Suryaa.co.in

Andhra Pradesh

పేదోడి బియ్యాన్ని సైతం పందికొక్కుల్లా బొక్కేస్తున్న జగన్ రెడ్డి బియ్యం బకాసురులు

– ‘ఖతర్నాక్ కారుమూరి’, ‘దోపిడీకి ద్వారం.. ద్వారంపూడి’
– రాష్ట్రంలో బియ్యం దిగుబడులు పెరగకపోయినా.. కాకినాడ పోర్టు నుండి బియ్యం ఎగుమతులు అమాంతం ఏ విధంగా పెరుగుతాయి?
– 2018-19లో బియ్యం దిగుబడులు 82.30 లక్షల టన్నులుంటే, 2020-21 నాటికి 78.90 లక్షల టన్నులకు తగ్గాయి
– బియ్యం ఎగుమతులు 2018-19లో 18.09 లక్షల టన్నులుంటే.. 2020-21 నాటికి 31.51 లక్షల టన్నులకు, 2021-22 నాటికి ఏకంగా 48.26 లక్షల టన్నులకు ఎలా చేరాయి?
– పంట దిగుబడులు పెరగలేదని కేంద్ర నివేదికలు చెబుతుంటే.. ఎగుమతులు ఎలా పెరుగుతున్నాయి. రేషన్ బియ్యం పక్కదారి పట్టించి విదేశాలకు ఎగుమతి చేయడం వల్ల కాదా?
– కేంద్రం ఇచ్చిన రేషన్ బియ్యంలోనూ 5.70 లక్షల టన్నులు మాయం చేసిన బియ్యం మాఫియా
– 2020-21లో 82.75 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు పేర్కొంటున్నారు. కానీ ఆ సంవత్సరం దిగుబడులు మాత్రం 78.90 లక్షల టన్నులేనని కేంద్ర నివేదికలు చెబుతున్నాయి.
– జగన్ రెడ్డి బియ్యం బకాసురుల దొంగ లెక్కలపై సీబీఐ విచారణ చేయాలి
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం

‘ఖతర్నాక్ కారుమూరి’, ‘దోపిడీకి ద్వారం.. ద్వారంపూడి’ ఆధ్వర్యంలో రాష్ట్రంలో బియ్యం మాఫియా రాజ్యమేలుతోంది. దేశంలోనే అతిపెద్ద బియ్యం కుంభకోణం రాష్ట్రంలో చోటుచేసుకుంది. దీనిపై సీబీఐతో విచారణ జరిపించి అక్రమార్కుల్ని బజారుకీడ్చి బోనెక్కించి బొక్కలోకి తోయాలి. అంత వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు.
జగన్ రెడ్డి మూడున్నరేళ్ల పాలన మొత్తం స్కాములతోనే నడిచింది. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి స్కాములతో పాలనంతా సాగింది. ఇప్పుడు పేదోడి రేషన్ బియ్యాన్ని సైతం పక్కదారి పట్టించి కుంభకోణానికి తెరలేపారు. పేదల పొట్ట కొట్టి జేబులు నింపుకుంటున్నారు. ఎవడి జేబు ఎలా కొట్టేయాలా.. తన జేబులు ఎలా నింపుకోవాలా అనే ఆలోచనే తప్ప.. పేదలు ఎలా పోయినా, పేదలు ఆకలితో అలమటించి చచ్చినా పట్టించుకోవడం లేదు.

రాష్ట్రంలో జరుగుతున్న బియ్యం కుంభకోణానికి ఇద్దరు రథసారధులున్నారు. వాస్తవానికి వారిద్దరినీ బియ్యం బకాసురులు అనాలి. ఒకరు ‘ఖతర్నాక్ కారుమూరి’. సివిల్ సప్లైస్ శాఖా మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు గారి గురించి తెలిసిన వారు, దగ్గర నుండి చూసిన వారు అతన్ని ముద్దుగా కంత్రీ కారుమూరి, ఖతర్నాక్ కారుమూరి అని పిలుచుకుంటారు. ఎందుకంటే అతని పనులన్నీ అంత ఖతర్నాక్ గా ఉంటాయి.

రెండో వ్యక్తి.. ‘దోపిడీకి ద్వారం.. ద్వారంపూడి’. ఇంకా చెప్పాలంటే దోపిడీకి సింహద్వారం లాంటి వ్యక్తి. ఎందుకంటే..ఎక్కడ ఏం దోచుకోవాలో, ఎలా దోచుకోవాలో దానికి సింహద్వారాలు ఏర్పాటు చేస్తుంటారు. అందుకే రెండో బియ్యం బకాసురుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్ గా ఉన్న ఆయన తండ్రి.

