మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

– టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

అమరావతి : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలంటే సమాజంలో సగం జనాభా మాత్రమే కాదు, సమాజ శక్తిలో సగం అని పేర్కొన్నారు. అందుకే మహిళలను తోబుట్టువుల్లా చూసిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని గుర్తు చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, వారిలో ఆత్మవిశ్వాసం నింపి, ఆర్థిక స్వావలంబనకు నిరంతరం పని చేసింది టీడీపీనే అని అన్నారు.

విద్యా, ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లు వంటి విప్లవాత్మక నిర్ణయాలతో ఆడబిడ్డల జీవితాల్లో తెలుగుదేశం పార్టీ వెలుగులు నింపిందని, ప్రత్యేకంగా మహిళలకు 22 సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు టీడీపీ ప్రభుత్వం అమలు చేసిందని గుర్తు చేశారు. నేడు మహిళలను మహాశక్తులుగా మార్చేందుకు మహాశక్తి పథకం ప్రకటించాము అన్నారు. ఈ పథకం కింద చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ 15,000 చొప్పున ఆర్థిక సహాయం, ప్రతి మహిళకు నెలకు రూ.1,500ల ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు చొప్పున అందిస్తామని హామీ ఇచ్చారు.

మహిళా సాధికారత అంటే ఓట్ల రాజకీయం కాదని, మన ఆడబిడ్డలు బాగుండేలా చూడడం అని అన్నారు. ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి ఇల్లు బాగుంటేనే నిజమైన మహిళా సాధికారిత, ఆ దిశగా అడుగులువేద్దామని పిలుపునిచ్చారు. మీ అందరి మద్దతుతో త్వరలో ఏర్పడే టీడీపీ- జనసేన ప్రభుత్వంలో మీకు అభివృద్ధి, భద్రత కల్పిస్తాం అని చంద్రబాబు అన్నారు.

Leave a Reply