ఏరువాక సాగరోరన్నో చిన్నన్న..
నీ కష్టమంతా
తీరునురోరన్నో చిన్నన్న..
ఆరున్నర దశాబ్దాలకు
మునుపే అన్నదాత
బ్రతుకు రాతను..
తిరుగుబాటు గీతను
కళ్ళ ముందు
ఆవిష్కరించిన సినిమా..
తాపీగా కూపీ చూపిన
చాణక్య నీతి..
చక్కని రీతి..!
నాటి గ్రామీణ
పెత్తందారీ దృక్పథం..
దోచేయడమే పథం..
సత్తెగాలపు రైతన్న
ఆరుగాలం కట్టపడి పండించిన
పంట చేతికొచ్చేపాటికి
భూస్వామి దోచుకుపోతే
మరోసారి చేను దున్నే
చేవ ఉన్నా విత్తుకొనే
సొమ్ములేక బిక్కచచ్చి..
అన్నదాతే అన్నమో రామచంద్రా అంటూ
ఆక్రోశించే రోజులు మరాయా
అప్పు ఎరుగని హీరో కుటుంబమూ
ఆ ముప్పు తప్పని..
తప్పించుకోలేని
ఆ రోజులు
ఎప్పటికైనా మారేనా..!?
సినిమాలో గనక జరిగింది
తిరుగుబాటు…
కథ రైతు వ్యధ..
పెత్తందారు సీఎస్సార్
రుబాబు..
ఈకంత ఇచ్చి
తోకంత లాగేసే దౌర్జన్యం..
మనసు కరగని కాఠిన్యం..
తన పంతం
నెగ్గించుకోడానికి
కుటుంబాన్నే
విడదీసిన వైనం..
కొడుకు అక్కినేని తిరుగుబాటుతో
తోక ముడిచిన ఆంజనేయులు..!
నాటి రోజుల్లో అన్నదాత మనసులోని భావన..
ఆవేశం ఉన్నా తిరుగుబాటు
చెయ్యలేని నిస్సహాయత..
హీరోలో తమను తాము చూసుకున్న రైతన్నలు..
కొట్టేశారు జేజేలు..!
కొసరాజు కొసమెరుపు..
ఏరువాక సాగరో పాటే
ఆ సినిమాకి మైమరపు..
వహీదా తొలివిరుపు..
తర్వాతే బాలీవుడ్ పిలుపు
ఓ శకానికి మేలిమలుపు!
ఆ గీతం రైతన్న
బ్రతుకుపై అవగతం..
అన్నదాత స్వగతం..
కొత్త పొద్దుకు స్వాగతం..
పొలాలమ్ముకుని పోయేవాళ్లు
టౌనులో మేడలు కట్టేవాళ్లు
బ్యాంకుల డబ్బులు దాచేవారు..
నీ శక్తిని గమనించరు వారు
వలసవాదులకో చురక..
పదవులు స్థిరమని
భ్రమసే వాళ్ళు..
ఓట్లు గుంజి
నిను మరచే వాళ్ళే..
నీవే దిక్కని
వత్తురు పదవోయ్..
ఇలాంటి పాట ఉంటే ఉప్పొంగడా కిసాను..
నాడే బాక్సాఫీసు
బద్దలైన సీను..!
(రోజులుమారాయి సినిమా విడుదలై నేటికి 67 సంవత్సరాలు(14.04.55)పూర్తి.. ఈ సినిమా శతదినోత్సవానికి వినూత్నంగా నటులే ఆయా కేంద్రాలకు వచ్చారట.. అలా అక్కినేని..జానకి.. వహీదా..తాపీ చాణక్య విజయనగరంలోని మా వేంకటేశ్వర ధియేటర్ కి
వచ్చినట్టు మా నాన్న ఈశ్వరరావు గారి మధురస్మృతి..)
– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286