Suryaa.co.in

Telangana

ఇదిగో రాజీనామా.. రేవంత్ ఎక్కడ?

రాజీనామాతో గన్‌పార్క్ చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావు

కాంగ్రెస్ 6 గ్యారంటీలు 13 హామీల అమలు కోసం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తన రాజీనామా పత్రంతో గన్ పార్కుకు చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ, ఆరు గ్యారంటీలు ఆగస్ట్ 15లోగా అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. హామీలు అమలైతే ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయనని చెప్పారు. తనకు రాజకీయాలకంటే పేద ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు.

అవ్వాతాతలకు 4 వేల పింఛన్ రావాలని, వడ్లకు మొక్కజొన్నకు 500 బోనస్ ఇవ్వాలని, రైతుబంధు 15 వేలు వేయాలని డిమాండ్ చేశారు. ఇవేవీ తాము కొత్తగా అడుగుతున్న డిమాండ్లు కావని కాంగ్రెస్ నేతలే స్వయంగా బాండు పేపర్లు రాసిచ్చినవి చెప్పారు. వంద రోజుల్లోగా వీటికి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారని గుర్తు చేశారు. ‘‘ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని సోనియాంగాంధీ రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. డిసెంబర్ 9న రుణమాఫీపై తొలి సంతకం చేస్తామని మాట తప్పినందుకు క్షమాపణ చెప్పాలి.

ఆగస్ట్ 15 తేదీ లోపనైనా అన్ని హామీలు అమలు చేస్తే సంతోషం. నా ఒక్కడి ఎమ్మెల్యే పదవికంటే 4 వేల ఆసరా పింఛన్, 4 వేల నిరుద్యోగ భృతి, మహిళకు 2500 రావడం, 2 లక్షల రుణామాఫీ జరగడం ముఖ్యం. నేను ఐదేళ్లు పదవిలో లేకపోయినా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగితే అంతకంటే సంతోషమేముంది’’ అని హరీష్ రావు అన్నారు. తాను స్పీకర్ ఫార్మాట్లోనూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, రాజీనామా పత్రాన్ని తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టుల చేతుల్లో పెడుతున్నానని చెప్పారు.

‘‘కాంగ్రెస్ హామీలు నిజమైతే, రేవంత్ భేషజం వల్ల గన్ పార్కుకు రావడానికి ఇష్టం లేకపోతే ఆయన పీఏ ద్వారా లేకపోతే సిబ్బంది ద్వారా పంపండి. స్తూపం వద్ద పూలు పెట్టడానికి ఆయనకు ఇష్టం లేకపోవచ్చు. రేవంత్ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నా. మీ 6 గ్యారంటీలు 13 హామీలను అమలు చేయాలని కోరుతున్నాను. జర్నలిస్టుల చేతుల్లో రాజీనామా లేఖ పెట్టి వెళ్తున్నాను. రేవంత్ హామీలను అమలు చేస్తే నా లేఖను వాళ్లు స్పీకర్‌కు ఇస్తారు. ఆయన ఇస్తారో ఇవ్వరో ఆయన విజ్ఞతకు వదిలిలేస్తున్నాను. రేవంత్ రాజీనామా పత్రాన్ని ఇవ్వకపోతే దేవుళ్ల పేర్ల మీద మళ్లీ మోసం చేస్తారని భావించాల్సి ఉంటుంది’’ అని హరీష్ రావు అన్నారు.

LEAVE A RESPONSE