సుందరకాండలో అతడే ముందర!

211

అల నీలి గగనాల
రుధిర వర్ణంతో మెరిసే
ఆదిదేవుణ్ణి పండని మురిసి
ఒక్క ఉదుటున ఆకసానికే
లగెత్తిన సామి..
శతయోజన సాగరాన్ని
లంఘించడానికి ఆలోచిస్తున్నాడదేమి..
ఆశచర్యము..
ఆ మహాబలుడికి
తనపై తనకే శంక..
అలా అయితే ఎవరు కదిలించేను
లంక డొంక?

ఔను..ఆ కోతే కదా
రాకాసి లంకిణి
భరతం పట్టాలి..
అశోకవనమున కుబ్జరూపుడై
తల్లి సీతమ్మ జాడ కనిపెట్టాలి
అమ్మకు రామయ్య
ఆనవాలు చూపి
స్వాంతన ఇవ్వాలి..
రాక్షస సమూహాన్ని బెదరగొట్టి జగజ్జిత్తు ఇంద్రజిత్తునే కదిలించి
రామయ్య రాయబారం
రావణుని కడకు చేర్చి
నువ్వు కడతేరే సమయం
ఆసన్నమైందని చెప్పాలి..
అంతటి పౌలస్య
బ్రహ్మ సభలో
ఈ కాబోయే బ్రహ్మ
వాలమే ఆసనమ్ముగ
అసీనుడు కావాలి..
ఆనక లంకకు నిప్పు పెట్టి
రయ్యమంటూ రామయ్య కడకు ఎగరాలి..!

భారతంలో కూడా
భారం మోసిన
హనుమయ్య..
సీతారామ సమాగమ వారధి
జలధిని దాటనంటే ఎలా..
సాగరమే నవ్వదా కిలాకిలా…
వానరసమూహం
చేసేస్తే కీర్తన..
చూడాలి అంజనాసుతుని
పద నర్తన..
ఇటు సుందరకాండ..
అటు కిష్కిందకాండ..
ఆపై యుద్ధకాండ..
అంతా రామమయం..
హనుమే లేకపోతే
అంతటి రామయ్యకే అయోమయం..!

అనంత సృష్టిలో ఎక్కడున్నాడో
ఆ చిరంజీవి..
ఉన్నాడన్న ఆలోచనే
ఓ ధైర్యం..
ఎక్కడ రామనామం వినబడితే అక్కడ..
ఏ ఇంట దాశరధిని పూజిస్తారో
ఆ వాకిట..తన బాసట..
సంకటసే హనుమాన చుడావై
మనక్రమ వచన
ధ్యాన జోలావై..
ఈ జగమే రామమందిరమైతే
రామ దువారే తుమ రఖవారే..
హో తను ఆజ్ఞా
బినుపై ఠారే..
ఇంతవరకు సూక్ష్మరూపధారిగా..
అదృశ్యరూపంలో
సంచరిస్తున్న స్వామి
ఒకనాటికి వస్తాడు
విధాతగా..ప్రాణదాతగా..!

ఆన్నట్టు సామీ..
నువ్వే బ్రహ్మవైనాక..
వద్దయ్యా..
ఈ అవకతవకల సృష్టి..
నీలాంటి ఓ కపి రూపం నుంచి నేటి
ఈ మానవ వేషంలోకి
సాగిన మా జీవనయానం..
సమస్తం అపసవ్యం..
అస్తవ్యస్తం..!
వద్దు ఆ పరిణామక్రమం..
ఇలాంటి అక్రమం..
కోతి రూపమే
కోటి జన్మలకూ ఉన్నా..
నీలా ఒక్క జన్మతోనే
సరిపెట్టినా సరిపోవు..
మాకు చాలు నీ చాలీసా..
బ్రతుకే హైలేసా..
నీ సృష్టిలో
రామనామంతో
జీవితమే సరిగమపదనిసా..!

-ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286