అంగన్వాడీలపై ఇంత దుర్మార్గమా?

అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య వ్యాఖ్య

న్యాయమైన వేతనాల కోసం ఆందోళనలు చేస్తున్న అంగన్వాడీల ఉద్యమంపై ప్రభుత్వం దుర్మార్గమైన ప్రతీకార చర్యలకు పాల్పడుతుందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. నలభై రోజులకు పైబడి అంగన్వాడీలు ఆందోళనలు చేసిన సందర్భం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా లేదన్నారు.

తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానన్న ముఖ్యమంత్రి 56 నెలల పదవీ కాలం ముగిసినా ఇవ్వకపోవడం మాట తప్పటం కాదా? అన్నారు. అంగన్వాడీలతో కూడా చర్చలు జరిపి సమస్యను పరిష్కరించేందుకు చిత్త శుద్ధి లేకుండా పోయిందన్నారు. అంగన్వాడీలపై పగ సాధించేందుకే అత్యవసర సర్వీసులలోకి తీసుకు వచ్చి ఎస్మా ప్రయోగించారని, రేపో, మాపో రాష్ట్రం లోని లక్షా యాభై వేల మంది అంగన్వాడీను విధుల నుంచి తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు.

రాష్ట్రంలో ఎక్కడి కక్కడ ఆందోళనకారులను పోలీసు స్టేషన్లో ఉంచారని పేర్కొన్నారు. అంగన్వాడీలతో పెట్టుకుంటే, ఏ ప్రభుత్వం కూడా అధికారంలో ఉండదని చెప్పారు. అంగన్వాడీలు ధైర్యంగా ఉండాలని కోరారు. రాబోవు ఎన్నికల్లో అక్రమ అరెస్టులు, బెదిరింపులకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని బాలకోటయ్య హెచ్చరించారు.

Leave a Reply