జగన్ రెడ్డి సారధ్యంలో ఈ ఇద్దరు బియ్యం బకాసురులు రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేసి.. కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తూ వేల కోట్లు జగన్ రెడ్డి ఖజానాకు తరలిస్తున్నారు. గతంలో బియ్యం బకాసురులు చేస్తున్న అక్రమాలను, కాకినాడ పోర్టు కేంద్రాంగా చేస్తున్న అక్రమ ఎగుమతులను బట్టబయలు చేశాం. అమాంతంగా బియ్యం ఎగుమతులు పెరగడం వెనుక భారీ కుంభకోణం ఉందని చెబితే.. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీడియా ముందుకొచ్చి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ధాన్యం దిగుబడులు పెరిగాయి, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ లో దిగుమతులు పెరగడంతో.. పెద్ద ఎత్తున రైల్వే వ్యాగన్లలో కాకినాడ పోర్టుకు తరలించి ఎగుమతులు చేస్తున్నారంటూ అమాయకంగా ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు.

కానీ ద్వారంపూడి చెబుతున్న మాటలకు విరుద్ధంగా.. కేంద్ర ప్రభుత్వ నివేదికలున్నాయి. అంతే కాకుండా గత కొంత కాలంగా పేపర్లలో వచ్చే ప్రధాన వార్తల్ని చూస్తే.. పేదల బియ్యం పక్కదారి, రేషన్ వాహనాల్లోనే నగదు బదిలీ, ఓడలెక్కుతున్న పేదల బియ్యం, రైతు పేరుతో కోట్లు స్వాహా వంటి శీర్షికలు ప్రతి రోజు దర్శనమిస్తూనే ఉన్నాయి. పంట దిగుబడులు తగ్గి.. ఏ మాత్రం గణనీయ పెరుగుదల నమోదు చేయని స్థితిలో… కాకినాడ పోర్టు ఎగుమతుల పెరుగుదల ఎలా?  రాష్ట్రంలో ధాన్యం దిగుబడులు పెరిగిపోతున్నాయంటూ.. ద్వారంపూడి చెప్పిన మాట శుద్ధ అబద్దం. కేంద్ర ప్రభుత్వ రికార్డుల్ని పరిశీలిస్తే ఆ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ స్ట్రాటస్టిక్స్ వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బియ్యం దిగుబడులు ఈ విధంగా ఉన్నాయి.
2015-16లో 74.90 లక్షల టన్నులు
2016-17లో 74.50 లక్షల టన్నులు
2017-18లో 81.70 లక్షల టన్నులు
2018-19లో 82.30 లక్షల టన్నులు
2019-20లో 86.60 లక్షల టన్నులు
2020-21లో 78.90 లక్షల టన్నులు
2021-22లోకి సంబంధించి కూడా నాలుగో అడ్వాన్స్డ్ అంచనాల ప్రకారం సుమారు 89 లక్షల టన్నుల దిగుబడులున్నాయి. ఈ లెక్కల ప్రకారం 2018-19లో బియ్యం దిగుబడులు 82.30 లక్షల టన్నులుంటే.. 2020-21 నాటికి 78.90 లక్షల టన్నులకు తగ్గింది. అంటే 3.40 లక్షల టన్నులు తగ్గింది. దిగుబడులు పెరిగాయంటూ ద్వారంపూడి చెప్పిన లెక్కలు పచ్చి అబద్దమని తేలింది.

2021-22కి సంబంధించి నాలుగో అడ్వాన్స్డ్ అంచనాల ప్రకారం 89లక్షల టన్నుల ధాన్యం దిగుబడులున్నాయి. తద్వారా గతంతో పోల్చినపుడు పెద్దగా పెరుగుదల ఏమీ లేదని స్పష్టమవుతోంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్పిన విధంగా.. ఎక్కడా ఆంధ్ర రాష్ట్రంలో బియ్యం దిగుబడులు గణనీయంగా పెరగలేదు. కానీ ఏపీ నుండి, మరీ ముఖ్యంగా కాకినాడ పోర్టు నుండి ఇతర దేశాలకు బియ్యం ఎగుమతులు ఎలా పెరిగాయో ఈ బియ్యం బకాసురులు సమాధానం చెప్పాలి.

