పాటు చేశారు. అనంతరం రూ.1.92 కోట్లతో నిర్మించిన కస్తూరిభా గాంధీ బాలికల హాస్టల్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. గజపతినగరం మండలం మరుపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిఎంశ్రీలో భాగంగా రూ.15.58 లక్షలతో నిర్మించిన కెమిస్ట్రీ ల్యాబ్‌ను ప్రారంభించారు. అదేవిధంగా రూ.43లక్షల అంచనాతో కెజిబివి పాఠశాలలో నిర్మించిన అదనపు గదులను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్య తమ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యతాంశమని పేర్కొన్నారు. దానిలో బాలికా విద్యకు మరింత ప్రోత్సాహం, ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. మహిళలు అభివృద్ది చెందితే సమాజం అభివృద్ది చెందుతుందని పేర్కొన్నారు. ప్రతీ బాలికా చదువుకోవాలని ఆయన కోరారు. కెజిబివి పాఠశాల భవనం 2019 నాటికే పూర్తయినప్పటికీ, కాంట్రాక్టరుకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల ప్రారంభానికి నోచుకోలేదని అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.15లక్షలు వెచ్చించి చిన్నచిన్న మరమ్మతులను చేయించి ప్రారంభిస్తున్నామని చెప్పారు. క్రీడా సౌకర్యాలను సైతం మెరుగుపరుస్తున్నామని చెప్పారు. అన్ని రంగాల అభివృద్దిపట్లా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. కెజిబివిలు బాలికలకు వరంగా మారాయని అన్నారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థినులు అంతర్జాతీయ స్థాయికి ఎదగడం గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాల్లో ఉపాధ్యాయ ఎంఎల్‌సి గాదె శ్రీనివాసులనాయుడు, ఏఎంసీ చైర్మన్ పి.గోపాల్ రాజు, పీఏసీఎస్ చైర్మన్ బుచ్చిరాజు, డీఈవో మాణిక్యంనాయుడు, సమగ్ర శిక్ష పీవో డాక్టర్ రామారావు, టీడీపీ మండల అధ్యక్షులు రాపాక అచ్చంనాయుడు, మండల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు