Suryaa.co.in

Andhra Pradesh

ఏపీలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి!

-ప్రతి పౌరుని నెత్తిపైన సగటున 2.50 లక్షల రూపాయల అప్పు భారం
-అప్పులు చేయకపోతే జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి
-ప్రభుత్వం మొద్దు నిద్ర వల్ల ఒక లక్ష కోట్ల పెట్టుబడులు.. కనీసం 6 లక్షల మంది ఉపాధి కోల్పోయాం
-అన్ని శాఖలలో అవినీతి కంపు
-అభివృద్ధి అన్ని రంగాల్లో జరగాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి
-రాష్ట్ర వాస్తవ ఆర్థిక స్థితి పై శ్వేతపత్రం విడుదల చేయాలని బిజెపి తీర్మానం
-ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం – రాజకీయ తీర్మానం

ముందుగా అందరికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2014వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ప్రజలు ఏంతో నమ్మకంతో గెలిపిస్తే రాష్ట్రంలో నాటి ఎన్డీఏ భాగస్వామి అయిన టీడీపీ నేతృత్వంలో నవ్యంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం కలిగింది. సవ్యంగా సాగుతున్న ప్రభుత్వం వైకాపా ట్రాప్ లో పడి, 2018లో టీడీపీ ఎన్డీఏ నుండి బయటకు వచ్చిన అనంతరం రాష్ట్రంలో పాలన అదుపు తప్పి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం కలిగింది.

రాష్ట్రంలో నేడు ఏ వర్గానికి లేదా ఏ ప్రాంతానికి చెందిన ప్రజలను కదిలించినా రాష్ట్రంలో ప్రస్తుతం పాలన కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం చేస్తున్న సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ అరాచకాల పైనే చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల విధుల నిర్వహణలో పూర్తిగా వైఫల్యం చెంది అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ను అధ్వాన్న ఆంధ్రప్రదేశ్ గా మార్చి వేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో కేంద్రం అందించే సంక్షేమ పథకాలు మరియు కేంద్ర ప్రభుత్వ రైలు,జాతీయ రహదారులు మినహా రాష్ట్రంలో ఏ అభివృద్ధి లేదు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పాలనలో సృష్టించిన ప్రళయం ప్రభావం కనీసం రాబోయే 25 సంవత్సరాలు ఉంటుందని సర్వత్రా చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

1) ఆర్థిక బీభత్సం: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ రాష్ట్ర భవిష్యత్ కు శరాఘాతంగా మారింది. ఆదాయం సృష్టించే ఆస్తులు కల్పన లేకుండా అధికారిక, అనధికారిక అప్పులు మరియు పెండింగ్ బిల్లులు కలుపుకొని రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల అప్పుల వైపు చేర్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్ పని చేస్తున్నారు. పాలన వైఫల్యం వల్ల రాష్ట్రంలో ప్రతి పౌరుని నెత్తిపైన సగటున 2.50 లక్షల రూపాయల అప్పు భారం పడింది.

రాష్ట్ర ప్రభుత్వ వనరులైన పన్నుల ఆదాయం, అప్పులు మాత్రమే కాకుండా కేంద్రం ఇచ్చే నిధులను సైతం తమ జేబులోని స్వంత డబ్బులాగా ఇష్టారాజ్యంగా దారిమళ్లించిన ఘనత జగన్మోహన్ రెడ్డి పాలన పాటవానికి ప్రతీక. ఏ నెలలో అయిన సరే అప్పులు చేయకపోతే జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వైఎస్ఆర్సిపీ ప్రభుత్వం దిగజార్చింది. కొత్తగా తెచ్చే అప్పులు, ఇంతకుముందు చేసిన అప్పులపై ఉన్న వడ్డీలు, వాయిదాలు కట్టడానికి వాడే పరిస్థితి తప్ప రాష్ట్రానికి ఆదాయం సృష్టించే ఆస్తుల కల్పన కోసం వినియోగించకపోవడం శోచనీయం. ఇది రాష్ట్ర భవిష్యత్తును అంధకారమయం చేస్తున్నది. రాష్ట్ర వాస్తవ ఆర్థికస్థితి పైన శ్వేతపత్రం విడుదల చేయాలని బిజెపి తీర్మానం చేస్తోంది.

