– 34 స్థానాల్లో విజయభేరి
– ముగ్గురు మంత్రులున్నా పలికే దిక్కులేదు
– పవన్ దగ్గరకు వెళ్లలేని పరిస్థితి
– దుర్గేష్ దగ్గర అంతా జనసైనికులే
– వాసంశెట్టికి తమ్ముళ్లెవరో తెలియని వైచిత్రి
– ఆయన దగ్గర పాత వైసీపీ నేతలదే హవా
– జిల్లా అధ్యక్షుల మౌనవ్రతం
– అసలు ఆఫీసులకే రాని నైరాశ్యం
– పార్టీలో ఏ హోదా లేకున్నా అన్నీ తానై ‘సాన’ పడుతున్న నేత
– విజయవాడ నోవాటెల్‌లో అడ్డా
– ఎమ్మెల్యేలతో భేటీ స్థాయికి ఎదిగిన వైనం
– ఎవరికి చెప్పుకోవాలో తెలియక తమ్ముళ్ల తకరారు
– ఉభయ గోదావరి జిల్లాల్లో తమ్ముళ్ల తంటాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీలో ఉభయ గోదావరి జిల్లాలు కూటమికి 34 సీట్లు కట్టబెట్టాయి. అధికార వైసీపీని ఊడ్చిపారేసి కూటమికి అధికారం కట్టబెట్టిన జిల్లాలవి. రాష్ట్రంలో టీడీపీ బలంగా ఉన్న ఆ రెండు జిల్లాలు, ఇప్పుడు కార్యకర్తలను పలకరించే దిక్కులేని అనాధగా మారాయి. సొంత పార్టీ అధ్యక్షులు అసంతృప్తితో ఇంటికే పరిమితమయితే.. కూటమిలోని జనసేన మంత్రుల వద్ద తమ్ముళ్లకు ప్రవేశం లేని దుస్థితి. ఉన్న ఇద్దరు పార్టీ మంత్రుల్లో ఒకరు విజయవాడ-పోలవరానికి పరిమితమైతే.. ఎన్నికలకు 25 రోజుల ముందు పార్టీలో చేరిన మరో మంత్రి వద్దకు వెళ్లలేని దయనీయం. అక్కడంతా పాత పార్టీవాసనలే. ఈ గందరగోళ పరిస్థితిని ఆసరాగా చేసుకున్న ఓ నేత కాకినాడ జిల్లాలో, ‘సాన’బడుతున్నారు. ‘అన్నీ తానై’ చుట్టేస్తున్నారట. పోనీ ఆయనకేమైనా పార్టీలో పదవి ఉందా అంటే అదీలేదు. విజయవాడ నోవాటెల్‌లో అడ్డా వేసిన ఆయనను పట్టుకుంటే చాలు. అన్ని పనులూ అయిపోతాయట. పైవారి ఆశీస్సులున్నాయన్నది ఆయన చేసుకునే ప్రచారం. దానికి కారణం గత ఎన్నికల్లో ‘కీలక బాధ్యతలు’ నిర్వహించారు కాబట్టి! మరి పార్టీ జెండాను భుజం పుండ్లు పడేలా మోసిన తెలుగుతమ్ముళ్లు ఎవరిని కలవాలి?.. ఇదీ ఉభయ గోదావరి జిల్లా తమ్ముళ్ల ఉక్కపోత.
అధికారం వచ్చిన ఆనందం ఉభయ గోదావరి జిల్లా తమ్ముళ్లలో కనిపించడం లేదు. ఇది మునుపటి కాలానికి భిన్నమైన వాతావరణం. సొంత ఇంట్లో ఉంటూనే పరాయి ఇంట్లో ఉన్నామన్న భావన. పిలిస్తే పలికేవారెవరూ లేరు. మంత్రులున్నా ఎవరి దారి వారిదే. ఎవరిని కలవాలో తెలియని అయోమయం. తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల్లో పనిచేస్త్ను టీడీపీ శ్రేణులు-నేతల్లో నెలకొన్న భావన ఇది.
గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు ఇలాంటి భిన్నమైన వాతావరణం కనిపించకపోడమే, ఈ గందరగోళానికి అసలు కారణమంటున్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య నియోజకవర్గాల స్థాయిలో సమన్వయం లేకపోవడం.. పార్టీ స్థాపించిన నాటి నుంచి టీడీపీలో పనిచేస్తున్న నాయకుల గురించి కొత్తగా ఎన్నికైన జనసేన-బీజేపీ ఎమ్మెల్యేలకు అవగాహన లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
పార్టీ సైనికులను నడిపించాల్సిన జిల్లా పార్టీ అధ్యక్షులే నిర్వేదంతో ఉన్న పరిస్థితి. కష్టపడి పనిచేసిన నేతలు, తమ సంగతి చూడాలంటూ జిల్లా అధ్యక్షుల వద్దకు వెళితే.. ‘మాకే దిక్కులేదు. ఇక మీకేం సిఫార్సు చేయా’లంటూ నిర్లిప్తంగా మాట్లాడుతున్న వైనం, పార్టీ నేతలను ఖంగుతినిపిస్తోంది. అసలు కొంతమంది జిల్లా అధ్యక్షులయితే పార్టీ ఆఫీసుల ముఖమే చూడని వైచిత్రి. ఇంకొందరు ఉండీ లేనట్లు వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో టికె ట్ ఆశించిన ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, గన్ని వీరాంజనేయులు ఇంకా అదే నిర్వేదంతో ఉన్నారు.
