Suryaa.co.in

Andhra Pradesh

గోదావరి నీళ్లు రాయలసీమకు

-యువతకు 5 ఏళ్లల్లో 20 లక్షల ఉద్యోగాలు
-తొలి సంతకం మెగా డీఎస్సీ మీదే
-బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ – రక్షణ చట్టం – స్పెషల్ సబ్ ప్లాన్
-ప్రజాగళం సభలు సూపర్ హిట్ – సిద్ధం సభలు అట్టర్ ఫ్లాప్
-డ్రిప్ ఇరిగేషన్, సబ్సిడీ పథకాలతో రైతును రాజు చేస్తాం
-జగన్ కట్టుకథలు నమ్మడానికి జనం సిద్ధంగా లేరు
-రాప్తాడు ప్రజాగళం సభలో టీడీపీ జాతీయ అధ్యక్షలు నారా చంద్రబాబు నాయుడు

ఎన్నికల యుద్ధానికి సై అంటూ రాప్తాడు రంకేస్తుంది. తెలుగు తమ్ముళ్ల పౌరుషానికి ప్రజల మద్ధతు తోడయ్యింది. పోట్ల గిత్తల్లా తమ్ముళ్లు దూసుకుపోతున్నారు.ఇది పసుపు జెండా పౌరుషం. ఇది తెలుగుదేశం పార్టీ మీకు ఇచ్చిన ధైర్యం. పరిటాల రవీంద్ర నేర్పించిన పోరాటం. ప్రజల కోసం తాను నమ్మిన సిద్ధాంతం కోసం తన ప్రాణాన్ని ఇచ్చిన పరిటాల రవీంద్రను స్మరించుకుందాం.

ఇంక 46 రోజులే ఉంది కాబట్టి మీరంతా రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీ భుజస్కంధాల మీద పెట్టుకోవాలి. ప్రజాగళం ఎక్కడ చూసిన సూపర్ డూపర్ హిట్. జగన్ రెడ్డి మనమంతా సిద్ధం సభలు ఫ్లాప్ షోలు అయ్యాయి. రాప్తాడులో జగన్ ఎండలో పెడితే ఇంత మంది వస్తారా? డబ్బులు, మద్యం ఇచ్చినా జగన్ సభలకు వైసీపీ కార్యకర్తలు రావడం లేదు. ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం. అందుకే మూడు పార్టీలు కలిసి బరిలోకి వచ్చాం. రాష్ట్రం కోసం, 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్ కోసం కలిశాం.

దెబ్బతిన్న రైతాంగం కోసం, మీ బిడ్డల ఉద్యోగాల కోసం, మహిళల రక్షణ కోసం, బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవం కోసం కలిశాం.విధ్వంసమైన రాష్ట్రాన్ని పున:నిర్మాణం కోసం మాకు మద్ధతు ఇవ్వాలని కోరుతున్నాం. ప్రజా ప్రభుత్వం కోసం ప్రతి ఒక్కరు మీ ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మొన్నటి వరకు బెదిరించారు, కేసులు పెట్టారు. ఇప్పుడు ఎన్నికల కమీషన్ వచ్చింది ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. జగన్ ఇంటికి వెళ్లాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి.

5 ఏళ్లల్లో ఆడబిడ్డలు ఏం కోల్పోయారో ఆలోచించుకోవాలి. ఒక అహంకారి విధ్వంసంతో రాష్టాన్ని లూటీ చేసి పేదలను నిరుపేదలుగా మార్చిన దుర్మార్గుడిని అంతం చూడాలి. జగన్ రెడ్డి ఒక సైకో అయితే ఇక్కడ కూడా ఒక పిల్ల సైకో తయారయ్యాడు. ఫ్యాన్ కు ఓటేసిన వాళ్లు నేడు ఫ్యాన్ కి ఉరేసుకోవాల్సిన పరిస్థితికి దిగజార్చారు. కరెంట్ ప్రతి ఇంట్లో ఉంది. కరెంట్ చార్జీలు తగ్గిస్తానని జగన్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పారు. నాడు రూ.500 బిల్లు నేడు రూ.1000, పెరిగింది. అంటే 12 నెలలకు రూ.6వేలు, 5 ఏళ్లల్లో రూ.30వేలు నష్టపోయారు.

5 ఏళ్ల టీడీపీ పాలనలో కరెంట్ చార్జీలు పెరగలేదు. కాని నేడు పెరిగాయి. ఇదే సమర్ధుడికి, అసమర్ధుడికి ఉన్న తేడా. ఇప్పటికి 9 సార్లు కరెంట్ బాధుడు పెంచారు. రైతు మోటర్లకు మీటర్లు బిగించి రైతు మెడలకు ఉరితాడు వేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. రాబోయే రోజుల్లో రైతులకు మంచి రోజులు వస్తాయి. అవసరమైతే మీ పొలంలోనే కరెంట్ తయారుచేసుకొని మీరు కొంత వాడుకొని మిగిలితే కొంత ప్రభుత్వానికి ఇచ్చే పరిస్థితికి తీసుకువస్తాం.

రోజంతా కష్టపడి రాత్రికి ఒక పెగ్ వేసుకొని శారీరక అలసట తీసుకొని మళ్లీ మరుసటి రోజు పనికి వెళతారు. మీ బలహీనతే జగన్ రెడ్డి బలం. అందుకే ధరలు పెంచితే తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి ప్రజలను మోసం చేశారు. క్వార్టర్ రూ.60 బాటిల్ ఇప్పుడు రూ.200 అయ్యింది. ఒక బాటిల్ మీద రూ.140 కొట్టేసే జలగ జగన్ రెడ్డి. నాశిరకం మద్యం కిక్ ఇవ్వలేదని మరో బాటిల్ తీసుకుంటారు. అంటే రోజుకు రూ.400 మద్యం తాగుతారు.

అంటే జలగల రక్తాన్ని పీల్చినట్లు జగన్ రెడ్డి మీ డబ్బులు లాగేస్తున్నారు. ఈ డబ్బులన్ని తాడేపల్లి ప్యాలెస్ కి పోతున్నాయి. నెలలో 15 రోజులకు గాను రోజుకు ఒక క్వార్టర్ బాటిల్ చొప్పున తాగితే మీ మీద ఏడాదికి రూ.18వేలు, రెండు బాటిల్స్ అయితే రూ.36వేలు పడుతుంది. ఈ పని వలన ఇంట్లో మగవాళ్లు డబ్బులు ఇవ్వడం లేదు. మద్యపాన నిషేదం చేస్తేనే ఓటు అడుగుతానని జగన్ రెడ్డి చెప్పాడా లేదా? కాని ఇప్పుడు ఎందుకు ఓటు అడుగుతున్నాడు?

మద్యపాన నిషేదం దేవుడెరుగు. తన ఆదాయం కోసం నాశిరకం మద్యాన్ని ఇస్తున్నారు. మా ఆడబిడ్డల తాళిబొట్లు తెంచేస్తున్న దుర్మార్గుడు ఈ జగన్ రెడ్డి. మీ కుటుంబాలు ఆనాద కుటుంబాలు అయిపోతున్నాయి. ప్రతి ఒక్క మద్యం అలవాటు ఉన్న కుటుంబం ఒక సారి ఆలోచించుకోండి. దేవుడు ఇచ్చిన ఇసుకను దోచేస్తున్నారు. ఇసుక నుంచి తైలం తీసేనాయకులు వైకాపా దొంగలు. 5 ఏళ్లు దోపిడీ చేశారు. భవన నిర్మాణ కార్మికులు నాశనం అయ్యారు. ఆత్మహత్యలు చేసుకున్నారు. భవన నిర్మాణం కుదేలయ్యింది.

రాప్తాడు ఇసుక రాప్తాడులో దొరకదు కాని రాప్తాడు ఇసుక బెంగళూరులో దొరుకుతుంది. అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పెద్ద తోపు. చిన్న చిన్న కాంట్రాక్టులందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో 40 లక్షల మంది ఇసుక మీద ఆధారపడి ఉన్న భవన నిర్మాణ కార్మికులు దెబ్బతిన్నారు. డీజిల్, పెట్రోల్ విపరీతంగా తెలిపోతుంది. బోర్డర్ ఉన్న వాళ్లు పొరుగు రాష్ట్రాలకు వెళుతున్నారు. కొంత మంది పక్క రాష్ట్రాలకు వెళ్లి మద్యం తాగి, పెట్రోల్, డీజిల్ కొట్టించుకొని వస్తున్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం పోయింది.

