Suryaa.co.in

Andhra Pradesh

అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలం

• బాలింతలు, గర్బిణీలకు ఇబ్బంది కలిగించకుండా వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలి
• అంగన్వాడీల పలు డిమాండ్లను పరిష్కరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
• అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు 62 ఏళ్ల వరకు కొనసాగేందుకు అవకాశం
• కార్యకర్తలకు రూ.1.00 లక్షకు, సహాయకులకు రూ.40 వేలకు సేవా ప్రయోజనం పెంపు
• సహాయకులను కార్యకర్తలుగా నియమించేందుకు గరిష్ట వయస్సు 50 ఏళ్లకు పెంపు
• ప్రాజెక్టు / సెక్టర్ సమావేశాలకు హాజయ్యే కార్యకర్తలకు, సహాయకులకు టిఎ/డిఎ లు
• అంగన్వాడీల అద్దె భవనాలకు నవంబరు వరకూ అద్దె చెల్లింపు చేశాం
• భవనాల నిర్వహణకు రూ.6.36 కోట్లు,పరిపాలనా ఖర్చులకు రూ.7.81 కోట్లు వెచ్చింపు
– రాష్ట్ర స్త్రీ,శిశు,వికలాంగులు & వృద్దుల సంక్షేమ శాఖ మంత్రి కె.వి.ఉషశ్రీ చరణ్

అమరావతి,డిశంబరు 21: అంగన్వాడీ కార్యకర్తలు,సహాయకుల డిమాండ్లను పరిష్క రించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని బాలింతలు,గర్బిణీలకు ఇక ఏమాత్రము ఇబ్బంది కలిగించకుండా వెంటనే నిరసనను విరమించి విధుల్లో చేరాలని రాష్ట్ర స్త్రీ,శిశు, వికలాంగులు మరియు వయో వృద్దుల సంక్షేమశాఖ మంత్రి కె.వి.ఉషశ్రీ చరణ్ పిలుపు నిచ్చారు.

గురువారం వెలగపూడి రాష్ట్ర సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్నికల వాగ్దానంలో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అన్నింటిని ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా నెరవేర్చడం జరిగిందన్నారు.అదే విధంగా అంగన్వాడీ కార్యకర్తలు,సహాయకుల డిమాండ్లను సాధ్యమైనంత వరకు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారని,ఇప్పటికే ప్రభుత్వం పలు ఉత్తర్వులను జారీ చేసిందని తెలిపారు.పుస్తుతం ఉన్న 60 ఏళ్ల గరిష్ట వయో పరిమితిని 62 ఏళ్లకు పెంచడం జరిగిందన్నారు.సేవా ప్రయోజనంగా కార్యకర్తలకు ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.50 వేలను రూ.1.00 లక్షకు, సహాయకులకు ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.20 వేలను రూ.40 వేలకు పెంపు చేయడం జరిగిందని మంత్రి ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు.

అంగన్వాడీ సహాయకులను కార్యకర్తలుగా నియమించేందుకు ప్రస్తుతం ఉన్న గరిష్ట వయస్సు 45 ఏళ్లను 50 ఏళ్లకు పెంపుచేయడం జరిగిందని ఆమె తెలిపారు. ప్రాజక్టు / సెక్టర్ సమావేశాలకు హాజయ్యే అంగన్నాడీ కార్యకర్తలకు, సహాయకులకు టిఎ/డిఎ క్లైమ్ చేసుకునే అవకాశం కూడా కల్పించడం జరిగిందని అందుకు అవసరమైన అన్ని రకాల ప్రభుత్వ ఉత్తర్వులను ఇప్పటికే జారీ చేసినట్లు ఆమె తెలిపారు.సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అంగన్వాడీలకు గ్రాట్యుయిటీ చెల్లించే అంశంపై కేంద్రానికి లేఖ వ్రాయడం జరిగిందని,కేంద్ర నుండి సమాధానం రాగానే ఈ విషయాన్ని కూడా పరిశీలిస్తామని ఆమె తెలిపారు.

అంగన్వాడీల గౌర వేతనం పెంచుతామని వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వాగ్దానంలో ఇచ్చిన హామీని పురస్కరించకుని 2018లో తెలంగాణాలో ఇస్తున్న రూ.10,500/- ల కంటే అదనంగా రూ.11,500/- లను తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి చెల్లించడం జరుగుతోందని మంత్రి స్పష్టం చేశారు.అంగన్వాడీ కార్యకర్తలకు గౌరవ వేతనం చెల్లించడంలో దేశంలో 6 వ స్థానంలోనూ,సహాయకుల విషయంలో 4వ స్థానంలో మన రాష్ట్రం ఉన్నట్లు ఆమె తెలిపారు.ప్రస్తుతం అంగన్వాడీల గౌరవ వేతనం పెంచేందుకు ఇది సరైన సమయం కాదని ఆమె స్పష్టం చేశారు.

అదే విధంగా రాష్ట్రంలో గ్రామీణ/గిరిజన ప్రాంతాలలో ఉన్న 16,575,పట్టణ సముదాయాల్లోగల 6,705 అంగన్ వాడీ కేంద్రాల అద్దె భవనాలకు నవంబరు వరకు గల అద్దె బకాయిలు రూ.66.54 కోట్లను చెల్లించడం జరిగిందని మంత్రి ఉషశ్రీ చరణ్ వెల్లడించారు.అలాగే అంగన్వాడీ భవనాల నిర్వహణకు రూ.6.36 కోట్లు,పరిపాలనా పరమైన ఖర్చులకు రూ.7.81 కోట్లు వెచ్చించడం జరిగిందని తెలిపారు.అంగన్వాడీ కార్యకర్తలకు,సహాయకులు ప్రతి ఒక్కరికీ యూనిఫారమ్ కింద ఆరు చీరలు అందించేందుకు 16కోట్ల రూ.లను,వారి విధి నిర్వహణ సులభతరంగా సాగేందుకు వీలుగా 85 కోట్ల రూ.లతో మొబైల్ ఫోన్లను కూడా సమకూర్చడం జరిగిందని అన్నారు.

అంగన్వాడీల ద్వారా నాణ్యమైన సరుకులను పంపిణీ చేసే అంశాన్ని పర్య వేక్షించేందుకు దాదాపు 500 మంది సూపర్వైజర్లను కూడా ఈ ప్రభుత్వం నియమించినట్లు మంత్రి తెలిపారు.అర్హతను బట్టి అంగన్వాడీ లకు సంక్షేమ పథకాలను కూడా అందజేస్తున్నట్లు ఆమె తెలిపారు.

పలువురు విలేఖరులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇస్తూ అంగన్వాడీ కేంద్రాల తాళాలను ఎవరూ పగుల కొట్టలేదని, బాలింతలకు,గర్బిణీలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకై ఆయా జిల్లా కలెక్టర్లు కేంద్రాలను నడిపెలా చర్యలు తీసుకున్నారని ఆమె తెలిపారు.రాష్ట్రంలో అంగన్వాడీల పనితీరు అత్యుత్తమముగా ఉండదని నీతి ఆయోగ్ కూడా ప్రశంసించిన విషయాన్ని మంత్రి ఉషశ్రీ చరణ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర స్త్రీ,శిశు,వికలాంగులు మరియు వృద్దుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మీ,సంచాలకులు విజయకృష్ణన్ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE