వెంకన్న సన్నిధిలో భక్తుల రోదన

– తప్పిపోయిన పిల్లలతో తలిదండ్రుల రోదన
– అనేకమంది భక్తులకు గాయాలు
– విజిలెన్స్ స్పందించదేం?

ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చిన భక్తులు నరకం అనుభవించారు. సరైన సౌకర్యాలు ఏర్పాటుచేయని టీటీడీ నిర్లక్ష్యానికి సామాన్యభక్తులు బలయ్యారు. తోపులాటలు, తొక్కిసలాటలు. ఆ క్రమంలో చాలామంది భక్తులకు గాయాలు. ఇదీ మంగళవారం నాటి తిరుమల దృశ్యాలు.

కరోనా మహమ్మారి శ్రీవారిని దర్శన విధానాన్ని కూడా మార్చేసింది.. ప్రత్యేక దర్శనం అయినా.. సర్వదర్శనం అయినా టికెట్లు తప్పనిసరి చేసింది టీటీడీ… కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ శ్రీవారిని దర్శనం కల్పించేందుకు వీలుగా.. ఆన్‌లైన్‌లో కోటా పెట్టి దర్శనం కల్పిస్తూ వస్తోంది.. శ్రీవారి సర్వదర్శన టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.

సర్వదర్శనం టికెట్లు ఇచ్చే క్యూ లైన్‌ వద్దకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.. వేలాది మంది ఒక్కసారిగా రావడంతో తోపులాట జరిగింది.. ఓ దశలో తొక్కిసలాట కూడా జరిగినట్టు చెబుతున్నారు. క్యూలైన్లు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి.. క్యూలైన్‌లో పలువరు భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన పలువరు భక్తులు కన్నీటి పర్యంతం అయ్యారు.. టీటీడీ సరైన ఏర్పాట్లు చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో గోవిందరాజస్వామి సత్రాల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.. రంగంలోకి దిగిన తిరుపతి పోలీసులు భక్తులను కంట్రోల్ చేసి.. పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.. క్యూ లైన్లలో తోపులాటలతో పదుల సంఖ్యలో భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు.. తాగేందుకు కనీసం నీరు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేసి భక్తులు.. టికెట్ల జారీలో టీటీడీ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భక్తుల తోపులాటలో చాలామంది పిల్లలు తప్పిపోయినట్టు చెబుతున్నారు.. పోలీసుల లేకపోతే మా పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని భక్తులు వాపోయారు.. ఇంత జరుగుతున్న టీటీడీ విజిలెన్స్‌ స్పందించలేదని విమర్శిస్తున్నారు.. ఇక, భక్తుల రద్దీని దృష్టిలో పుట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ.. టికెట్లు లోకపోయినా సర్వదర్శనం కల్పిస్తామని అధికారులు తెలిపారు.. నేరుగా కొండపైకి చేరుకోవాలని సూచించారు. అయితే, ఇప్పటికే టికెట్లు తీసుకున్నవారి పరిస్థితి ఏంటి? అనేది తెలియాల్సి ఉన్నా.. మరోవైపు.. భక్తుల రద్దీని దృష్టిలోపెట్టుకున్న టీటీడీ.. వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేసింది.. రేపటి నుంచి ఆదివారం వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది టీటీడీ.