– మహిళలు తలుచుకుంటే దేన్నైనా సాధించగలరు
-ఎన్టీఆర్, చంద్రబాబు మహిళా సాధికారత కోసం కృష్టి చేశారు
-పాడిపరిశ్రమను గ్రామాల్లో మహిళలు జీవనోపాధిగా చేసుకోవాలి
-అమరావతి రైతులపై ప్రభుత్వ వేధింపులు నన్ను ఎంతో బాధ పెట్టాయి
-అమరావతే ఎపి రాజధానిగా నిలుస్తుంది
-మహిళా పాడిరైతులతో ముఖాముఖిలో నారా భువనేశ్వరి
వెంకటపాలెం:- మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరని నారా భువనేశ్వరి అన్నారు. మహిళలు తమ శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోవద్దని సూచించారు. రాజధాని గ్రామం వెంకటపాలెంలో మహిళా పాడిరైతులతో భువనేశ్వరి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…మహిళలను వంటింటి నుండి సమాజంలోకి తీసుకొచ్చి ప్రోత్సహించిన నాయకులు నందమూరి తారకరామారావు. మహిళలకు ఆస్తిలో సమానహక్కు ఇచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. ఎన్టీఆర్ తర్వాత నారా చంద్రబాబునాయుడు కూడా మహిళలను అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు అనేక చర్యలు చేపట్టారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చారు. డ్వాక్రా సంఘాలు పెట్టి మహిళలను ప్రోత్సహించి ముందుకు నడిపారు.
1994లో హెరిటేజ్ సంస్థ ఏర్పాటు చేసి ఆ బాధ్యతలను చంద్రబాబు నాకు అప్పగించారు. కంపెనీ నిర్వహణ బాధ్యతలు ఇస్తే నా వల్ల ఏం అవుతుంది? అని నేను అన్నప్పుడు…నువ్వు చేయగలవు….నువ్వు ముందుకు నడిపించగలవు అని ఆనాడు చంద్రబాబు నాతో అన్న మాటలను నేను ఎప్పుడూ మర్చిపోలేను. కేవలం డిగ్రీ చదివి గృహిణిగా ఉన్న నాపై చంద్రబాబు అంత నమ్మకం చూపారు.
మహిళా శక్తిపై చంద్రబాబుకు అపారమైన నమ్మకం. 1994లో హెరిటేజ్ సంస్థలో కేవలం 400మంది పాడిరైతులు ఉండేవారు. నేడు 11రాష్ట్రాల్లో హెరిటేజ్ కంపెనీ ఉంది. 10చేతులు కలిస్తే ఏదైనా సాధ్యమే అని చెప్పడానికి హెరిటేజ్ కంపెనీ నిదర్శనం. 3 లక్షల మంది రైతులు, సిబ్బంది ఓ టీమ్ గా పనిచేయడం వల్ల కంపెనీ ముందుకు వెళుతుంది. పాడిపంటలు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి..రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. ఒకప్పుడు మహిళలు పాలు, నెయ్యి అమ్ముకుని కుటుంబాలను నడిపేవారు.
నేడు కూడా మహిళలు భర్త సంపాదనపై ఆధారపడకుండా కుటుంబాన్ని పోషిస్తున్నారు. మా ఇంట్లో కూడా మేం వ్యాపారం చేస్తూ మగవాళ్లపై ఆధారపడకుండా ఉన్నాం. నేను, నా కోడలు వ్యాపారం చేస్తున్నాం. గతంలో ఆడపిల్లలను చిన్న చూపు చూసి చదువు చెప్పించేవారు కాదు..కేవలం ఇంటి పనులు నేర్పించి వంటింట్లో కూర్చోబెట్టేవారు. నేడు మహిళలు చదువుల్లో ముందు ఉన్నారు. ఆడపిల్లల్ని బాగా చదివించి భవిష్యత్తులో ముందుకు నడిపించాలని అందరినీ కోరుతున్నా. మహిళలు ఏ పనిలో అయినా, ఏ రంగంలో అయినా రాణించగలరు.
నాన్న ఆశయాల సాధన కోసం స్థాపించిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్, వైజాగ్, తిరుపతిలో బ్లడ్ బ్యాంకులు నెలకొల్పాం. ఎన్టీఆర్ ట్రస్టు స్కూల్ 6 వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్య ను అందిస్తోంది. ఎన్టీఆర్ ట్రస్ట్ నుండి బాలికలకు ప్రత్యేకంగా కాలేజీ నడిపిస్తున్నాం. ఏపీలోని చల్లపల్లి గ్రామంలో అనాధ పిల్లలకు ప్రతియేటా 360మంది కి ఉచితంగా విద్యను అందిస్తున్నాం.
మహిళలు తమను తాము తక్కువ అంచనా వేసుకోవద్దు… భవిష్యత్తులో మహిళలంతా ముందుకు వెళ్లాలి. భావితరాన్ని నిర్మించి, ముందుకు నడిపే శక్తిని దేవుడు మహిళలకే ఇచ్చారు…దీన్ని మహిళలు ఎవరూ మర్చిపోవద్దు.
అమరావతే రాజధాని…చంద్రబాబే అమరావతిని నిర్మిస్తారు:
1500రోజులుగా అమరావతి రైతులు, మహిళలు నిర్విరామంగా చేస్తున్న పోరాటాలు వృథా కావు. అమరావతి రైతుల పోరాటానికి, ఉద్యమ స్ఫూర్తికి నా పాదాభివందనం. అమరావతే ఏపీ రాజధానిగా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో గెలిచేది తెలుగుదేశమే…అమరావతిలో రాజధానిని నిర్మించేది చంద్రబాబే.
