– గత 15 నెలల పేలవమైన అట్టర్ ప్లాప్ పరిపాలన గురించి ప్రాయశ్చిత్తం చేసుకునే విధంగా గవర్నర్ ప్రసంగం ఉంటుందని భావించాం
– భారతదేశంలో ఏ రాష్ట్ర సచివాలయంలో కూడా జరగని అత్యంత ఘోరమైన నీచమైన సంఘటన మన సెక్రటేరియట్లో జరిగింది
– రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు
– 1,62,000 కోట్లు అప్పుచేసి ఒక్కటంటే ఒక్క పథకాన్ని ప్రాజెక్టును ప్రారంభించని అసమర్ధ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
– పోయిన సంవత్సరం ప్రభుత్వం చెప్పిన 40000 కోట్ల రూపాయల పెట్టుబడుల్లో 40 పైసలు అయిన వచ్చాయా?
– ముఖ్యమంత్రికి దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలి?
– గవర్నర్ ప్రసంగంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం
హైదరాబాద్: అసెంబ్లీలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేసిన బడ్జెట్ ప్రసంగం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రసంగం గవర్నర్ స్థాయికి తగినదిగా లేదని, గాంధీ భవన్‌లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్‌లా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ నోటి వెంబడి అబద్ధాలు, అర్థసత్యాలు, అసత్యాలు చెప్పించి ఆయన స్థాయిని దిగజార్చిందని ఆయన ఆరోపించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కొత్త విషయాలు లేదా ప్రజలకు ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారంటీలపై బడ్జెట్ ప్రసంగంలో స్పష్టత ఇస్తారని, గత 15 నెలల పేలవమైన పరిపాలనపై ప్రాయశ్చిత్తం చేసుకుంటారని ఆశించామని, కానీ అలాంటిదేమీ జరగలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఘోర వైఫల్యంతో రాష్ట్రంలో రైతులు ఆరిగోసలు పడుతున్నారని, పంటలు ఎండిపోతున్నాయని, 480 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ గవర్నర్ ప్రసంగంలో ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చే ఒక్క మాట కూడా లేదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఎక్కడా 25-30 శాతానికి మించి రుణమాఫీ జరగలేదని, ఒక్క గ్రామంలోనైనా 100 శాతం రుణమాఫీ జరిగితే బీఆర్‌ఎస్ నాయకులు రాజీనామా చేస్తామని సవాల్ విసిరినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని కేటీఆర్ తెలిపారు. అయినప్పటికీ, గవర్నర్ నోటి ద్వారా రుణమాఫీ పూర్తయిందని, లక్షలాది రైతులు సంతోషంగా ఉన్నారని అబద్ధాలు చెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు రుణమాఫీ, పెట్టుబడి సాయం అందక ఆగమాగుతుంటే, రైతు బంధు అందిందని, కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తున్నామని గవర్నర్ నోటి ద్వారా అసత్యాలు చెప్పించారని కేటీఆర్ విమర్శించారు.
సాగు నీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోందని, కేవలం కేసీఆర్ గారిపై గుడ్డి ద్వేషంతో మేడిగడ్డ బ్యారేజీని 15 నెలలుగా రిపేర్ చేయకుండా ఎండబెట్టడంతో గోదావరి పరివాహకంలో పంటలు ఎండిపోతున్నాయని, దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి చేతగానితనంతో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని, రైతులు పొలాల్లో గొర్లు, బర్లు మేపుతున్నారని, గవర్నర్ ప్రసంగంలో ఈ సమస్యలపై ఒక్క మాట కూడా లేదన్నారు.
భారతదేశంలో ఏ రాష్ట్ర సచివాలయంలోనూ జరగని ఘోర సంఘటన తెలంగాణ సచివాలయంలో జరిగిందన్న కేటీఆర్, 20 శాతం కమీషన్ ఇవ్వకపోతే బిల్లులు ఇవ్వడం లేదని కాంట్రాక్టర్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చాంబర్ ముందు ధర్నా చేసిన సంఘటన దీనికి నిదర్శనమని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి విజన్ లేదు, కేవలం 20 శాతం కమీషన్ మాత్రమే ఉందని మండిపడ్డారు.
ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు ఇవ్వకుండా, గురుకులాల్లో తిండి పెట్టకుండా పిల్లలను చంపుతున్న అరాచక ప్రభుత్వం రేవంత్ రెడ్డి దని మండిపడ్డ కేటీఆర్, 83 మంది విద్యార్థుల మరణాలపై గవర్నర్ ప్రసంగంలో ఒక్క సానుభూతి మాట కూడా లేదని విచారం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో 4.17 లక్షల కోట్ల అప్పు చేస్తే, కాంగ్రెస్ ఒక్క సంవత్సరంలోనే 1.62 లక్షల కోట్ల అప్పు చేసిందని, అయినా ఒక్క కొత్త పథకం లేదా ప్రాజెక్టు ప్రారంభించలేదని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో రైతుల కోసం 4.5 లక్షల కోట్లు ఖర్చు చేసిందన్న కేటీఆర్, రైతు బంధు (73,000 కోట్లు), రుణమాఫీ (28,000 కోట్లు), ఉచిత విద్యుత్, ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ వరి ఉత్పత్తిలో దేశంలో నంబర్ వన్ స్థానం సాధించిందని తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి దీనికి సిగ్గు లేకుండా క్రెడిట్ తీసుకుంటూ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.
దావోస్‌లో 1.79 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని గవర్నర్ ద్వారా అబద్ధాలు చెప్పించారని, గత ఏడాది చెప్పిన 40,000 కోట్లలో ఒక్క పైసా కూడా రాలేదని, ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో తెచ్చిన కేయిన్స్ (3,800 కోట్లు), కార్నింగ్ (1,000 కోట్లు), ప్రీమియర్ ఎనర్జీ (1,700 కోట్లు) వంటి పెట్టుబడులు రేవంత్ రెడ్డి అసమర్థతతో గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లకు తరలిపోయాయని విమర్శించారు. కులగణన పేరుతో BCలను మోసం చేసి, రిజర్వేషన్లపై దగా చేసిన ఈ ప్రభుత్వం, దీనిని ప్రశ్నించిన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీని సస్పెండ్ చేసిందని ఆరోపించారు.
కాంగ్రెస్ తల్లి, రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాలను సెక్రటేరియట్‌లో, ముందు పెట్టి తెలంగాణను ఉద్ధరించినట్టు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ తల్లిని, రాహుల్ తండ్రిని తిరిగి గాంధీ భవన్‌కు పంపిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను, ప్రజలను మోసం చేస్తూ, అప్పుల భారం మోస్తూ, అవినీతితో రాష్ట్రాన్ని నాశనం చేస్తోందని, గవర్నర్ ప్రసంగం ఈ వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నమని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ ప్రజలు ఈ మోసాన్ని గుర్తించి సమయం వచ్చినప్పుడు సమాధానం చెబుతారని ఆయన హెచ్చరించారు.