2) మౌలిక సదుపాయాల కల్పనలో అధమం: రాష్ట్ర పరిధిలోనే జాతీయ రహదారులను కేంద్రం అద్భుతంగా నిర్వహిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆర్ & బి మరియు పంచాయితీల రహదారులు మొత్తం గుంతల మయం. నిర్వహణ లోపం వల్ల గ్రామీణ ప్రాంతాలలో మరియు రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో పట్టణ రహదారులలో ప్రయాణం ప్రజలకు ప్రాణసంకటంగా మారింది. గడచిన నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రహదారుల మరమ్మతుకు సమీక్షలతో కాలం వెళ్లబుచ్చారు. కానీ కార్యక్షేత్రంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు వాస్తవ పరిస్థితి రాష్ట్రంలో ఉంది. రహదారుల నిర్మాణానికి బడ్జెట్ ఖర్చు మిగిలిన రాష్ట్రాల సగటు 4.5% అయితే, ఆంధ్ర ప్రదేశ్ ది 1.3% అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

3) పంచాయితీల హక్కుల హననం: గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు, వీటి పరిపుష్టికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం సిఫారసు మేరకు నేరుగా పంచాయతీలకు నిధులను ఇస్తుంటే, ఇప్పటి వరకు దాదాపు 9 వేల కోట్ల రూపాయిల మేరకు స్థానిక సంస్థల నిధులు దారి మళ్లించడం దారుణం. ఇక గ్రామ స్వపరిపాలను నిర్వీర్యం చేస్తూ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ మొదటి నుంచి ఘోషిస్తూనే ఉంది, కాగ్ సైతం రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆక్షచింది. భారత రాజ్యాంగంలో పొందుపర్చిన విధంగా విధులు నిర్వహించేందుకు స్థానిక సంస్థలకు ఉన్న అధికారాలను వైకాపా ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలకు బదలాయించింది. 73 మరియు 74వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా స్థానిక సంస్థలకు అధికారాల బదలాయింపు జరగాలని బీజేపీ తీర్మానిస్తోంది.

4) ఎస్సీ, ఎస్టీ, బిసి సబ్ ప్లాన్ నిధులు దారిమల్లింపు: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మొదటి నాలుగు సంవత్సరాలలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు బడ్జెట్ లో 1,02,700 కోట్ల రూపాయిలు కేటాయించి, అందులో 60 వేల కోట్ల రూపాయిలు పైగా కోత విధించారు. అలాగే ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు బడ్జెట్ లో 35 వేల కోట్ల రూపాయిలను కేటాయించి, అందులో 18 వేల కోట్ల రూపాయలకు పైగా కోత విధించారు. అంటే మొత్తం బడ్జెట్ కేటాయింపులు 1.62 లక్షల కోట్లలో 84 వేల కోట్ల రూపాయిల కోతలు విధించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి దక్కుతుంది . బడ్జెట్ కేటాయింపులలో కోతలు ఒక వైపు అయితే, మరో వైపు వాస్తవంగా వినియోగించిన నిధులు కూడా నేరుగా ఎస్సీ మరియు ఎస్టీలకు చట్టబద్దంగా అమలు చేయవల్సిన పథకాలను వారికి అందించకుండా నవరత్నాలు తరలించామని చెబుతున్నారు.

నా ఎస్సీలు … నా ఎస్టీలు అంటూ వారిని మోసం చేసిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి నిలిచిపోయారు. ఇక బిసిలకు కేటాయించిన నిధులలో దాదాపు 76 వేల కోట్ల రూపాయిలను రాష్ట్రంలోని వైకాపా ప్రనుత్వం పక్కకు తరించారని లెక్కలు చెబుతున్నాయి. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ మరియు బిసి కార్పొరేషన్ల ద్వారా ఆయా వర్గాలకు చట్టబద్ధంగా అందాల్సిన ఫలాలు జగన్ మోహన్ రెడ్డి దూరం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పక్కకు మళ్లించిన నిధులు వల్ల ఈ వర్గాలకు జరిగిన నష్టం లెక్క తేల్చి వారికి క్షమాపణ చెప్పాలని రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేస్తుంది.

5) రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు లేవు – యువతకు ఉపాధి లేదు: ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలం, కానీ రాష్ట్ర ప్రభుత్వ తీరు ప్రతికూలం. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పాలన నిర్ణయాల తీరు మరియు రాష్ట్రంలో అరాచక దాడులు వెరసి పరిశ్రమల ఏర్పాటుకు ప్రతికూలంగా మారాయి.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడగానే విద్యుత్ కంపెనీల ఒప్పందాల పీపీఏ లను రద్దు చేయడం, అమరావతిని నిర్వీర్యం చేయడంతో పారిశ్రామిక వేత్తలు రాష్ట్రం వైపు చూడలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లా కనిగిరి మరియు చిత్తూరు జిల్లా ఏర్పేడులలో వస్తు తయారీ పరిశ్రమల కోసం నిమ్జ్ ఏర్పాటుకు అనుమతి ఇస్తే వాటికి అవసరమైన 25 వేల ఎకరాల భూమి అందించడంలో విఫలం అయ్యింది. మనతో పాటు రాజస్థాన్ లో నిమ్జ్ ఏర్పాటుకు అనుమతి ఇస్తే, ఇప్పటికే పూర్తి చేసి 65 వేల కోట్ల పెట్టుబడులుతో 4 లక్షల మందికి ఉపాధి దొరికింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వల్ల కనీసం ఒక లక్ష కోట్ల పెట్టుబడులు మరియు కనీసం 6 లక్షల మంది ఉపాధి కోల్పోయాం.

దీనితో పాటు ఈ పరిశ్రమల వల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయం మరియు జీ ఎస్ డీ పీ కోల్పోయాం.
కేంద్రప్రభుత్వం 5 పారిశ్రామిక నోడులు విశాఖపట్నం వద్ద నక్కపల్లి నోడ్ – 6,848 ఎకరాలు , మచిలీపట్టణం నోడ్ – 12,145 ఎకరాలు, దొనకొండ నోడ్ – 17,117 ఎకరాలు, కొప్పర్తి నోడ్ – 2,596 ఎకరాలు, శ్రీకాళహస్తి -ఏర్పేడు నోడ్ – 23,324 ఎకరాలు సంబందించిన రాష్ట్రానికి కేంద్రం విశాఖ – చెనై పారిశ్రామిక కారిడార్ పరిధి క్రింద ఆమోదించి దాదాపు 5 సంవత్సరాలైనా రాష్ట్ర ప్రభుత్వం నిర్లిప్తత గా వ్యవహరించింది . చెనై – బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ క్రింద కృష్ణపట్నం నోడ్ – 12,944 ఎకరాలు పైన జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి శ్రద్ధ లేదు.

బెంగళూరు – హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్ క్రింద ఓర్వకల్లు నోడ్ – 9,350 ఎకరాలు, హిందూపూర్ నోడ్ – 3,000 ఎకరాలు మరియు అనంతపురం నోడ్ – 3,000 ఎకరాల నోడ్లను సకాలంలో పూర్తి చేసుకొని ఉంటే ఉత్తరాంధ్ర మరియు రాయలసీమలలో ఏర్పాటు చేసుకొనే పరిశ్రమలకు తరుగుదల మరియు పెట్టుబడి అలవెన్స్ ఆదాయపన్ను చట్టం క్రింద వెసులుబాటు వచ్చేవి, ఇప్పటికే కియా వంటి పరిశ్రమలు ఈ రాయితీలు పొందుతున్నాయి. విశాఖ – చెనై పారిశ్రామిక కారిడార్, చెనై – బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ మరియు బెంగళూరు – హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్ ఈ మూడు కారిడార్ల పరిధిలోని 9 నోడ్లకు ఒక లక్ష ఎకరాలు అవసరమని తెల్సిన ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం అడుగు ముందుకు పడలేదు.

