-తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కార్యక్రమాలు
-ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
-అధికారులకు దిశా నిర్దేశం చేసిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్
ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని (ఏప్రిల్ – 18) పురస్కరించుకొని రూపొందించిన వాల్ పోస్టర్ ను రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మేల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి, శంకర్ నాయక్, వరంగల్ మహా నగర మేయర్ గుండు సుధారాణి, ములుగు, భూపాలపల్లి కలెక్టర్లు ఇలా త్రిపాఠి, భవేష్ మిశ్రా లతో కలిసి హనుమకొండ లోని హరిత హోటల్ లో శనివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, కాకతీయుల కాలంలో క్రీస్తు శకం 1213లో నిర్మించిన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ (జూలై – 25, 2021) హోదా దక్కింది. చైనాలోని పూజౌ లో నిర్వహిస్తున్న యునెస్కో హెరిటేజ్ కమిటీ సమావేశాలలో ప్రపంచం వ్యాప్తంగా 21 దేశాల ప్రతినిధులు ఓటింగ్ ప్రక్రియలో పాలుపంచుకొన్నారు. 17 దేశాల వారు రామప్పకు అనుకూలంగా ఓటు వేశారు. ప్రపంచవ్యాప్తంగా 255 కట్టడాలు యునెస్కో వారసత్వ హోదా గుర్తింపు కోసం పోటీ పడ్డాయి.
రామప్ప కట్టడం యునెస్కో జాబితాలో చోటు సంపాదించుకోవడం భారతీయులందరికీ గర్వకారణం. యునెస్కో రామప్పకు వారసత్వ హోదా ఇవ్వడం ద్వారా ఎనిమిది వందల సంవత్సరాల నాటి రామప్ప దేవాలయానికి తగిన గుర్తింపు లభించింది. ఇసుకపై ఆలయాన్ని నిర్మించడం. నీటిలో తేలియాడే ఇటుకలతో గోపురాన్ని నిర్మించడం. ఆలయ నిర్మాణానికి వాడిన రాతి నేటికీ రంగును కోల్పోకుండా ఉండడం రామప్ప ప్రత్యేకతలు. రామప్పగుడి ఆలయ నిర్మాణంలోని చిత్ర కౌశలం, శిల్ప నైపుణ్యం వర్ణించనలవికానిదని అన్నారు.
రామప్ప దేవాలయం ఎన్నో యుద్ధాలకు, దాడులకు, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడింది. దేవాలయ ప్రాంగణంలో చిన్న కట్టడాలను నిర్లక్ష్యంగా వదలి వేయడం వలన అవి కొన్ని ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. వాటిని అభివృద్ధి పరిచే బాధ్యతను కొంత మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. జాతీయ వారసత్వ సంపదగా ఉండి, అంతర్జాతీయ గుర్తింపు పొందిన రామప్ప ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది.
కాబట్టి, కేంద్రం కూడా కొన్ని నిధులు ఇచ్చి రామప్పను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర సహాయం కోసం ఎదురు చూడకుండా సిఎం కెసిఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తరపున రూ.4.21 కోట్ల నిధులు మంజూరు చేసి, పరిరక్షణ పనులు చేపట్టారు. గ్రామీణాభివృద్ధి శాఖ నుండి రూ.10 లక్షల రూపాయలను మంజూరు చేశాం. మరిన్ని నిధులను సమకూరుస్తాం.
రోజు వారి నిర్వహణకు రూ.82 లక్షలు, 3 కోట్లతో కామేశ్వరాలయ పునరుద్ధరణ, ఈశాన్య భాగంలో ప్రకారం పునరుద్ధరణ, లైటింగ్, భవనాల నిర్మాణం, తూర్పు ద్వారం నుండి ఇప్పటికే ఉన్న రాతి మార్గాన్ని పొడిగించడం వంటి పలు పనులు కొనసాగుతున్నాయి. అన మంత్రులు వివరించారు. తద్వారా భవిష్యత్తులో మరిన్ని నిధులు వచ్చి అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. రామప్ప అంతర్జాతీయ పర్యాటక ప్రాంతంగా దేశవ్యాప్త గుర్తింపుకు నోచుకుంటుందని మంత్రులు తెలిపారు.
కాగా, ఈ వేడుకలలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్, ప్రముఖ డ్రమ్స్ వాయిద్య కారుడు శివమణి, సింగర్ కార్తీక్, ప్లూటిస్ట్ నవీన్ తో పాటు 300 మంది కళాకారులు తమ ప్రదర్శన లతో పర్యాటకులను ఆకట్టుకునేలా అధ్బుతమైన సంగీత విభావరి నీ ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. అలాగే ఇటీవల బాగా ప్రజాదరణ పొందిన బలగం సినిమా ప్రదర్శన పై కూడా ఆలోచన చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు.