జగన్ ఏమైనా దేశ్ కీ నేతనా?

– తెలంగాణలోనే పోటీ చేయడు కానీ, దేశంలో బీజేపీకి ఎక్కువ సీట్లు రావద్దని అసెంబ్లీలోనే అంటాడు… ఇదెక్కడి విడ్డూరమో?
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

బలమైన భారత్ ను తయారు చేయడమే లక్ష్యంగా ప్రయత్నిస్తున్న బీజేపీకి రానున్న లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు రావద్దని, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వైకాపాకు 175 స్థానాలకు 175 స్థానాలు రావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరుకోవడం ఆయన సంకుచిత మనస్తత్వాన్ని తెలియజేస్తోందని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామకృష్ణంరాజు విరుచుకుపడ్డారు.

జగన్మోహన్ రెడ్డి ఏమైనా దేశ్ కీ నేతనా అని ప్రశ్నించిన ఆయన, తెలంగాణలోనే పోటీ చేయడు కానీ… దేశంలో బిజెపికి అత్యధిక లోక్ సభ సీట్లు రావద్దని అసెంబ్లీలో మాట్లాడడం ఏమిటంటూ ప్రశ్నించారు. ఒకవేళ ఆ కోరిక మనసులో ఉంటే… మనసులోనే పెట్టుకోవాలి కానీ అసెంబ్లీలో మాట్లాడుతారా అంటూ నిలదీశారు. దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. అంతేకానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తమ పార్టీ పైనే ఆధారపడి ఉండాలని కోరుకునే నీచమైన మనస్తత్వం కలిగి ఉండడం దారుణం.

కేంద్రంలో నూతనంగా ఏర్పడబోయే ప్రభుత్వం తమపై ఆధారపడి ఉంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ను జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేస్తారట అని ఆయన ఎద్దేవా చేశారు. గురువారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…. లేదంటే ఇలా అప్పులు చేసుకుంటూ, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకుంటూ ముందుకు వెళ్తాడట అని విమర్శించారు.

రాష్ట్ర బడ్జెట్ అధ్వానం
రాష్ట్ర బడ్జెట్ పై రఘురామ కృష్ణంరాజు స్పందిస్తూ…ఇది ఒక తొకడా బడ్జెట్ అని మండిపడ్డారు. వ్యవసాయానికి 30 వేల కోట్లను, వైద్య ఆరోగ్యానికి 28 వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అయినా 200 కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ బిల్లులను మాత్రం చెల్లించడం లేదు. బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీతో ప్రజలను మభ్య పెట్టే విధంగా ఉంది. అదో మాయల మరాఠీ బడ్జెట్ అని, దాన్ని సీరియస్ గా తీసుకోవలసిన అవసరం లేదన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కనబడితే ఆయన కాళ్లకు వంగి, వంగి దండం పెట్టి జగన్ మోహన్ రెడ్డి, బిజెపి పార్టీ సర్వనాశనం కావాలని కోరుకోవడం పరిశీలిస్తే, ఇదెక్కడి వింతో అర్థం కావడం లేదన్నారు.

సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారానికి తెరలేపిన వై ‘చీఫ్స్’ గాళ్లు
సోషల్ మీడియాలో బుధవారం నాడు వై ‘చీఫ్స్’ గాళ్లు ఒక ఫేక్ ప్రచారానికి తెర లేపారని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు. తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో అర్ధరాత్రి 11:20 నిమిషాలకు సమావేశమయ్యారు.

అయితే అంతకంటే ముందే ఏడున్నర నుంచి 8 గంటల ప్రాంతంలో అమిత్ షా తో చంద్రబాబు నాయుడు భేటీ అయినట్లు, వయసులో తనకంటే చిన్నవాడైనా అమిత్ షా కు పాదాభివందనం చేసినట్లుగా ఫేక్ ఫోటోను సృష్టించి సోషల్ మీడియాలో వే టు న్యూస్ పేరిట ప్రచారం చేశారన్నారు. దీనితో తమ నీచ సంస్కృతి, ప్రవృత్తిని ప్రజలకు అర్థమయ్యేలా వై ‘చీఫ్స్’ గాళ్లు తెలియజేశారని ద్వజమెత్తారు.