6) రాజధాని అమరావతి : స్మార్ట్ సిటీ గా , హెరిటేజ్ సిటీగా రాజధాని అమరావతిని గుర్తించింది, ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదన ఆమోదించింది, రాజధాని నుండి రాయలసీమకు కొత్త జాతీయ రహదారి మరియు రాజధాని నుండి మచిలీపట్టణం కు రెండు వరసల రహదారిని నాలుగు వరుసల రహదారిగా తీర్చిదిద్దడం జరిగింది, అమరావతి రాజధాని చుట్టు పక్క ప్రాంతాల అభివృద్ధి కోసం అని కనకదుర్గ వారధి మరియు బెంజ్ సర్కిల్ వద్ద ఫ్లై ఓవర్లు పూర్తి చేయడం జరిగింది, ఇప్పుడు విజయవాడ తూర్పు మరియు పడమర బైపాస్ రోడ్లు రెండు వైపుల కలిపి 100 కిలోమీటర్ల బైపాస్ రోడ్లను ఎన్ హెచ్ ఏ ఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం వేస్తున్నది.

65 వేల కోట్లకు పైగా నిధులతో మొదలుపెట్టిన ఈ మౌలిక సదుపాయాలన్నీ పెట్టుబడుల ఆకర్షణకు ఉపయోగ పడేవే, రాష్ట్ర ఆర్ధిక చోదకశక్తి కోసం ఉపయోగ పడేవే. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతి రాజధానిగా ఎదగాలనే ఉద్దేశ్యంతో ల్యాండ్ పూలింగ్ లో భూములిచ్చిన రైతులకు వారి భూమి అమ్మకాల పైన మరియు బదలాయింపు పైన క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ మినహాయింపు ఇచ్చి ప్రోత్సహించింది. కేవలం జగన్మోహన్ రెడ్డి పాలన దృష్టి లోపం వల్ల ముందు పేర్కొన్న అన్ని ప్రాంతాలకు సంబందించిన పారిశ్రామిక వాడలు మరియు రాష్ట్ర రాజధాని నిర్మాణం నిర్వీర్యం చేయడం వల్ల రాష్ట్రంలో అడుగు పెట్టాలనుకున్న పారిశ్రామిక వేత్తలు బెంబేలెత్తారు.

7) అస్మదీయుల కోసం భూదోపిడి:
కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ని పక్కన పెట్టి, జగన్ తమ జేబు సంస్థ అయిన షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ మరియు ఇండోసోల్, సోలార్ అరబిందో కంపెనీలకు ఆర్ధిక సామర్ధ్యం లేకున్నా పవర్ ప్రాజెక్టులకోసమని 2.50 లక్షల ఎకరాల దారాదత్తం చేయడానికి ఆ కంపెనీలనుండి వచ్చిన ప్రతిపాదనలకు అనుకూలంగా ఎమ్ఓయు లకన్నా ముందే జీఓ లు ఇస్తే విశాఖపట్నం నుండి గతంలో ప్రశ్నిస్తే ఇప్పటివరకు సమాధానం రాలేదు.

అనుమతులున్న పారిశ్రామిక నొడులకు ఒక లక్ష ఎకరాలు ఇవ్వలేని ప్రభుత్వం, తమ జేబులోని స్వంత వారికి మాత్రం సామర్ధ్యం లేకున్నా 2.50 లక్షల ఎకరాలను ధారాదత్తం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవ్వడం సిగ్గు చేటు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పారిశ్రామిక ప్రగతిని నిర్వీర్యం చేశారు. తక్షణం అస్మదీయుల భూదోపిడికిi ఇచ్చిన ఉత్తర్వులు నిలుపుదల చేసి పారిశ్రామిక నోడ్లకు, పారిశ్రామిక కారిడార్ల అవసరమైన భూ కేటాయింపులు చేయాలని రాష్ట్ర కార్యవర్గం డిమాండు చేస్తుంది.