గత ఎన్నికల్లో ఉండి టికెట్ ఆశించి భంగపడిన రామరాజు ప్రస్తుతం అంతపెద్ద ఉత్సాహంతో కనిపించడం లేదు. ఇదే తరహాలో టికెట్ ఆశించిన రాజమండ్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జవహర్‌దీ అదే పరిస్థితి. ఆయనకు ఎన్నికల ముందు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి బుజ్జగించిన విషయం తెలిసిందే. తన తండ్రి జ్యోతుల నెహ్రుకు మంత్రి పదవి వస్తుందని గంపెడాశ పెట్టుకుని భంగపడిన, కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఎక్కడా కనిపించటం లేదు. ఆయన పార్టీ ఆఫీసుకు సైతం రావడం మానేశారంటున్నారు. అమలాపురం జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి కూడా అంతంత మాత్రంగానే పనిచేస్తున్నారు.
జిల్లాల్లో పార్టీని ఉత్సాహంతో నడపాల్సిన అధ్యక్షులే నీరసంగా, నిర్లిప్తతతో ఉండటంతో.. నియోజకవర్గ స్థాయి నేతలు, కార్యకర్తలు తమ సమస్యలు ఎవ రికి చెప్పాలో తెలియక అయోమయంలో ఉన్నారు. ప్రధానంగా అధికారంలోకి వచ్చినందున, పదవులు అభ్యర్ధించేందుకు వెళ్లే నేతలు.. జిల్లా అధ్యక్షులే నీరసంగా ఉండటంతో ఖంగుతినాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
పోనీ తమ రెండు జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రుల తలుపు తడదామా అంటే అక్కడో విచిత్ర వాతావరణం. పశ్చిమ గోదావరి మంత్రి నిమ్మల రామానాయుడు వద్దకు వెళితే, ఆయన ఎప్పుడు ఉంటారో, ఎక్కడ ఉంటారో తెలియదు. కారణం ఆయన పోలవరం ప్రాజెక్టుపై దృష్టి సారించడం. ఎక్కువ కాలం విజయవాడలో గడుపుతుండటమే. తూర్పు గోదావరి జిల్లా విషయానికొస్తే.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇప్పటికి మూడుసార్లు జిల్లాకు, పిఠాపురం నియోజకవర్గానికి వచ్చారు. ఆ సందర్భంలో ఆయన ఎవరినీ కలవలేదు. సమీక్షలతోనే సరిపెట్టారు. పైగా ఆయనకు జిల్లాలో టీడీపీ నేతలతో పెద్ద పరిచయాల్లేవు. దానితో ఆయనను కలవడం తమ్ముళ్లకు కష్టమవుతోంది.
ఇక జనసేన మరో మంత్రి కందుల దుర్గేష్ దగ్గర జనసైనికులే ఎక్కువ కనిపిస్తున్నారు. స్థానిక టీడీపీ నేతలతో ఆయనకు పెద్దగా సంబంధాలు లేవంటున్నారు. దానితో టీడీపీ శ్రేణులు దుర్గేష్ వ ద్దకు వెళ్లలేని పరిస్థితి. అలాగే ఎన్నికలకు 25 రోజుల ముందు.. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మంత్రి వాసంశెట్టి సుభాష్ దగ్గర, ఎక్కువగా గతంలో వైసీపీలో పనిచేసిన వారే కనిపిస్తుండటం, ఆయనకు స్థానిక టీడీపీ నేతలతో సంబంధాలు లేకపోవడంతో ఆయన వద్దకూ వెళ్లలేని పరిస్థితి. ఇలాంటి విచిత్ర పరిస్థితి.. అందరూ ఉన్నా ఎవరూ లేని అనాధలా ఉందని పార్టీ సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలాఉండగా, ఈ అయోమయ-గందరగోళ పరిస్థితిని ఆసరా చేసుకున్న ఓ నేత.. జిల్లాను బాగా ‘సాన’పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి ఆ ‘సాన’పట్టే నేతకు పార్టీ సభ్యత్వం కూడా లేదని, కానీ అగ్రనేతల పరిచయాలు అడ్డుపెట్టుకుని జిల్లాలో ఏ పనికావాలన్నా తనను కలవాలని చెబుతున్నారట. ఈ ‘సాన’ పడుతున్న నేత.. ఎన్నికల ముందు పార్టీ అప్పగించిన కొన్ని కీలక బాధ్యతలు నిర్వహించారని, దానిని అడ్డుపెట్టుకుని జోన్ ఇన్చార్జి హోదాలో జిల్లాను ‘సాన’పడుతున్నారన్నది తమ్ముళ్ల ఆరోపణ.