ప్రపంచంలోనే మూడవ ఆర్థిక శక్తిగా భారత్ తీర్చిదిద్దాలనే ప్రయత్నం
ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. రానున్న లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పాత మిత్రులను అందరిని కలుపుకుని పోయే ప్రయత్నంలో బిజెపి నాయకత్వం నిమగ్నమైందన్నారు . గతంలో ఎన్డీఏ తో మళ్ళీ కలిసేదే లేదన్న నితీష్ కుమార్… నితీష్ తో జత కట్టేది లేనేలేదని చెప్పిన బిజెపి నాయకత్వం ఇప్పుడు ఆయన పార్టీని ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించింది.

అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో బిజెపి అగ్ర నేతలు జరిపిన చర్చలు ఫలవంతంగానే ముగిసినట్లు అన్ని మీడియా చానల్స్, పత్రికల్లో చూశాం . అంకెల సంగతి పక్కన పెడితే దేశాన్ని బలోపేతం చేయడానికి కలిసి పని చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసిందన్నారు.

దేశాన్ని ముందుకు తీసుకు వెళ్లాలంటే అభ్యుదయ పార్టీలతో కలిసి పని చేయాలి కానీ పనికిరాని పార్టీలతో అవసరం లేదని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఉభయ సభల్లోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ రానున్న లోక్ సభ ఎన్నికల్లో బిజెపికి 370 స్థానాలు, ఎన్డీఏ కూటమికి 400 పైగానే స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారన్నారు.

బెయిల్ యాదృచ్ఛికమే అయినా జగన్మోహన్ రెడ్డిలో కలవరపాటు షురూ
బిజెపి అగ్ర నాయకులతో చంద్రబాబు నాయుడు సమావేశం కావడం, కోడి కత్తి కేసులో ఏళ్ల తరబడి జైల్లో మగ్గుతున్న శ్రీనుకు బెయిల్ లభించడం యాదృచ్ఛికమే అయినా… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో కలవరపాటు మొదలయ్యిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

కోడి కత్తి కేసు లో శ్రీనుకు బెయిల్ లభించిన వెంటనే జగన్మోహన్ రెడ్డి హుటా హుటిన ఢిల్లీకి పయనం కావాలనుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటోనని ఆయన ప్రశ్నించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ విచారణ సమయంలోను జగన్మోహన్ రెడ్డి, కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరారు.

కానీ జగన్మోహన్ రెడ్డికి కేంద్ర పెద్దలు ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇచ్చిన బెయిల్ పై పిటీషన్ రద్దు చేయడం పెద్ద శ్రమేమి కాదు. అయితే ఈ కేసు డైరీలో 60 వ్యాల్యూమ్స్ ఉన్నాయని సిబిఐ పేర్కొనగా, 60 వ్యాల్యూమ్స్ ను సీల్డ్ కవర్లో అందజేయడం ఇబ్బంది కాబట్టి, సిడి రూపంలో అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది. కేసు డైరీ పరిశీలిస్తే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన తెల్లవారుజామున హైదరాబాద్ లోని కోట కు ఏ ఫోను నంబర్ నుంచి కాలు వెళ్ళింది.

వారిద్దరు ఎంతసేపు మాట్లాడుకున్నారు. కోట లో ఉన్న ఫోన్ నెంబర్ నుంచి ఆ తరువాత ఎవరికి కాల్ వెళ్ళిందన్నది స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఒకానొక సమయంలో కొంతమంది పేర్లను పెట్టి కూడా తీసివేశారు. కేసు డైరీ ని ఒకసారి ధర్మాసనం పరిశీలించిందంటే, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవడం ఖాయమని రఘురామ కృష్ణంరాజు తెలిపారు .

