Suryaa.co.in

Telangana

మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క బృందాల‌కు అద్దె బ‌స్సులు

న‌ష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల్లోకి
1389 కొత్త బ‌స్సుల‌ కొనుగోలు
టీజీఎస్‌ఆర్టీసీ ప‌నితీరుపై మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ స‌మీక్ష‌

హైదరాబాద్‌లోని ర‌వాణా శాఖ ప్ర‌ధాన కార్యాల‌యంలో శ‌నివారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) పనితీరుపై రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మ‌హాల‌క్ష్మి-మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణ సౌక‌ర్యం, కొత్త బ‌స్సుల కొనుగోలు, లాజిస్టిక్స్, ఆర్థిక ప‌ర‌మైన అంశాలపై ప్ర‌ధానంగా చ‌ర్చించారు. ఈ అంశాల‌ను ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా మంత్రికి ఆర్టీసీ ఉన్న‌తాధికారులు వివ‌రించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన మ‌హాల‌క్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని ఆర్టీసీ సమర్థవంతంగా అమ‌లు చేస్తోంద‌ని, సంస్థ‌లోని ప్ర‌తి ఒక్క సిబ్బందికి అభినందన‌లు తెలియ‌జేశారు.

ఈ ప‌థ‌కంలో భాగంగా ఈ నెల 20 వ‌ర‌కు 111 కోట్ల జీరో టికెట్ల‌కు సంస్థ జారీ చేసింద‌ని, ఫ‌లితంగా రూ.3747 కోట్ల‌ను మ‌హిళ‌లు ఆదా చేసుకున్నార‌ని ఆయ‌న తెలిపారు. మ‌హాల‌క్ష్మి ప‌థ‌కానికి సంబంధించిన టికెట్ల రీయింబ‌ర్స్‌మెంట్‌ను ఆర్టీసీకి ఎప్ప‌టిక‌ప్పుడు రాష్ట్ర ప్ర‌భుత్వం చెల్లిస్తోంద‌ని వివ‌రించారు.

మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం వ‌ల్ల గ‌తంలో న‌ష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల్లోకి వెళ్లింద‌ని, రాష్ట్ర ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ‌కు ఇది శుభ‌సూచ‌క‌మ‌ని అన్నారు. ఈ ప‌థ‌కం అమ‌లుకు ముందు 69 శాతంగా ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్).. ప్ర‌స్తుతం 94 శాతానికి పెరిగింద‌ని గుర్తు చేశారు. మొత్తం ప్ర‌యాణికుల్లో 65.56 శాతం మ‌హిళ‌లే ఉంటున్నార‌ని వివ‌రించారు.

ఈ ప‌థ‌కాన్ని వినియోగించుకుంటోన్న మ‌హిళ‌ల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంద‌ని, ర‌ద్దీకి అనుగుణంగా కొత్త బ‌స్సుల కొనుగోలుకు ప్ర‌ణాళిక‌ను రూపొందించుకోవాల‌ని ఆర్టీసీ ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. వీలైనంత త్వ‌ర‌గా కొత్త బ‌స్సులు అందుబాటులోకి వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

గ‌త ఏడాది డిసెంబ‌ర్ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ స‌హ‌కారంతో 1389 కొత్త బ‌స్సుల‌ను ఆర్టీసీ కొనుగోలు చేసింద‌ని తెలిపారు. మొద‌టి విడ‌త‌లో మ‌హ‌బుబ్‌న‌గ‌ర్, క‌రీంన‌గ‌ర్, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లాల్లోని మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క బృందాల‌కు అద్దె బ‌స్సులను అంద‌జేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని తెలిపారు. ఈ నాలుగు ఉమ్మ‌డి జిల్లాల్లో మండ‌ల స‌మాఖ్యకు ఒక్క‌టి చొప్పున అద్దె బ‌స్సులను ఏర్పాటు చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

రాష్ట్రంలోని బ‌స్ స్టేష‌న్ల‌ను ఆధునీక‌రించాల‌ని సూచించారు. ఇటీవ‌ల ప్రారంభించిన కార్గో హోం డెలివ‌రీని స‌దుపాయాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌న్నారు. మ‌ర‌ణించిన, మెడిక‌ల్ అన్‌ఫిట్ అయిన సిబ్బంది జీవిత భాగ‌స్వాముల‌కు, పిల్ల‌లకు ఇచ్చే కారుణ్య ఉద్యోగాల నియామ‌క ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌న్నారు.

ఈ స‌మీక్షా స‌మావేశంలో ర‌వాణా, రోడ్లు భ‌వ‌నాల శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వికాస్ రాజ్, టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్, జాయింట్ డైరెక్ట‌ర్ అపూర్వ‌రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్లు మునిశేఖ‌ర్, వినోద్ కుమార్, ఫైనాన్స్ అడ్వ‌జ‌ర్ విజ‌య‌పుష్ఫ‌తో పాటు హెచ్‌వోడీలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE