Suryaa.co.in

Andhra Pradesh

పులుల నుంచి రక్షణ కోసం చేతి కర్రలు ఇచ్చారు

– వైసీపీ దాడుల నుంచి ఆత్మ రక్షణ కోసం దళితులకు ఏమిస్తారు…?
– హోం మంత్రి తానేటి, సలహాదారు సజ్జలకు బాలకోటయ్య బహిరంగ లేఖ

తిరుమలలో కాలిబాటన వెళ్తున్న భక్తులు పులుల నోట పడకుండా, చేతికి చేతి కర్రలు ఇస్తున్న ప్రభుత్వం, రాష్ట్రంలో దళితులపై, గిరిజనుల పై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, హత్యాచారాల నుంచి ఆత్మ రక్షణ కోసం దళితుల చేతికి ఏమిస్తారో ? చెప్పాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారం రోజుల పాటు లండన్ పర్యటనలో ఉన్నందున ఆయన హోం మంత్రి తానేటి వనితకు, ‘సకల శాఖా మంత్రి’ సజ్జన రామకృష్ణారెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

నాలుగున్నరేళ్ళ వైకాపాలనలో దళితులు తొలి బాధితులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమం సంకనాకి ఏళ్ళు గడిచాయని, వాటిపై ఆశ కూడా లేదన్నారు. దాడుల నుంచి, హత్యల నుంచి ప్రాణాలు కాపాడుకోవడం ఒక్కటే ప్రధాన ఎజెండాగా మారింది అన్నారు. డాక్టర్ సుధాకర్, డాక్టర్ అచ్చెన్న,డ్రైవర్ సుబ్రహ్మణ్యం, చీరాల కిరణ్ బాబు, బాపట్ల అమర్నాథ్ వంటి వారిని హత్య చేసి ప్రభుత్వం క్రింది కులాలను భయ భ్రాంతులకు గురిచేస్తుందన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ,రైల్వే స్టేషన్లో ముఖ్యమంత్రి నివాస ప్రాంతాల్లో మానభంగాలు జరిగినా, వాటిని రొటీన్ కార్యక్రమంలా పోల్చి మాట్లాడటం, గత ప్రభుత్వాల హయాం లో జరగ లేదా? అని, శాతాలు లెక్కలు వేయటం, ఎదురు దాడి చేయడం పాలనలో బాధ్యతలను పూర్తిగా మరిచిపోవటమే అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న హెచ్ఆర్సీ, మహిళా కమిషన్ కార్యాలయాలకు తాళాలు వేసుకొని, తాడేపల్లి సౌధంలో విశ్రాంతి తీసుకుంటున్నారని, కేంద్రంలో ఉన్న రాజ్యాంగ సంస్థలు మూడు కోతుల మాదిరిగా ఢిల్లీలోనే కూర్చొని చూస్తున్నాయని ధ్వజమెత్తారు.

ప్రతిపక్ష పార్టీల పాదయాత్రలో కూడా దళితులనే సమిధలుగా వాడుతున్నారని, ఈ కుట్రలలో ఏ ఒక్క ప్రాణం పోయినా, బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఆత్మ రక్షణ కోసం దళితులకు కర్రలిస్తుందో, కత్తులిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళిత బహుజన కులాలు ప్రభుత్వ దుర్మార్గాలకు దూరంగా ఉండాలని, తమను తాము రక్షించుకునేందుకు సంఘటితం కావాలని హెచ్చరించారు .

లేకపోతే భావి తరాలకు బానిసత్వమే వారసత్వంగా మిగులుతోందని, రాజ్యాంగ ప్రధాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఆశయాలకు అది తీరని ద్రోహమే అని బాలకోటయ్య హితవు చెప్పారు.

LEAVE A RESPONSE