Suryaa.co.in

Telangana

రేవంత్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించిందా?

– హెచ్ సీయూ భూముల అమ్మకంపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బిజెపి తెలంగాణ ప్రధాన అధికార ప్రతినిధి & మీడియా ఇంచార్జ్ ఎన్.వి.సుభాష్

హైదరాబాద్: రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గచ్చిబౌలిలోని హైదరాబాద్ యూనివర్సిటి సమీపంలో ఉన్న 400 ఎకరాల విలువైన భూములను విక్రయించే దిశగా తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రధాన అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి.సుభాష్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థుల నుండి విస్తృతంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజాస్వామిక పాలన అంటే ప్రజల భద్రత, వారి హక్కుల రక్షణ. కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభాన్ని పూడ్చేందుకు ప్రభుత్వ భూములను అమ్మాలనుకోవడం మూర్ఖత్వమని విమర్శించారు. భూములను అమ్మడం ద్వారా ప్రభుత్వానికి అస్తిత్వం ఎలా లభిస్తుంది అని సుభాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హెచ్ సీయూలో భూముల అమ్మకానికి వ్యతిరేకంగా, పర్యావరణ పరిరక్షణ దిశగా, ప్రజల ప్రయోజనాలను రక్షించే లక్ష్యంతో విద్యార్థులు నిరసన తెలిపారని, అయితే పోలీసులు విద్యార్థులపై విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడం దుర్మార్గమని ఎన్.వి. సుభాష్ మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలను ఆయన ఖండించారు. దీన్ని ప్రజాస్వామిక హక్కులపై చేయబడిన అనాగరిక దాడిగా ఆయన పరిగణించారు.

ఈ సందర్భంగా.. చరిత్రను స్మరించుకుంటూ, 2007-08లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూమిని ఢిల్లీ కి చెందిన రియల్ ఎస్టేట్ డెవలపర్‌కు అప్పగించాలని ప్రయత్నించిందని.. అప్పటికీ రేవంత్ రెడ్డి TDP నాయకుడిగా ఈ ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించారని.. మరి ఇప్పుడు ఎందుకు ఆయన భిన్నంగా వ్యవహరిస్తున్నారని సుభాష్ ప్రశ్నించారు. ప్రజల కోసం పోరాడే వారు ఇప్పుడు తన గత నిర్ణయాలను వదిలి ఆర్థిక అవసరాల పేరుతో ప్రజల భూమిని అమ్మడానికి ముందుకు వస్తున్నారా? అని సుభాష్ ప్రశ్నించారు.

బిజెపి ప్రజా ఆస్తుల విక్రయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని సుభాష్ వెల్లడించారు. ప్రజాస్వామిక పాలన అంటే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ఉండాలి. కానీ ఇలా పబ్లిక్ అసెట్స్‌ను వేలం వేసి ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడాలని పాలకులు భావిస్తున్నారంటే, ప్రజలు ఇలాంటి నిర్ణయాలను ఎప్పటికీ మన్నించరని రేవంత్ ప్రభుత్వాన్ని ఎన్.వి.సుభాష్ హెచ్చరించారు.

LEAVE A RESPONSE