– ఏర్పాటు చేసిన హీరో ఫ్యూచర్ ఎనర్జీస్..
– రూ. 1000 కోట్ల పెట్టుబడి, 2 వేల మందికి ఉపాధి..
– ఏడాదికి 25 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్ధ్యం..
– వర్చువల్‌గా ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
అమరావతి: తిరుపతి లోని రాక్‌మ్యాన్ ఇండస్ట్రీస్‌లో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ మొట్ట మొదటి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ చేపట్టిన ఈ ప్రాజెక్ట్.. పారిశ్రామిక అవరసరాల కోసం పీఎన్జీ, ఎల్పీజీతో గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్‌కు సరికొత్త విధానాన్ని అనుసరిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. ఈ సాంకేతికత కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుందని, భారత దేశ శక్తి పరివర్తనకు కొత్త బెంచ్ మార్క్‌ను నిర్దేశిస్తుందని వివరించారు.
తిరుపతిలో ప్రవేశ పెట్టబడిన స్కేలబుల్ మోడల్‌ను ఆంధ్రప్రదేశ్ లోనూ, ఇంకా దేశ వ్యాప్తంగా ఇతర పరిశ్రమల్లోనూ అనుకరించ వచ్చని చెప్పారు.
లక్ష్యానికి తొలి అడుగు ఇది
స్వర్ణాంధ్ర విజన్-2047 సాధనలో పేర్కొన్నట్టుగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఏపీని ప్రపంచ కేంద్రంగా మార్చాలనే లక్ష్యానికి ఇది తొలి అడుగు అవుతుందన్నారు. రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ (ICE) పాలసీ 2024 కింద 160 గెగా వాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని, క్లీన్ ఎనర్జీలో రూ. 10 ట్రిలియన్ పెట్టుబడిని సాధిస్తామనే విశ్వాసం ఉందన్నారు.
శిలాజ ఇంధనాలపై ఆంధ్రప్రదేశ్ ఆధార పడటం తగ్గించడానికి, 2070 నాటికి భారత దేశం యొక్క నెట్-జీరో లక్ష్యానికి మద్దతు ఇవ్వడానికి, ముడి చమురు దిగుమతులను తగ్గించడానికి, ఇంధన భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు.
‘గ్రీన్ ఎనర్జీ ప్లాంట్‌తో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ జైత్ర యాత్ర మొదలు కావాలని కోరుకుంటున్నాను. ఏపీ రాష్ట్రంలో వాణిజ్యానికి ఉన్న అనుకూల విధానాలు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి హీరో ఫ్యూచర్ ఎనర్జీస్‌కు సహకారం అందిస్తాయి.’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు.
ఎన్నో వనరులు.. వినియోగించుకోండి
విస్తారమైన తీర ప్రాంతం, లోతైన సముద్ర ఓడ రేవులు, బలమైన లాజిస్టిక్స్ నెట్ వర్క్‌తో ఆంధ్రప్రదేశ్.. దేశీయ, ప్రపంచ మార్కెట్ అవసరాలను తీర్చడానికి, గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతులకు కేంద్రంగా మారడానికి ఆంధ్రప్రదేశ్ అనువైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. రూ. వెయ్యి కోట్ల పెట్టుబడితో రెండు వేల మందికి ఉపాధి కల్పించేలా ప్లాంట్ నెలకొల్పడంతో తిరుపతి, చుట్టు పక్కల ప్రాంతాల వారికి ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయని చెప్పారు.
ప్రాజెక్టుతో ఎన్నో లాభాలు
రూ. వెయ్యి కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ద్వారా రెండు వేల మందికి ఉపాధి కలుగుతుంది. ఏడాదికి 25 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుంది. దీనిని ఏడాదికి 54 టన్నులకు పెంచుకునే అవకాశం ఉంది. ఏడాదికి 206 టన్నుల కార్బన్ ఢైఆక్సైడ్ ఉద్గారాల తగ్గింపుతో పాటు, వాతావరణం లోకి ఏడాదికి 190 నుచిం 195 టన్నుల ఆక్సిజన్ విడుదల అవుతుంది. మొత్తం మ్మీద 8 శాతం నుంచి 10 శాతం ఉద్గార తగ్గింపు సాధ్యమవుతుంది.
హీరో ఫ్యూచర్ ఎనర్జీస్
2012లో స్థాపించిన హీరో గ్రూపు పునరుత్పాదక ఇంధన విభాగం హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ పవన, సౌర, హైబ్రిడ్ ఇంధన వనరుల ఉత్పత్తిపై దృష్టి పెట్టి పర్యావరణ పరిరక్షణకు ప్రయత్నిస్తోంది. భారత దేశం, యుకె, ఉక్రెయిన్, వియత్నాం, బంగ్లాదేశ్‌లో 1.9 GW సామర్థ్యంతో ప్రాజెక్టు లను నిర్వహిస్తూ రూ. 1,460 కోట్ల వార్షిక ఆదాయం సాధిస్తూ ఈ రంగంలో అవకాశాలను అంది పుచ్చుకుంటోంది. ప్రపంచ క్లీన్ ఎనర్జీ లక్ష్యాలకు అనుగుణంగా, 2030 నాటికి సామర్థ్యాన్ని 30 GWకి పెంచడానికి 20 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధంగా ఉంది.
రాక్‌మాన్ ఇండస్ట్రీస్
1960లో స్థాపించిన హీరో గ్రూప్‌లో భాగమైన రాక్‌మ్యాన్ ఇండస్ట్రీస్ అల్యూమినియం డై-కాస్టింగ్ భాగాలు, అధునాతన కార్బన్ సంబంధిత ఆటో భాగాల తయారీదారు. లుధియానా, హరిద్వార్, చెన్నై, బవాల్, సూరత్, వడోదర, తిరుపతి ప్లాంట్లతో రూ. 2,390 కోట్ల వార్షిక ఆదాయం కలిగి ఉంది. ఏరో స్పేస్, హై-ఎండ్ ఆటోమోటివ్ రంగాల్లోకి ప్రవేశించింది.
ఈ వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ఎండీ, చైర్మన్ రాహుల్ ముంజల్, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ గ్లోబల్ సీఈవో శ్రీవాత్సన్ అయ్యర్, రాక్‌మాన్ ఇండస్ట్రీస్ ఎండీ ఉజ్వల్ ముంజల్, రాక్‌మాన్ ఇండస్ట్రీస్ సీఈవో కౌసిక్ మన్నా, ఓహ్మియం సీఈవో ఆర్నే బాలంటైన్ పాల్గొన్నారు.