ఎట్టకేలకు కోడి కత్తి కేసులో శ్రీనుకు బెయిల్
కోడి కత్తి కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న శ్రీనుకు ఎట్టకేలకు హైకోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఈ కేసు గురించి ఎక్కడా మాట్లాడవద్దని శ్రీనుకు హైకోర్టు షరతులు విధించింది. జగన్నాటకంలో హత్యయత్నం పాత్రను పోషించినందుకు ఇన్ని ఏళ్లపాటు జైల్లో పెట్టడం దారుణం. జైల్లోనే శ్రీను డిగ్రీ కూడా పూర్తి చేశారు.

అసలు కోడి కత్తి కేసు ద్వారా కోడి కత్తి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను చేపడితే, కోడి కత్తి కేసు విచారణ అన్నది తీవ్ర ఆలస్యం కావడం దురదృష్టకరం. ఇప్పటికైనా బెయిల్ రావడం అన్నది శుభసూచకం. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బెయిల్ రాకుండా ఆపాలని చూసిన న్యాయస్థానాలపై ప్రజలకు ఉన్న గౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా ఇప్పటికైనా బెయిల్ మంజూరు చేయడం హర్షించదగ్గ విషయం.

న్యాయాన్ని ఎవరైనా అడ్డుకోగలరు కానీ న్యాయం దక్కకుండా అడ్డుకోలేరని ఈ సంఘటన మరోసారి రుజువు చేసిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఒకవైపు కోడి కత్తి శ్రీనుకు బెయిల్ లభించగా, మరొకవైపు ఢిల్లీలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల నేతలు నిరసనను వ్యక్తం చేస్తున్నారన్నారు. కోడి కత్తి కేసు గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపుకు ఎంతో దోహదం చేసింది.

కోడి కత్తి గీసుకుపోకపోయినప్పటికీ, 9 కుట్లను వేయించుకొని జగన్మోహన్ రెడ్డి 151 స్థానాలను గెలుచుకున్నారు. ఈ కేసు గురించి మాట్లాడవద్దని శ్రీను కు హైకోర్టు షరతులు విధించినప్పటికీ, కొన్ని నిజాలను కొందరి ద్వారా తెలుసుకొని, అందరికీ తెలియజేసే అవకాశం ఉంటుందన్నారు.

టైమ్స్ నౌ యాజమాన్యానికి కూడా సీన్ అర్థమైనట్టుంది
ఏడాదికి 9 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని అప్పనంగా కట్టబెడుతున్నప్పటికీ టైమ్స్ నౌ యాజమాన్యం గతంలో కంటే భిన్నంగా ఈసారి సర్వే అంచనాలను వెల్లడించిందంటే, ఆ సంస్థ యాజమాన్యానికి కూడా సీన్ అర్థమై ఉంటుందని రఘు రామ కృష్ణంరాజు అన్నారు. టైమ్స్ నౌ తాజా సర్వే అంచనాలలో వైకాపాకు 18 నుంచి 19 స్థానాలలో గెలిచే అవకాశం ఉన్నట్లుగా పేర్కొనడం జరిగింది.

గతంలో 25 స్థానాలకు గాను 24 స్థానాలలో గెలిచే అవకాశం ఉందని పేర్కొనేవారు. అయితే ఈసారి సీట్ల సంఖ్యను కుదించారంటే క్షేత్రస్థాయి వాస్తవాలను ఇప్పటికైనా కొద్దో గొప్పో అంచనా వేసి, క్రమేపీ సీట్ల సంఖ్యను తగ్గించాలని అనుకుని ఉంటారు . భవిష్యత్తులో అడ్వర్టైజ్మెంట్ కావాలంటే నూతనంగా ఏర్పడనున్న ప్రభుత్వాన్ని అడగాల్సిందే. అందుకే టైమ్స్ నౌ యాజమాన్యం తీరులో ఈ మార్పు వచ్చిన ఉంటుందన్నారు.

రెండేళ్లకు పైబడే చెబుతున్నా… ఈ మూడు పార్టీలు కలిసే వెళ్తాయని
రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపిలో కలిసే వెళ్తాయని రెండేళ్లకు పైబడే నుంచే నేను చెబుతున్నానని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. అప్పుడు ఈ మూడు పార్టీలు కలిసి వెళ్తాయని నేను చెబితే ఎంతోమంది నవ్వుకున్నారు. ఈ మూడు పార్టీలు ఇప్పుడు కలిశాయి. గతంలో నవ్వుకున్న వారు ఇప్పుడు నవ్వుకోవాలని ఆయన ఎద్దేవా చేశారు.

సూత్రప్రాయంగా మూడు పార్టీలు కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా వృధానే. ఆఖరి నిమిషంలో ప్రత్యేక హోదా మిషాతో కేంద్ర పెద్దల కాళ్లు పట్టుకున్న పని జరగదబ్బాయి. ఢిల్లీలో బిజెపి పెద్దలతో చంద్రబాబు నాయుడు సమావేశమైన వేళ … తాడేపల్లి ప్యాలెస్ లో ఏడుపు మొదలయ్యింది. ఇక్కడ పొత్తు పొడిస్తే… అక్కడ టీవీ బద్దలైంది. దీనితో నా ప్రస్తుత పార్టీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు.

సాక్షి దినపత్రికవన్నీ దిగజారుడు రాతలే
జర్నలిజానికి తలవంపులు తెచ్చే విధంగా సాక్షి దినపత్రిక దిగజారుడు రాతలు రాస్తోందని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డాతో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం అర్ధరాత్రి 11 గంటల 20 నిమిషాలకు సమావేశమయ్యేందుకు లోపలికి వెళ్లారు. అరగంట లోపే సమావేశం ముగిసిందని సాక్షి దినపత్రికలో రాశారు.

ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ, సమావేశంలో ఏమి జరిగిందో తమకు తెలిసినట్లుగా రాయడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బిజెపి అగ్ర నేతలతో ఎన్ని సీట్లు కావాలంటే అన్ని సీట్లు ఇస్తామని చంద్రబాబు నాయుడు అన్నట్లుగా రాయడం హాస్యాస్పదంగా ఉంది. నేను కోర్టులో దాఖలు చేసిన ఒక పిటిషన్ పై అప్పిల్ కమిటీ కి వెళ్లి గ్రీవెన్స్ ఇవ్వాలని, అలా కాకుండా నేరుగా కోర్టుకు ఎందుకు వచ్చారని పేర్కొనడం జరిగింది.

రివ్యూ కమిటీ ముందుకు వెళ్లిన తర్వాత న్యాయస్థానానికి రావాలని సూచిస్తే… దానికి కూడా సాక్షి దినపత్రిక వక్ర భాష్యం చెప్పింది. న్యాయ స్థానాలలో నాకు అనుకూలమైన తీర్పు వచ్చినప్పుడు సాక్షి దినపత్రిక దాని గురించి వార్త కథనాన్ని ప్రచురించదు.. గతంలో ఈ డి 40 కోట్లు పెనాల్టీ విధిస్తే 400 కోట్ల రూపాయల పెనాల్టీ విధించినట్లుగా వార్తా కథనాన్ని రాశారు. అదే పెనాల్టీ పై కోర్టు స్టే విధించినప్పుడు కనీసం నాలుగు అక్షరాల వార్తా కథనాన్ని కూడా ప్రచురించలేదని, ఇదెక్కడి జర్నలిజం అంటూ మండిపడ్డారు.

టిడిపి, జనసేన, బిజెపి కూటమికి 21 స్థానాలు ఖాయం
రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపి కూటమికి 21 లోక్ సభ స్థానాలు ఖాయమని, అంతకంటే ఎక్కువగానే వచ్చే అవకాశం ఉందని రఘురామకృష్ణం రాజు ధీమా వ్యక్తం చేశారు. నేనేమీ తుగ్లక్ లా 25 స్థానాలకు 25 స్థానాలు, 175 స్థానాలకు 175 స్థానాలు వస్తాయని పనికిరాని మాటలు చెప్పను . ప్రస్తుతానికి వైకాపాకు కడప, రాజంపేట లోక్ సభ స్థానాలలో కాసింత ఎడ్జ్ ఉంది.

