ఆంజనేయస్వామి అవతారాలు తొమ్మిది

హనుమంతుడు కూడా దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం అవతారాలు ఎత్తాడు. అవి తొమ్మిది. హనుమన్నవావతారాలంటారు. పరాశర సంహితలో పరాశర మహర్షి వాటిని వివరించడం జరిగింది.

1. ప్రసన్నాంజనేయస్వామి. 2. వీరాంజనేయస్వామి. 3. వింశతిభుజాంజనేయస్వామి. 4. పంచముఖాంజనేయస్వామి. 5. అష్టాదశ భుజాంజనేయస్వామి. 6. సువర్చలాంజనేయస్వామి. 7. చతుర్భుజాంజనేయస్వామి. 8. ద్వాత్రింశాద్భుజాంజనేయస్వామి. 9. వానరాకార ఆంజనేయస్వామి.
ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన ప్రత్యేక రోజులు – శనివారం, మంగళవారం మరియు గురువారం.

పురాణకథ ప్రకారం, ఒక సారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, ఎగురవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. అందుకే ఏడున్నర యేళ్ళ శనిదోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శని వారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకోవచ్చు.

శ్రీ ఆంజనేయం శిరసా నమామి త్రేతాయుగమున దుష్ట శిక్షణ – శిష్ట రక్షణ కొఱకు, దానవులను సంహరించి ధర్మపాలన సంస్థాపన చేయుటకై మానవునుగా హరి, వానరయూధ ముఖ్యునిగా రుద్రాంశతో ఆంజనేయుడు జన్మించారు.

ఒకప్పుడు ‘పుంజికస్థల ‘ అను అప్సరస శాపవశంచేత భూలోకమున అంజనగా జన్మించి వానర రాజైన కేసరిని వివాహమాడింది. ఆమె మహా పతివ్రత. వివాహమై చాలకాలమైనా ఆమెకు సంతానం కలుగకపోవడంతో సంతానంకై కఠోర తపస్సు ప్రారంభించింది. ఆమె తపస్సుకు మెచ్చి వాయుదేవుడు ప్రతినిత్యం ఒక ఫలంను అనుగ్రహిస్తే దానిని వాయుదేవుని ప్రసాదంగా స్వీకరించేది. ఒకనాడు శివపార్వతులు ఆ ప్రాంతమున స్వేచ్ఛా విహారులై వానరరూపాల్లో క్రీడిస్తుండగా స్ఖలించిన శివుని వీర్యమును భద్రపరిచిన వాయుదేవుడు ఆ వీర్యమును ఒక ఆకు దొప్పలో పండుగా మార్చి వాయువీవనచే అంజనాదేవి ముందు పడవేయగా ఆ శివవీర్యాన్ని ఆనాటి వాయుప్రసాదముగా భావించి అంజన భుజించినది. ఫలితంగా తక్షణమే గర్భం దాల్చింది.

తనకు గర్భము ఎలా వచ్చిందో తెలియక దుఃఖించి దానికి కారణమైన వారిని శపించబోగా, వాయుదేవుడు ప్రత్యక్షమై ఆమె గర్భమున శివాంశతో పుత్రుడు జన్మిస్తాడని, అతడు వాయుపుత్రుడుగా వాసికెక్కుతాడని అభయమిస్తాడు. వానరరాజు అయిన కేసరి దీనిని దివ్యప్రసాదంగా భావించి సమ్మతించాడు. అటుపై – వైశాఖ మాసం, కృష్ణ పక్షం, తిధి దశమి, శనివారం, పూర్వాభాద్ర నక్షత్రయుక్త కర్కాటక లగ్నం, వైధృతి నామయోగం, గ్రహాలన్నీ శుభస్థానాలలో ఉన్న మధ్యాహ్న తరుణంలో ఆంజనేయుని జననం జరిగింది.

శ్రీ దత్త సాయి లీలా సంహీత గ్రూప్
జి.సురేష్ కుమార్

Leave a Reply