పెట్రోల్, డీజీల్, కరెంట్ చార్జీల వలన నిత్యావసర ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజీల్ పెరగడంతో ఒక్కో వాహనానికి రూ.12వేలు అధనంగా ఖర్చు పెడుతున్నారు. ఇక ఆటో కార్మికుల బాధలు చెప్పాల్సిన అసవరం లేదు. జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ అని హామీఇచ్చి ఒక్కటి నెరవేర్చలేదు. అనంతపురంలో ఒక పరిశ్రమ పెట్టారా? ఒక్కరికి ఉద్యోగం ఇచ్చారా? జాబు రావాలంటే బాబు రావాలి.

మన హయాంలో కియా మోటార్లు వచ్చింది. జాకీ పారిపోవడం జగన్ రేంజ్. దేశంలో ఉండే ఎక్కువ నిరుద్యోగులు ఏపీలోనే ఉన్నారు. మన బిడ్డకు మంచి ఉద్యోగం తల్లిదండ్రుల్ని చూసుకుంటారని భావిస్తాం. కాని నేడు మన యువతకు ఉద్యోగాలు లేవు. నాలెడ్జ్ లో ప్రపంచానికి తెలుగువారిని పంపిన ఘనత తెలుగుదేశానిది అయితే నిరుద్యోగులను పెంచిన ఘనత జగన్ రెడ్డిది.

యువత ఆవేశంలో ఉంటారు, ఊహలు ఆకాశంలో ఉంటాయి. ఆలోచనలకు అవకాశం రాకపోతే నిరుత్సాహానికి గురయ్యి జే బ్రాండ్ కి, గంజాయి, డ్రగ్స్ కి అలవాటు పడతారు. అంటే యువతను చెడు దారిలో పెట్టి జాతిని నిర్వీర్యం చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. సైకిల్ కు, మిత్ర పక్షాలకు ఓటు వేస్తే మీ సమస్యల పరిష్కారానికి దారి చూపే బాధ్యత మాది. కరువు జిల్లా అయినా అనంతపురం జిల్లా నుంచి మహబూబ్ నగర్ కు వలసలు వెళ్లిపోతున్నారు. అది గ్రహించిన ఎన్టీఆర్ హంద్రీనీవాను ప్రారంభించారు.

కృష్ణా జలాలు అనంతపురానికి రావాలని కృషి చేశాం. 2014లో జీడిపల్లి, చెర్లోపల్లి, మారాలాను పూర్తి చేయడంతో పాటు కియా కోసం గొల్లపల్లిని పూర్తి చేశాం. మీ రాష్ట్రానికి వచ్చిన నీళ్లు లేవని కియా యాజమాన్యం నన్ను ప్రశ్నిస్తే ఒక 6 నెలల సమయం ఇవ్వండి గొల్లపల్లిని పూర్తి చేస్తా నీళ్లు ఇస్తానని చెప్పిన సమయంలో ప్రాజెక్టును పూర్తి చేసి కియాను తెచ్చి మొదటి కారును ప్రారంభించాం.

పేరూరు కు నీళ్లు తీసుకురావడంతో పాటు జిల్లాలో ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు ఇవ్వాలనుకోవడం నా తప్పా? అనంతపురంలో పండ్ల తోటలు, కూరగాయాలు ద్వారా ప్రపంచానికి అందించవచ్చని ఉద్దేశ్యంతో 90 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. కాని నేడు అవన్ని ఉన్నాయా? నేను చెక్ డ్యాంలు, పంటకుంటలు తవ్వించా. 2019లో పోటుగాడు వస్తాడని నమ్మి మోసపోయారు. సీమలో ఉండేవారందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. 52సీట్లకుగాను 49 సీట్లను గెలిపించిన వైసీపీ ఏం ఒరగపెట్టింది? ఈసారి 52కి 52 సీట్లు టీడీపీని గెలిపిస్తారా అని అడుగుతున్నాను.

సాగునీటి ప్రాజెక్టుకోసం ఐదేళ్లల్లో రూ.68వేల కోట్లు ఖర్చు పెట్టాం. రాయలసీమకు రూ.12వేల కోట్లు ఖర్చు పెట్టాం. జగన్ కనీసం రూ.2వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. సాక్షికి ఇచ్చిన డబ్బులు కూడా ఈ రైతులపై ఖర్చు చేయలేని దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. సాక్షి పేపర్ ని వాలంటీర్లు చదవాలని ప్రభుత్వం డబ్బులిస్తే అది తప్పు అని, ఆ జీవోని హైకోర్టు కొట్టేసింది. అధికార దుర్వినియోగంలో జగన్ రెడ్డి దిట్ట.

అనంతపురంలో అన్ని నియోజకవర్గాలు గెలిపిస్తే అభివృద్ధి చేసే బాధ్యత మాది. సీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా? టీడీపీ రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా చేస్తే జగన్ రెడ్డి వైసీపీ మాఫియాగా చేసి సైకో రాజ్యంగా మార్చారు. 95 శాతం హామీలు అమలు చేశానని జగన్ రెడ్డి గొప్పలు చెబుతున్నారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా తేలేకపోవడమేనా జగన్ రెడ్డి విశ్వసనీయత?, మద్య పాన నిషేదం చేస్తే గాని ఓట్లు అడగనని అన్నాడు చేయకపోవడమేనా జగన్ రెడ్డి విశ్వసనీయత?

వారంలో సీపీఎస్ రద్దు చేస్తానని అన్నారు చేయకపోవడమేనా జగన్ రెడ్డి విశ్వసనీయత, ప్రతి ఏటా జాబ్ ఇస్తానన్నాడు ఇవ్వకపోవడమేనా జగన్ రెడ్డి విశ్వసనీయత. ఏ ఒక్కరికి ఒక్క ఉద్యోగం ఇవ్వపోడమేనా జగన్ రెడ్డి విశ్వసనీయత. మెగా డీఎస్సీ ప్రతి ఏటా ఇస్తానన్నాడు కాని ఇవ్వకపోవడమేనా జగన్ రెడ్డి విశ్వసనీయత. ప్రతి ఏడాది జనవరి 1న జాబ్ క్యాలెండర్ అన్నారు ఇచ్చారా లేదా? కరెంట్ ఛార్జీలు పెంచను అన్నాడు పెంచాడా లేదా?

పోలవరం పూర్తి చేస్తానని చెప్పి గోదావరి లో ముంచారు. గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకువచ్చే బాధ్యత టీడీపీ, ఎన్డీఏ తీసుకుంటుంది. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వడమే మా బాధ్యత. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ. నీరొస్తే పరిశ్రమలు వస్తాయి, హార్టికల్చర్ పంటలు వస్తాయి. పంటలుపండితే రైతులకు ఆదాయం వచ్చి ఆస్తుల విలువ పెరుగుతుంది. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దానిని సంక్షేమానికి ఖర్చు చేయవచ్చు.

ఆడబిడ్డలకు ఆడబిడ్డ నిధి కింద కుటుంబంలో ప్రతి ఒక్కరికి రూ.1,500 ఇస్తాం. అంటే ఒక కుటుంబంలో ఒక ఆడబిడ్డ ఉంటే ప్రతి నెలకు రూ.1,500 ఇస్తాం, ఇద్దరుంటే రూ.3,000, ముగ్గురుంటే రూ.4,500, నలుగురుంటే రూ.6,000 ఇస్తాం. అందరికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ప్రతి ఇంట్లో ఎంత మంది విద్యార్ధులంటే అందరికి అమ్మ ఒడి ఇస్తానని హామీనిచ్చి, ఇవ్వకుండా మోసం చేశాడు. తల్లికి వందనం కింద ఒక్కో విద్యార్ధికి రూ.15,000 చొప్పున కుటుంబంలో ఎంత మంది విద్యార్ధులుంటే అందరికి ఇస్తాం.

జనాభా మన సంపద. మీరు పిల్లల్ని చదివిస్తే ప్రపంచాన్ని జయించి కుటుంబాన్ని చూసుకునే శక్తి మా తమ్ముళ్లకు ఉంది. దీపం పథకం కింద ఏటా 3 సిలెండర్లు మా ఆడబిడ్డలకు ఇస్తాం. ఎర్రబస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. మహిళల ద్వారా పేదరిక నిర్మాలన చేయాలనుకుంటున్నాను. ఎన్టీఆర్ ఆడబడుచులకు ఆస్తిహక్కు తెచ్చారు. రాష్ట్రంలోని మహిళా శక్తిని ప్రపంచంలోనే అత్యంత శక్తి వంతంగా తీర్చిదిద్దుతాను. పరిశ్రమలు తీసుకువచ్చి ఏటా 4 లక్షల చొప్పున 5 ఏళ్లకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం.

