⦁ సీనరేజి చెల్లింపు విషయంలో సానుకూల నిర్ణయం
⦁ ప్రభుత్వానికి, పరిశ్రమలకు నష్టం లేకుండా చర్యలు
⦁ ప్రభుత్వ యంత్రాంగం, పరిశ్రమల అసోసియేషన్ ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు
⦁ ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల గ్రానైట్ కటింగ్ అండ్ పాలిషింగ్ పరిశ్రమల అసోసియేషన్ ప్రతినిధులకు మంత్రి కొల్లు రవీంద్ర హామీ
అమరావతి: గ్రానైట్ కటింగ్ అండ్ పాలిషింగ్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరించి, వారికి తగు న్యాయం చేస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సచివాలయంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, బి.ఎన్.విజయ్ కుమార్తో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని గ్రానైట్ కటింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్ల అసోసియేషన్ ప్రతినిధులు సమావేశమయ్యారు.
పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రులకు వివరించారు. అన్ని గ్రేడ్ల ముడి సరుకుకు కూడా ఒకే విధంగా సీనరేజి చెల్లించడం ఆర్థికంగా ఇబ్బంది కలుగుతోందని, ఆ సమస్యను పరిష్కరించాలని విన్నవించారు. ప్రభుత్వానికి, కటింగ్ యూనిట్స్ నిర్వాహకులకు ఎలాంటి నష్టం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సమ్మె కారణంగా ఫ్యాక్టరీలపై ఆధారపడిన కార్మికులు అవస్థలు పడతారని, తక్షణమే సమ్మె విరమించి పనులు ప్రారంభించాలని గ్రానైట్ కటింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్ యజమానులకు సూచించారు.
ఫ్యాక్టరీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారం లక్ష్యంగా మైనింగ్ జేడీ, జిల్లా డీఎంజీవో, సీనరేజి వసూలు సంస్థ ప్రతినిధి, ప్రతి అసోసియేషన్ నుండి ఇద్దరు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అసోసియేషన్ ప్రతినిధులు, అధికారులతో చర్చించి వారం రోజుల్లో నివేదిక అందించాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు.