– ఇప్పుడు మనుషులను చూడండి, వారిలో నీతినియమాలు లేవు,’ అనడం సబబు కాదంటున్న సైకాలజిస్టులు
– వేణుంబాక విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు
‘గతంలోనే జనం లక్షణంగా ఉండేవారు. కాలం గడుస్తున్నకొద్దీ మనుషులు అధ్వాన్నంగా తయారవుతున్నారు,’ అనే మాటలు వింటూనే ఉన్నాం. ప్రతి తరంలోనూ ‘గడచిన రోజులు మంచివి. నడుస్తున్నవి చెడ్డవి,’ అనే భావన కొనసాగుతూనే ఉంది. మరి ఇలా పోయిన రోజులే మనుషులు నీతిమంతంగా ఉన్న కాలమనే అభిప్రాయం ఎందుకు బలంగా కొనసాగుతోందనే అంశంపై ప్రసిద్ధ సైన్స్ పత్రిక ‘నేచర్’లో ఒక పరిశోధనా వ్యాసం ప్రచురితమైంది.
పైన చెప్పినట్టు ప్రస్తుత సమయం చెడ్డదని, గతంలోనే మనుషుల్లో నీతి ఉండేదనే వాదనలో నిజం లేదనే వాదనను ఈ వ్యాసంలో వివరించారు. ఇప్పటి తరం యువత లేదా వ్యక్తులు పాత తరాలతో పోల్చితే లోపభూయిష్టంగా, నీతిబాహ్యంగా ఉన్నారనే నమ్మకం లేదా విశ్వాసం క్రీస్తు పూర్వం 624 నుంచీ ప్రపంచ మానవాళిలో ఉందని జాన్ ప్రాట్జకో, జొనాథన్ డబ్ల్యూ స్కూలర్ అనే పరిశోధకులు ఇది వరికే తేల్చిచెప్పారు. తాజాగా ‘నేచర్’ పత్రికలో ప్రచురించిన వ్యాసంలో మాత్రం పోయినవే మంచి రోజులనే భావన నిజం కాదని మనస్తత్వవేత్త ఆడమ్ మాస్త్రోయినీ పేర్కొన్నారు.
‘మనుషులు పతనమౌతున్నారు. అప్పట్లో తలుపులకు తాళాలు వేయకపోయినా జనం రాత్రిళ్లు నిశ్చింతగా నిద్రపోయేవారు. ఇప్పటి పిల్లలను చూడండి, ఎంత దిగజారిపోతున్నారో,’ వంటి మాటలు సత్యదూరమని, వాటిలో నిజాయితీ లేదనే నమ్మకంతో తాను ఈ వ్యాసం రాశానని మాస్త్రోయినీ చెప్పారు. అసలు లోకం చెడిపోతోందనే వాదనలో నిజానిజాలు నిగ్గుతేల్చడానికి హార్వర్డ్ యూనిర్సిటీ సైకాలజిస్ట్ డాన్ గిల్బర్ట్ తో కలిసి మాస్త్రోయినీ అధ్యయనం చేయగా, అది నిజం కాదని రుజువైంది.
మరి, నేడు మానవులు నీతినియమాలు తప్పుతున్నారనే భావనే ఎందుకు విశ్వవ్యాప్తంగా అంటువ్యాధిలా వ్యాపించింది? అనే విషయంపై వారు పరిశోధన చేశారు. వాస్తవానికి, అమెరికా, ఐరోపా దేశాలు సహా ప్రపంచమంతటా మానవులకు కీడుచేసే అనేక ఆచార సాంప్రదాయాలను తొలగిస్తున్నారు. గతంలో ఉన్న బానిసత్వం ఇప్పుడు రద్దయింది. ఇలా పాలకులు, పౌరులు ఎన్నో ప్రగతిశీల చర్యలు తీసుకుంటున్నారు. నేటి ప్రపంచం గతానితో పోల్చితే చాలా అందంగా ఉందని ఈ ఇద్దరు పరిశోధకులు తమ అధ్యయనంలో గుర్తించారు.
వర్తమానంపై ఎందుకీ చిన్నచూపు? గతంపై ఎందుకు సదభిప్రాయం?
ఇప్పటి ప్రజల్లో నైతిక ప్రమాణాలు పడిపోవడం లేదని, మంచి, మానవత్వం పెరిగాయని అనుకుంటే–గతమెంతో ఘనమైనదనే భావన ఎందుకు బలంగా విస్తరించి ఉంది? అనే ప్రశ్న ఉదయిస్తుంది. కొన్ని మానసిక ఆలోచనా ప్రక్రియల వల్ల ఇలాంటి భ్రాంతి (గతం గొప్పదనే) జనంలో ఉందని మాస్త్రోయినీ, గిల్బర్ట్ విశ్లేషించారు. మనకు లభించే రోజూవారీ సమాచారంలో వ్యతిరేక వార్తలే ఎక్కువగా పాఠకులను ఆకట్టుకుంటాయి.
సమాజంలోని చెడు, కీడుకు సంబంధించిన వివరాలు, గణాంకాలపైనే జనం ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఫలితంగా, లోకంలో అంతా అనైతిక అంశాలే కనిపిస్తాయి. నేటి పౌరుడి ప్రవర్తన లోపభూయిష్టమైందనే భావన మెదడును ఆక్రమిస్తుంది. ఇక గతంలో అంతా మంచి జరిగిందనే అభిప్రాయానికి కారణాలు కూడా వీరిద్దరూ అధ్యయనం చేశారు. జరిగిపోయినదానికి సంబంధించి లోపభూయిష్టమైన మన జ్ఞాపకశక్తి కారణంగా గతమంతా గొప్పగా, మంచిగా కనిపిస్తుంది.
ఇదివరకు జరిగిన చెడు, మంచి సంఘటనల విషయంలో–ప్రజలు చెడు పరిణామాలను సానుకూల విషయాలుగా బాగా గుర్తు పెట్టుకుంటారు. అంటే, జరిగినదంతా మంచి విషయంగానే గుర్తుంటుంది. కాలం గడిచేకొద్దీ వ్యతిరేక ఘటనలతో ముడిపడిన ఉద్వేగం బలహీనమౌతుంది. ఇలా అవాంఛనీయ ఘటనల్లోని దుర్మార్గం పలచబడిపోయి కొద్ది కాలానికి జనం మరిచిపోయే స్థాయికి చేరుకుంటుంది.
ఈ కారణంగానే గడిచిన రోజులు నీతినియమాలతో నిండినవనే మూఢనమ్మకం కొనసాగుతోంది. దీన్ని వల్ల మానవాళికి కీడు జరిగిన రోజులను తేలికగా మరిచిపోతున్నాం. అందుకే వర్తమానంలో పాత విలువలు, నైతిక విలువల ఆచరణ లేదని, గతించినవే గొప్ప రోజులనే భ్రమలో ఆధునిక మానవుడు బతుకుతున్నాడని మనస్తత్వవేత్తలు మాస్త్రోయినీ, గిల్బర్ట్ పై వ్యాసంలో తేల్చిచెప్పారు.