ఉద్యోగం వచ్చే వరకు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తాం. తొలి సంతకం మెగా డీఎస్సీ మీద పెడతాను. అనంతపురానికి వెళ్లే పని లేకుండా రాప్తాడులోనే పని చేసే విధంగా చేస్తాం. మంచి నీటి రక్షణ పథకం కింద కుళాయి ద్వారా నీళ్లిస్తాం. బీసీలంటే నా ఎంతో అత్యంత ప్రీతిపాత్రం. 50 ఏళ్లకే పెన్షన్, బీసీలకు రక్షణ చట్టం, బీసీల కోసం స్పెషల్ సబ్ ప్లాన్, ఆంక్షలు లేకుండా మొదటి తారీఘున రూ.4వేలు పింఛన్ ఇచ్చే బాధ్యత నాది.

ఎన్టీఆర్ ఫించన్ ప్రారంభించారు. రూ.200 నుంచి రూ.2000 పింఛన్ పెంచింది తెలుగుదేశం. రైతులందరికి డ్రిప్ ఇరిగేషన్, సబ్సిడీ పథకాలు అమలు చేస్తాం. రైతును రాజు చేసే బాధ్కత మాది. సాగు నీటి ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేస్తాం. తోపుదుర్తి బ్రదర్స్ కమీషన్లతో దోపిడీ చేస్తున్నారు. రూ.15 కోట్ల కక్కుర్తితో జాకీ ఎగిరి తెలంగాణ అడుగుపెట్టింది. అది వచ్చి ఉంటే వందల మంది మహిళలకు ఉద్యోగాలు వచ్చి ఉండేవి. ఆటోనగర్ భూములు కబ్జా చేసే కుట్రకు తెరతీశారు. మహిళా ఢైరీలో లీలలు చేశారు.

ఒకప్పుడు అభివృద్ధిలో ముందున్న రాప్తాడు నేడు అవినీతి, భూదందాలు, ఇసుక, మట్టి మాఫియాతో కుతకుతలాడిపోతుంది. రాష్ట్రంలో కాంట్రాక్టర్ అవతారం ఎత్తి పనులు చేయకుండా డబ్బులు తీసుకున్నారు. పేరూరు చెరువకు నీళ్లిచ్చే బాధ్యత టీడీపీది. అనంతపురంలో సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి. సోమరవాండ్లపల్లి ప్రాజెక్టుకు భూములిచ్చి వారికి నష్టపరిహారం ఇవ్వాలి. టమోటా, వేరుశనగ, చీని లాంటి వాణిజ్యపంటలకు సబ్సిడీ ఇస్తాం.

చెన్నేకొత్తపల్లి మండలం వెంకటపల్లి సమీపంలో దేవరకొండ ప్రాజెక్టు విషయంలో రైతులకు న్యాయం చేస్తాం. సత్యసాయి శ్రీరామరెడ్డి తాగు నీటి పథకం కార్మికులకు జీతాలు ఇస్తాం. బొక్కిన వాడిని ఎవ్వరిని వదిలి పెట్టను. మా తమ్ముళ్లు పడిన కష్టాలకు వడ్డీతో సహా చెల్లించే బాధ్యత టీడీపీది. అన్ని ఎంక్వైరీ చేయించి దోషులను శిక్షించే బాధ్యత మాది. రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో 410 ఎంపీ సీట్లు, రాష్ట్రంలో 160కి పైగా ఎమ్మెల్యే సీట్లు, 25 కి 25 ఎంపీ సీట్లు గెలుస్తాం. జట్టు కట్టింది కూడా రాష్ట్ర భవిష్యత్ ను కాపాడాలనే.

ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, మీ బిడ్డ జీవితాలు బాగుపడాలి. జగన్ రెడ్డి కట్టుకధలకు మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. మాదిగలకు ఏ,బీ,సీ,డీ తెచ్చింది టీడీపీనే. జిల్లాల వారీగా క్యాటగిరైజేషన్ చేస్తాం. నేను అందరి వాడిని. మా కూటమికి మద్ధతు ఇవ్వండి.

LEAVE A RESPONSE