ఎగుమతుల పరంగా చూస్తే.. 2018-19లో కాకినాడ పోర్టు ద్వారా 18,09,274 టన్నుల బియ్యం ఎగుమతి చేశారు. 2020-21 నాటికి 31.51 లక్షల టన్నులకు చేరుకున్నాయి. 2021-22 నాటికి అమాంతం 48.26 లక్షల టన్నులకు చేరాయి. పంట దిగుబడులు పెరగవు. కానీ ఏపీ నుండి బియ్యం ఎగుమతులు మాత్రం నాలుగైదు రెట్లు పెరిగిపోతున్నాయి. ఇది ఏ విధంగా సాధ్యం? రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించడం వలన కాదా? తెలంగాణ, ఛత్తీస్ గఢ్ బియ్యం కూడా కాకినాడ పోర్టు నుండే ఎగుమతి చేస్తున్నారంటూ గతంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. ఆ కోణంలో కూడా తాము పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ మూడు రాష్ట్రాలు కలిపి బియ్యం దిగుబడులు 2018-19లో 2.14 కోట్ల టన్నులుండగా.. 2020-21కి 2.27 కోట్ల టన్నులకు పెరిగాయి. అంటే 13 లక్షల టన్నులు(5.80 శాతం) పెరిగాయి. కానీ.. కాకినాడ కేంద్రంగా బియ్యం ఎగుమతులు మాత్రం 2018-19తో పోలిస్తే 2020-21లో 42.5 శాతం పెరిగాయి. అంటే.. మూడు రాష్ట్రాల బియ్యం దిగుబడులు మొత్తం కలిపినా.. 2018-19కి 2020-21తో పోలిస్తే కేవలం 5.80 శాతం పెరుగుదల నమోదు కాగా… అదే కాలానికి కాకినాడ పోర్టు ద్వారా బియ్యం ఎగుమతులు మాత్రం 8 రెట్లు పెరిగి, 42.50 పెరుగుదల నమోదు చేయడం జరిగింది.

ఈ అద్బుతం ఎలా సాధ్యం? పేద వాడి రేషన్ బియ్యాన్ని మింగడం వల్ల కాదా అని ఈ ఇద్దరు బియ్యం బకాసురులు, వారిని నడిపిస్తున్న జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. 2018-19కి, 2021-22కి పోల్చి చూస్తే మూడు రాష్ట్రాలు కలిపి బియ్యం దిగుబడులు 12.96 శాతం పెరిగితే.. అదే కాలానికి కాకినాడ పోర్టు ద్వారా బియ్యం ఎగుమతులు మాత్రం 62శాతం పెరిగాయి. అంటే.. బియ్యం దిగుబడుల పెరుగుదల శాతం కంటే.. 5 రెట్లు ఎక్కువ. ఈ విధంగా.. దిగుబడులు తక్కువ, ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయంటే.. ఇలా ఎగుమతి చేస్తున్న బియ్యం ఆకాశం నుండి ఊడి పడ్డాయా? ఈ బియ్యం బకాసురులు చెబుతున్నట్లు ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ఎక్కడా వారు చెప్పిన స్థాయిలో పంట దిగుబడులు పెరగలేదు. కానీ ఎగుమతులు మాత్రం 5-8 రెట్లు పెరిగాయి. ఈ పెరుగుదలకు కారణం బియ్యం బకాసురులు బొక్కేసిన రేషన్ బియ్యమే.

కేంద్రం ఇచ్చిన బియ్యాన్నీ బొక్కేశారు
కేంద్రం ప్రతి సంవత్సరం రాష్ట్రానికి రేషన్ బియ్యం పరంగా చూసినా.. 2019-20 నుండి 2022 జూన్ నాటి వరకు రాష్ట్రానికి 62,05,788 టన్నుల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయడానికి ఇచ్చారు. ఇందులో 5.70 లక్షల టన్నుల బియ్యం లెక్కలు తేలలేదని పార్లమెంటులో స్వయంగా కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కుండ బద్దలుగొట్టారు. ఈ విధంగా బియ్యం మాయం చేయడమే కాకుండా పేదలకు చేరాల్సిన కేంద్ర రేషన్ బియ్యాన్ని కిలో రూ.7-10కి బియ్యం మాఫియా దళారులు కొనుగోలు చేసి కాకినాడ పోర్టు ద్వారా అధిక లాభాలకు విదేశాలకు తరలిస్తున్నారు. ఈ మధ్య కాలంలో బియ్యం అమ్మకాల్లో వచ్చిన తేడాలతో గుంటూరు జిల్లాలో ఒక వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేసింది ఈ బియ్యం మాఫియా.