ఈ నేత కాకినాడ మాత్రమే కాకుండా విజయవాడ నోవాటెల్ హోటల్ 9వ ఫ్లోర్‌లో మూడుగదులు తీసుకుని పనులు సానబడుతున్నారని తమ్ముళ్లు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం నోవాటెల్‌లో ఈ నేత నిర్వహించిన సమావేశానికి తుని ఎమ్మెల్యే యన మల దివ్య మినహా, ఎమ్మెల్యేలంతా హాజరయ్యారంటే.. ఈయన ఏ స్థాయిలో ‘సాన’పెడుతున్నారో అర్ధమవుతోందని, తమ్ముళ్లు విశ్లేస్తున్నారు. ఇటీవల కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసిన నేతకు ఈయన అత్యంత సన్నిహితుడని, అసలు సదరు వైసీపీ అభ్యర్ధే.. ఈ ‘సాన’బట్టేనేతను టీడీపీలోకి పంపారన్న మరో ప్రచారం కూడా టీడీపీ వర్గాల్లో జరుగుతోంది. ఈ నేత జనసేన అధిపతి పవన్ కల్యాణ్, కాకినాడ ఎంపి శ్రీనివాస్‌పై కార్యకర్తల వద్ద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న విషయం, జనసైనికులు పవన్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. కారణం ఆయన ఈ ఎన్నికల్లో కాకినాడ ఎంపీ సీటు ఆశించి భంగపడటమేనంటున్నారు.
‘ఒకవేళ దురదృష్టవశాత్తూ జనసేన-టీడీపీ సంబంధాలు చెడిపోతే అందుకు ఈ ‘సాన’బట్టే నాయకుడే కారణమవుతారు. అలా ఉంది ఆయన నోటిదురుసు’ అని ఓ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ రెండుపార్టీల మధ్య సఖ్యత బాగుందని, అది కొనసాగాలంటే ఇలాంటి ‘సాన’ బట్టే నేతలపై నాయకత్వం దృష్టి సారించాలని తమ్ముళ్లు సూచిస్తున్నారు.
కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో తమ్ముళ్ల తిప్పలు
ఇదిలాఉండగా ఎన్నికలకు కొద్దినెలల ముందు.. అంతకు రెండేళ్ల ముందు పార్టీలో చేరి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారితో తమ్ముళ్లు సర్దుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. చివరకు పార్టీ స్ధాపించిన నాటి నుంచి పనిచేస్తున్న సీనియర్లు కూడా, పార్టీ మారిన కొత్త ఎమ్మెల్యే ముందు తమ విధేయత చాటుకోవలసిన దుస్థితి ఏర్పడిందంటున్నారు. ఇక ఎన్నికలకు కొద్దినెలల ముందు పార్టీలో చేరి గెలిచిన వారి నియోజకవర్గాల్లో పరిస్థితి దారుణంగా ఉందని చెబుతున్నారు.
పార్టీలో కొత్తగా చేరిన ఎమ్మెల్యేల అనుచరులు, ఎప్పటినుంచో టీడీపీలో ఉన్న వారిపై చాడీలు చెబుతుంటే నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి. వారి చుట్టూ కూడా పార్టీ మారిన నేతలే కనిపిస్తుండటంతో, ‘ఇక తాము పార్టీకి దూరమయ్యామన్న’ మానసిక పరిస్థితికి చేరుతున్న వాతావరణం, ఆయా నియోజకవర్గాల్లో నెలకొంది. చివరకు తమను వైసీపీ ఏజెంట్లుగా చిత్రీకరిస్తున్న తీరుపై, తమ్ముళ్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వీరి తీరుతో తాము పరాయివారిగా మారాల్సిన దయనీయం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిస్థితిలో తమకు నామినేటెడ్ పదవుల సిఫార్సు సంగతి అటుంచి, కనీసం నియోజకవర్గంలో చిన్న చిన్న పనులు కూడా కావడం కష్టమేనన్న నిరాశ అప్పుడే మొదలయింది. దీనికి పార్టీ నాయకత్వమే పరిష్కారమార్గం సూచించాలంటున్నారు. పార్టీ మారి కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలతో, ఎన్నాళ్ల నుంచో కాపాడుకుంటూ వస్తున్న తమ అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్న ‘పుట్టు టీడీపీ’ నేతల ఈతి బాధలను, నాయకత్వం ఏవిధంగా పరిష్కరిస్తుందో చూడాలి.