చంద్రబాబు ఒక్కడిని నమ్మి అమరావతి రైతులు 33వేల ఎకరాలను ఇచ్చారు. చంద్రబాబుపై అమరావతి రైతులు పెట్టుకున్న నమ్మకం వమ్ము కాదు. చంద్రబాబు చెప్పారంటే…చేసి తీరుతారంతే… చంద్రబాబు కుటుంబం గురించి ఆలోచించరు. ఆయన ప్రజల మనిషి…నిరంతరం రాష్ట్ర ప్రగతి గురించే ఆలోచిస్తారు. అమరావతి రైతులు చేస్తున్న పోరాటాలను వైసీపీ ప్రభుత్వం అత్యంత కర్కశంగా అణిచివేయాలని చూసింది.
పోలీసులను ఉద్యమకారులపైకి ఉసిగొల్పి..మహిళలు అని కూడా చూడకుండా కిరాతకంగా వ్యవహరించారు. మహిళలను హింసించి, అరెస్టు చేసి, కేసులు పెట్టి, రాత్రిపూట కూడా స్టేషన్లలో పెట్టారు. వైసీపీ ప్రభుత్వానికి మహిళలంటే ఎంత గౌరవమో అమరావతి ఉద్యమకారుల పట్ల వ్యవహరించిన తీరు అద్దం పడుతుంది. రాష్ట్ర ప్రజలకు రెండో ఆలోచన అవసరం లేదు. అమరావతే మన రాజధాని.
మా కుటుంబంపై మీరు చూపించే అభిమానాన్ని మరువలేను:
మా కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలు, మహిళలు మాపై చూపించిన అభిమానాన్ని ఎప్పటికీ మరువలేను. మాకు ధైర్యం చెప్పి, మా వెన్నంటి నిలిచిన టీడీపీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులకు నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అనంతరం మహిళా పాడిరైతులు అడిగే ప్రశ్నలకు బదులిచ్చారు.
శేషకుమారి, వెంకటపాలెం గ్రామం: నేను గేదెల్ని మేపి పాల వ్యాపారం చేస్తూ బ్రతుకుతున్నాను. మీరు మాలాంటి వాళ్లను ఎలా ప్రోత్సహిస్తారు?
భువనమ్మ: నేను, నా కోడలు ఇద్దరం కలిసి మా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మా కంపెనీల్లో మహిళలకు అవకాశాలు ఇస్తున్నాం. హెరిటేజ్ కంపెనీ నుండి పశువుల కొనుగోలుకు ఆర్థిక సాయం చేస్తున్నాం.
మనీషా, వెంకటపాలెం: గతంలో మీరు ఎన్నడూ రాజకీయాల్లోకి, బయటకు రాలేదు..నేడు ఎందుకు వచ్చారు? మీరు ఎలా భావిస్తున్నారు?
భువనమ్మ: కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం బయటకు రావాల్సిన పరిస్థితి వస్తుంది. నాకు రాజకీయాలు అంటే ఇష్టం లేదు. కానీ అనివార్య పరిస్థితుల్లో నేను ప్రజాక్షేత్రంలోకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబుపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఆ సమయంలో చంద్రబాబు నన్ను పిలిచి పార్టీ బిడ్డలు చనిపోయారు. వారి ఇంటికి స్వయంగా వెళ్లి వారిని ఓదార్చి ఆర్థికసాయం చేసి రావాలని ఆదేశించారు. అందుకే నేను నిజం గెలవాలి అనే కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి, కార్యకర్తల మధ్యలోకి వచ్చాను.
శైలజ, వెంకటపాలెం గ్రామం: అమరావతి ఉద్యమానికి మీరు మీ చేతి గాజులను విరాళంగా ఇచ్చారు. మాకు సంఘీభావం తెలిపి, ధైర్యం చెప్పారు. రానున్న కాలంలో అమరావతి రాజధానిగా ఉంటుందా?
భువనమ్మ: అమరావతే రాజధానిగా ఉంటుంది…రెండో ఆలోచన అవసరం లేదు.
టీడీపీ కార్యకర్తల్ని ఆదుకుంటున్నందుకు కృతజ్ఞతలు: తెనాలి శ్రావణ్ కుమార్, తాడికొండ టీడీపీ ఇన్చార్జి
టీడీపీ జాతీయ అధ్యక్షులు, అమరావతి నిర్మాత నారా చంద్రబాబునాయుడు అక్రమంగా అరెస్టు కాబడిన సమయంలో మనస్తాపానికి గురై మృతిచెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాల వద్దకు నేరుగా వచ్చి పరామర్శించి, ఆర్థికసాయం అందిస్తున్న భువనేశ్వరికి తాడికొండ నియోజకవర్గం తరపున, రాష్ట్ర ప్రజల తరపున నా నిండు కృతజ్ఞతలు. బాధితుల అకౌంట్లలోకి ఆర్థికసాయం పంపిచే అవకాశం ఉన్నా..కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ..నేరుగా కార్యకర్తల ఇళ్లకు వచ్చి పరామర్శించడం భువనమ్మలోని గొప్ప మనస్తత్వానికి ధన్యవాదాలు.