కేంద్రం ఇచ్చే రేషన్ బియ్యాన్ని పేదలకు చేరనీయకుండా తక్కువ ధరకు కొనుగోలు చేసి, అసలు పంచకుండా పక్కదారి పట్టించి కాకినాడ కేంద్రంగా ఎగుమతి చేస్తున్నారనే విషయం సుస్పష్టం. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం నుండి రైల్వే వ్యాగన్ల ద్వారా పెద్ద మొత్తంలో బియ్యం కాకినాడకు చేరుతోంది అనడం పచ్చి అబద్దం. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం నుండి రైల్వే వ్యాగన్ల ద్వారా పెద్ద మొత్తంలో బియ్యం చేరుతుండడంతో కాకినాడ పోర్టు నుండి బియ్యం ఎగుమతులు పెరుగుతున్నాయని ద్వారంపూడి గతంలో ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ రైళ్లలో కాకినాడకు వస్తున్న బియ్యం వివరాలను ఆర్టీఐ ద్వారా సేకరించగా.. ఛత్తీస్ గఢ్ నుండి 2020-21లో 9.90 లక్షల టన్నుల బియ్యం మాత్రమే వచ్చాయని, కానీ అదే సంవత్సరం కాకినాడ పోర్టు నుండి 31.51 లక్షల టన్నులు ఎగుమతి అయిందన్న విషయం స్పష్టమవుతోంది.

అదేవిధంగా 2021-22లో ఛత్తీస్ గఢ్ నుండి కాకినాడ పోర్టుకు రైల్వే వ్యాగన్ల ద్వారా వచ్చిన బియ్యం 11.06 లక్షల టన్నులని ఆర్టీఐ ద్వారా సమాచారం రాగా.. ఆ సంవత్సరం కాకినాడ పోర్టు నుండి ఎగుమతైన బియ్యం 48.26 లక్షల టన్నులని తేలింది. ఈ లెక్కలతో ద్వారంపూడి చెప్పిన విధంగా ఛత్తీస్ గఢ్ నుండి రైల్వే వ్యాగన్ల ద్వారా పెద్ద మొత్తంలో బియ్యం కాకినాడకు చేరలేదనే విషయం సుస్పష్టమవుతోంది. ఛత్తీస్ గఢ్ నుండి వస్తున్న బియ్యంతోనే కాకినాడ పోర్టు ఎగుమతులు పెరిగాయన్నదీ పచ్చి అబద్దం అని తేలిపోయింది. ఫైనల్ గా కాకినాడ పోర్టు ద్వారా పెరిగిన బియ్యం ఎగుమతులన్నీ దొంగిలించిన రేషన్ బియ్యం ద్వారానే అని అర్ధమవుతోంది. రాష్ట్రంలో రేషన్ బియ్యం పక్కదారి పడుతోందన్న విషయం ఈ లెక్కలతో స్పష్టంగా తేలింది.

దొంగ బిల్లులతో ఖజానాకు కన్నం వేస్తున్న జగన్ ముఠా
పొలాలు లేకపోయినా, పంట పండించకున్నా.. వారి పేరుతో బిల్లులు పెట్టి డబ్బులు వసూల్ చేస్తున్నారని, దొంగ బిల్లులతో రూ.146 కోట్లు దోచేశారని సాక్ష్యాత్తు సివిల్ సప్లైస్ కమిషనర్ వీరపాండ్యన్ ఈ మధ్యనే అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖ రాసి, ఆ డబ్బును తిరిగి వసూల్ చేయాలని ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించి మరో ఆధారాన్ని ప్రజల ముందు ఉంచబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం 2020-21లో 82.75 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు ప్రగల్బాలు పలుకుతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వ ఆదీనంలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ స్ట్రాటస్టిక్స్ లెక్కల ప్రకారం ఆ సంవత్సరం ఏపీలో దిగుబడులు 78.90 లక్షల టన్నులు. దిగుబడుల కంటే.. ఎక్కువగా సేకరించడం ఎలా సాధ్యమో బియ్యం బకాసురులు సమాధానం చెప్పాలి.

రైతులు కాని వారి పేర్లతో తప్పుడు బిల్లులు సృష్టించి కోట్లు బొక్కేశారనడానికి ఇంత కంటే సాక్ష్యాలు ఏం కావాలి? ధాన్యం సేకరణలో కూడా భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్నది సుస్పష్టం. పేదలకు బియ్యం ఇవ్వకుండా కిలోకు రూ.7-10 ఇచ్చి రేషన్ బియ్యం పక్కదార పట్టించడం, మరోవైపు తప్పుడు బిల్లులతో కోట్లకు కోట్లు ధాన్యం సేకరణలో స్వాహా చేస్తున్నారు. పేదల బియ్యాన్ని అడ్డదారుల్లో రీ సైక్లింగ్ చేసి దాన్ని అక్రమంగా విదేశాలకు అమ్ముకుంటున్నారు. దేశంలోనే అతిపెద్ద బియ్యం కుంభకోణం ఏపీలో జరుగుతోంది. ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలి. మేము చెప్పే లెక్కలపై, జరుగుతున్న అక్రమాలపై ‘ఖతర్నాక్ కారుమూరి’ గానీ, ‘దోపిడీ ద్వారం ద్వారంపూడి’ గానీ సమాధానం చెప్పగలరా?
కాకినాడ పోర్టు నుండి బియ్యం ఎగుమతుల అసాధారణ పెరుగుదల వివరాలను పరిశీలిస్తే.. 2015-16లో 19.41 లక్షల టన్నులు
2016-17లో 20.42 లక్షల టన్నులు
2017-18లో 21.71 లక్షల టన్నులు
2018-19లో 18.09 లక్షల టన్నులు
2020-21లో 31.51 లక్షల టన్నులు
2021-22లో 48.26 లక్షల టన్నులు
దేశంలో కాకినాడ పోర్టు, ముంద్రా పోర్టు ద్వారా మాత్రమే బియ్యం ఎగుమతులు ఎక్కువగా జరుగుతాయి. ముంద్రా పోర్టు నుండి 2018-19లలో 13.59 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి అయితే, 2021-22లో 18.58 లక్షల టన్నులకు చేరుకున్నాయి. అంటే 26 శాతం మాత్రమే ఎగుమతుల పెరుగుదల నమోదైంది. కానీ కాకినాడ పోర్టులో 2018-19లో 18.09 లక్షల టన్నుల బియ్యం ఎగుమతులుంటే.. 2021-22కి ఏకంగా 48.26 లక్షల టన్నులకు ఎలా పెరిగింది? ఈ పెరుగుదల అసాధారణమే కదా? అకస్మాత్తుగా కనిపిస్తున్న ఈ పెరుగుదల బియ్యం బకాసురుల రేషన్ బియ్యం దోపిడీ వల్ల కాదా? త్వరలోనే కేంద్ర విజిలెన్స్ కు కూడా ఈ వివరాలన్నీ పంపిస్తాం. అక్రమార్కుల అంతు తేల్చడం తధ్యం.

అక్రమార్కుల గుట్టు రట్టు చేయాల్సిందే
బియ్యం వ్యాపారం చేయడమూ తప్పుకాదు, ఎగుమతులు చేయడమూ తప్పు కాదు. న్యాయబద్దంగా బియ్యం ఎగుమతులు చేసే వ్యాపారస్తులను తాము ఎంత మాత్రమూ తప్పుబట్టడం లేదు. కానీ.. ద్వారంపూడిలా పేదల బియ్యం అక్రమంగా, అడ్డదారుల్లో విదేశాలకు అమ్ముకోవడాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి అవినీతి పరుడి కుటుంబం రైస్ మిర్లందరికీ నాయకత్వం వహించడం వారి దురదృష్టం. ఈ ద్వారంపూడి కుటుంబం కారణంగా.. నిజాయితీగా బియ్యం వ్యాపారం చేసుకునే వారిపై కూడా అవినీతి మరక అంటుకుంటోందని రైస్ మిల్లర్లు తెలుసుకోవాలి. రాష్ట్రంలో జరుగుతున్న బియ్యం మాఫియాపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. రాష్ట్రంలో జరుగుతున్న బియ్యం అక్రమాలపై తక్షణమే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్పందించాలి. ఈ బియ్యం కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించే దమ్ము జగన్ రెడ్డికి ఉందా? విచారణ జరిపించి అక్రమార్కులను కటకటాల్లోకి పంపే వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది.

LEAVE A RESPONSE