స్వాతంత్య్రం సిద్దించి 75 వసంతాల సందర్బంగా అమృత మహోత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో స్త్రీలను మానభంగం చేసి ఇంట్లో వారిని హత్య చేసిన వారిని క్షమాభిక్ష ప్రసాదించిన ప్రభుత్వం, మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించి హత్య చేసి పైశాచికానందం పొందుతున్న ఉన్మాదుల పట్ల నోరుమెదపని ప్రభుత్వం.
దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన ఆటగాళ్లపై లైంగిక వేధింపులు గురిచేస్తున్న ప్రజా ప్రతినిధుల పట్ల చర్యలకు ఉపక్రమించని ప్రభుత్వాలను మనం చూస్తున్నాం. సభ్యతగల సమాజంలో జీవిస్తున్నట్లు ప్రజలను భ్రమింపచేసి మహిళల హక్కులకు మేము చేసినంతగా ఎవరూ చేయలేదని మహిళా రిజర్వేషన్లు ప్రవేశ పెట్టారు.
నేడు మహిళలపై అఘాయిత్యాలు, బాలికలపై లైంగిక దాడులు, సభ్యసమాజం తలదించుకునేల మన సంస్కృతి వారసత్వం మానవ విలువలు పతనమవుతున్న ఈ తరుణంలో నాడు బ్రిటిష్ సిపాయిల కామ దాహానికి బలైపోతున్న మహిళల శీలాన్ని కాపాడేందుకు ఎదురునిలిచి బ్రిటిష్ సిపాయిల తుపాకి గుళ్లకు ప్రాణాలు వదిలిన అమరుడు గూళపాళెం హంపన్న గురించి స్మరించుకొని, ఆ భావజాలాన్ని, పోరాట పటిమను, స్ఫూర్తిని నేటి సమాజానికి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1893లో అక్టోబర్ 4న అమరుడయ్యారు. వీర హంపన్న ప్రాణత్యాగానికి ప్రతీకగా దీనబంధు పట్టు కేశవ పిళ్ళై గుత్తి దాతల సహకారంతో సర్ థామస్ మన్రో సత్రం ఎదురుగా హంపన్న సమాధితో పాటు ఒక స్మారక స్తూపాన్ని నిర్మించింది. ఆ రోజుల్లో మిలిటరీ దండు విడిది చేసిందంటే మహిళలు ఇల్లు ఒదిలి బయటకు వెళ్ళేందుకు సాహసించేవారు కాదు. ప్రాణ భీతితో భయకంపితులయ్యేవారు. గుంతకల్లులో విడిది చేసిన సైన్యంలోని ఇద్దరు సిపాయిలు సాయంత్రం గ్రామ శివారులో షికారుకు వెళుతూ జొన్న చేనులో గడ్డి కోసుకుంటున్న ఇద్దరు మహిళలను చూశారు.
ఆ ఇద్దరిమీద లైంగికంగా దాడిచేసేందుకు ప్రయత్నించారు. సిపాయిలు తమ వైపు రావడం గమనించిన మహిళలు భయంతో. అక్కడి నుంచి పరుగు తీశారు. అయితే సిపాయిలు మాత్రం వారిని వదలక వెంబడించారు. అదే సమయంలో అక్కడి రైల్వే గేట్ కీపర్ గా ఉన్న గూళపాళెం హంపన్న ఆర్థనాదాలతో పరిగెడుతున్న మహిళలను చూశాడు. హంపన్న వెంటనే వారి వద్దకు వెళ్లి తన గదిలోకి వెళ్లమని చెప్పారు. అనంతరం హంపన్న సిపాయిలకు అడ్డుగా నిలిచారు.
అడ్డు తొలగమని సిపాయిలు హంపన్నకు అర్థం కాని భాషలో ఆదేశించారు. ఆయన బెదరలేదు.దీంతో ఆంగ్లేయ సిపాయిలు ఆగ్రహించి హంపన్నను తుపాకితో కాల్చి నేలకూల్చారు. తుపాకి పేలుడు శబ్దం విని రైల్వే పోలీసులు అక్కడికి పరుగులు తీశారు. దీంతో సిపాయిలు పారిపోయారు. తుపాకీ గుళ్ళకి నేలకొరిగిన హంపన్నను ప్రాణాలతో బ్రతికించాలని వెంటనే గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చినా ఫలితం లేకపోయింది.
అప్పటికే ఆయన ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. హంపన్న ధైర్య సాహసాలకు, మానవత్వానికి మహిళల మాన ప్రాణాలు కాపాడేందుకు ప్రాణాలు పోగొట్టుకున్న అమరవీరుడికి గుర్తుగా గుత్తి లో ఒక స్థూపం నిర్మించారు. ఆ స్థూపం దిగువ భాగాన ‘‘ యూరోపియన్ సిపాయిల బారి నుంచి ఇద్దరు మహిళలను రక్షించబోయి సిపాయిల తుపాకీ గుళ్లకు బలైన హంపన్న పార్థీవ దేహం ఇక్కడ పాతి ఉంది.
హిందూపత్రికలో 1893-96లో ఈ కేసుకు సంబంధించి వచ్చిన వివిధ కథనాల ప్రకారం 1893 అక్టోబరు 4 న గుంతకల్లు రైల్వే స్టేషన్ మీదుగా సికింద్రాబాద్ వెళ్తున్న ఆంగ్ల సైనికుల పటాలంలో కొందరు దుష్ప్రవర్తన, దురన్యాయానికి ప్రతిఘటించినందుకు రైల్వేగేటు కీపర్ అయిన గొల్ల హంపన్న ను కాల్చి చంపారు. వెల్లింగ్టన్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే దారిలో గుంతకల్లు వద్ద పటాలం రైలు మారవలసి రావడంతో వారు ఒక మిలటరీ బంగళాలో దిగారు. సాయంకాల సమయంలో కొందరు మద్యపానం చేసి ఆ దారిలో వెళ్తున్న ఇద్దరు స్త్రీలపై అత్యాచార యత్నం చేశారు.
దీంతో వారిద్దరూ పారిపోయి రైల్వే గేట్ కీపర్ గొల్ల హంపన్న శరణు కోరి, ఆయనకు కేటాయించిన చిన్న గదిలో దాక్కున్నారు. గది తలుపులు విరగ్గొట్టబోయి సాధ్యం కాకపోవడంతో తమను వారిస్తున్న గొల్ల హంపన్నను తుపాకీతో కాల్చి బంగళాకు పారిపోయారు. రైల్వే పోలీసులు కూడా అక్కడికి వచ్చారు.
ఆ రాత్రి జరిగిన గుర్తింపు కార్యకలాపంలో హంపన్న తానున్న నీరసం స్థితిలో కాల్చిన వారిని గుర్తించలేకపోయారు. తర్వాతి రోజు పొత్తి కడుపు కింద, గజ్జల దగ్గర ఇరుక్కున్న తుపాకీ గుండు ప్రభావం వల్ల హంపన్న మరణించారు.
తెంపరి హంపన్న వీరోచిత మరణాన్ని కీర్తిస్తూ విద్వాన్ విశ్వం ఒకనాడు అనే పద్యకావ్యం రాసాడు. అందులో పద్యం ఒకటి:
ఈ వీరగల్లు గుడిలో
కావలి హంపన్న ఆత్మ కాపురముండున్
తావెక్కడ చాలును భర
తావనియే వాని ఆలయమ్మగును గదా?