కడప లోక్ సభ స్థానానికి సౌభాగ్యమ్మ పోటీ చేస్తే, ఆస్థానం కూడా గల్లంత కావడం ఖాయం.రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా, జనసేన, బిజెపి కూటమి 140 స్థానాలకు పైగానే విజయం సాధిస్తుంది. ఒకసారి అధికారికంగా కూటమి ప్రకటన వెలువడిన తరువాత దొంగ ఓట్ల ప్రక్షాళన జరుగుతుంది. కడప జిల్లాకు చెందిన అధికారులు, పేరు చివర డి డి వై అక్షరాలు కలిగిన అధికారులతో పాటు పక్షపాతంగా వ్యవహరించే వారిని ప్రక్షాళన చేస్తారు.

నిష్పక్షపాత ఎన్నికలు జరగడానికి అనువైన వాతావరణం ఉంటే ప్రజలు ధైర్యంగా, ప్రశాంతంగా ఓటు వేసే పరిస్థితి నెలకొంటుంది. నాకున్న సమాచారం మేరకు మార్చి ఏడవ తేదీ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ తరహా ప్రక్షాళనలు జరగాలంటే కొన్ని పొత్తులు అవసరం. కేంద్రంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలున్న బిజెపితో, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పొత్తు అన్నది అవసరం. ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న తరహాలో అడ్డగోలు అప్పులు చేయకపోయినప్పటికీ, కొంతమేరకు అప్పులు అవసరం.

దానికి కేంద్ర సహకారం అన్నది ముఖ్యం. అలాగే అమరావతి తో పాటు పోలవరం నిర్మాణానికి , పారిశ్రామిక అభివృద్ధి శరవేగంగా జరగాలంటే, చెలిమి తో కూడిన కేంద్ర సహకారంతోనే సాధ్యమవుతుంది. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే ప్రజలు ఎటువంటి అపోహలను పెట్టుకోకుండా కూటమికి మద్దతును ఇవ్వాలని కోరారు. అయితే గతంలో ఈ కూటమి కలిసి అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నది అపోహ మాత్రమేనని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

ప్రత్యేక హోదా కేటాయించడానికి సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తడం వల్ల, దానికి తగిన ఆర్థిక ప్యాకేజీని ఇచ్చారు. అమరావతి నగర నిర్మాణానికి రాత్రింబవళ్లు పని జరిగింది. మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే, అమరావతి రోడ్లను తవ్వేసి కంకర దొంగిలించారు. పోలవరం ప్రాజెక్టు 72 శాతం పూర్తయింది. రాష్ట్రం అత్యద్భుతంగా అభివృద్ధి చెందినప్పటికీ, కొంత సమాచార లోపం వల్ల ఎన్నికల్లో కూటమి విడిపోయింది.

అంతకుముందు ఎన్నికల్లో కూటమిగా పోటీ తెదేపా, జనసేన, బిజెపిలు 107 నుంచి 110 స్థానాలు గెలిచినట్లుగా పేర్కొన్న ఆయన ఈసారి అత్యద్భుత విజయాన్ని సాధించడం ఖాయమన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అదే పనిగా అపాయింట్మెంట్ అడిగితే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వవచ్చు. అంతమాత్రాన టిడిపితో కలిసి వెళ్లవద్దని, ఎన్డీఏ కూటమిలోకి తీసుకోవద్దని చెబితే, వింటారని నేను అనుకోవడం లేదు .

ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తే ఇదే చివరి సమావేశం అని టాటా… వీడ్కోలు అని చెప్పే అవకాశం ఉంది. 2029 నాటికి వైకాపా పార్టీ ఉంటుందో ఉండదో అనేదే నాకున్న అనుమానం అని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి కేసులపై సమాచార ప్రసారాల శాఖామంత్రి అనురాగ్ ఠాకూర్ ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, సరైన సమయంలో కేసు విచారణ వేగవంతం అవుతుందని పేర్కొనడం కోస మెరుపు అని అన్నారు.

Leave a Reply