8) రాష్టంలో కరువు పరిస్థితి: రాష్టంలో కరువు ప్రభావంతో రైతాంగం కుదేలయింది. రాష్ట్రంలో కరువు దెబ్బకి 30 లక్షల ఏకరాల భూమి సాగుకు నోచుకోలేదు. రాష్ట్రంలో కరువు విషవలయంతో 15 వేల కోట్ల విలువైన పంట వేయలేదు. రాష్ట్రంలో రైతు వేసిన చేనుకు ఎకరాకు 20 వేలు అదనంగా నీటి తడికి ఖర్చు చేయవలసిన దుస్థితి నెలకొన్నది.

రాష్ట్రంలో 400 పైగా మండలాలు కరువు కోరల్లో చిక్కుకున్నప్పటికీ, అదేవిధంగా మిచౌగ్ తుఫాను సంధార్బంగా ప్రభుత్వం వహించిన నిర్లక్ష వైకరికి, పంటలు తీవ్రంగా నష్టపోయిన రైతాంగం పట్ల ఈ ప్రభుత్వం వహించిన ఉదాశీన వైఖరినని కార్యవర్గం ఖండిస్తోంది. ఈ పరిస్థితి పైన కనీసం రాష్ట్ర క్యాబినెట్ లో చర్చించకపోవడం రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యవసాయ రంగంపై ఉన్నటువంటి నిర్లక్ష్యానికి నిదర్శనం.

9) రైతుల ఆత్మహత్యలు: దేశంలో రైతుల ఆత్మహత్యలలో మూడవ స్థానం మరియు రైతుల నెత్తి పైన సగటు అప్పులలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యధికంగా ఉంది. గాలేరు – నగిరి, హంద్రీ – నీవా, వెలిగొండ, గుండ్లకమ్మ, గుండ్రేవుల,తోటపల్లి వంటి నీటి ప్రాజెక్టుల పూర్తి చేయడంలో వైఫల్యం వల్ల మరియు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించడంలో వైఫల్యం, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సకాలంలో స్పందించకపోవడం వల్ల రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరగడానికి కారణం.

రాష్ట్రంలో అన్ని శాఖలలో అవినీతి కంపు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయి, చివరకు పాలనలో భాగమైన అధికారులకు రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నా పాలన విధానాల వలన తమ భవిష్యతు ఇబ్బందులలో పడే ప్రమాదం ఉండనే భయాందోళనలు అలముకున్నాయి. తద్వారా రాష్ట్రంలో పాలన పూర్తిగా పడకేసింది. ఇదే సమయంలో అంగన్వాడీ ఆయాల నుండి మున్సిపల్ సిబ్బంది మరియు అన్ని విభాగాల ఉద్యోగులు, ముఖ్యంగా జగన్ మానసిక పుత్రిక వాలంటీర్లు సైతం చేస్తున్న సమ్మెల మరియు ధర్నాల నినాదాలకు రాష్ట్రం మొత్తం ప్రభుత్వ వ్యతిరేకత హోరెత్తిపోతుంది. రాబోయే కొత్త సంవత్సరం 2024 లో ఏర్పడే కొత్త రాష్ట్ర ప్రభుత్వంలో ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుందని ఆశిద్దాము.

రాబోయే మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయు.అనేక పార్టీలు మాయమాటలతో తప్పుడు వాగ్దానాలతో మళ్లి మన ముందుకు వస్తున్నాయి. కావున ఈ రాష్ట్ర అభివృద్ధి అన్ని రంగాల్లో జరగాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఇక్కడ రావాలి. నేడు నరేంద్రమోడీ ఆధ్వర్యంలో దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నది.ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక్కసారి బిజెపి కి అవకాశం ఇచ్చి ఆంధ్ర ప్రదేశ్ ని అన్ని రంగాలలో ప్రగతి పధం లో నడిపించడానికి అవకాశం రాష్ట్ర ప్రజలను ఈ కార్యవర్గం నుండి అభ్యర్దించడం జరుగుతుంది.

LEAVE A RESPONSE