ఏపీఎండీసీ బాండ్లు జగన్ రెడ్డి ఎలా లాక్కుంటారు?

-ఒక్క జనవరి మాసంలోనే రూ.10 వేల కోట్లు రెవెన్యూ ఖర్చు దేనికి చేశావ్ జగన్ రెడ్డి?
-ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఏపీఎండీసీ బాండ్లు ఎలా వాడుకొంటుంది?
-ప్రభుత్వ ఖర్చులపై ఈసీ నియంత్రణ విధించాలి
-అస్మదీయ కంపెనీలకు పేమెంట్లు
-రూ.7000 కోట్ల నిధులు ప్రభుత్వం ఎందుకు తీసుకుంది?
-ఒక్క నెలలో నాలుగున్నర వేల కోట్లు అదనంగా ఖర్చు
-300 కోట్లు ఏ కార్పొరేషన్ ద్వారా అప్పు తెచ్చి, ఎవరికి పేమెంట్లు చేశారు?
– రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్

జగన్ రెడ్డి పాలన చివరి దశకు చేరుకుంటున్నా వివిధ మార్గాలలో విచ్చలవిడి అప్పులు చేస్తూ.. రెవెన్యూ వ్యయం పేరుతో వేలకు వేల కోట్లు ఇష్టానుసారం ఖర్చు చేస్తున్నారని, నెలకు రూ.5 వేల కోట్లు వుండే ప్రభుత్వ రెవెన్యూ ఖర్చు జనవరి నెలలో రూ.10 వేల కోట్లు ఎందుకు దాటిపోయిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికారప్రతినిధి నీలాయపాలెం విజయకుమార్ జగన్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

ఇతర ఖర్చులు.. అనగా వడ్డీలు, సబ్సిడీలు, పెన్షన్లు, జీతాలు, తదితరాలలో మార్పులేకపోయినా ఖర్చు ఎందుకు పెరిగిందని ప్రశ్నించారు. ప్రతి నెలా చేసే అప్పులకంటే అదనంగా రూ.4 వేల కోట్లు అప్పులు చేసి నాలుగున్నర వేల కోట్లు అదనంగా ఖర్చు ఎందుకు చేసారన్నారు. రెవెన్యూ ఖర్చు అని చూపెడుతున్న ఖర్చులో పెట్టిన అసలు ఖర్చు ఏమిటి? ఏ కాంట్రాక్టర్ల కోసం, ఏ అస్మదీయులకు కోసం పేమెంట్లు చేసారన్నారు. ప్రభుత్వ ఖర్చు పెరిగిందంటే.. ఏదేని ప్రాజెక్టుకో, పెద్ద పథకం నూతనంగా ప్రారంభించి వుండాలి. కానీ ఇవేమీ లేకపోయినా, జనవరి మాసంలో ప్రభుత్వ రెవెన్యూ ఖర్చు ఒక్కసారిగా రెండింతలుగా పెరిగిపోయింది. సాధారణంగా నెలకు రూ.5 వేల కోట్లు వుండే ప్రభుత్వ రెవెన్యూ ఖర్చు ఒక్కసారిగా 10 వేల కోట్లు దాటి పోయింది.

రెవెన్యూ ఖర్చు అంటే ఏమిటి:
ప్రభుత్వ రోజు వారీ ఖర్చుని రెవెన్యూ ఖర్చు అంటారు. కాఫీ, టీ, పెట్రోల్, డీజిల్ ఖర్చుల నుంచి కాంట్రాక్టర్లకు చెల్లించే బిల్లుల వరకు అన్నీ రెవెన్యూ ఖర్చు కిందే చూపిస్తారు. కాగ్‌కు నెల వారీ ఖర్చుల జాబితా ఇచ్చేటప్పుడు సరిగ్గా ఆ వెసులుబాటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి అక్కర కొచ్చింది. కాగ్ జనవరి మాసానికి ఇచ్చిన ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ఖర్చుల ప్రకారం తీసుకొన్న అప్పులు రూ.8,484.84 కోట్లు. చేసిన రెవెన్యూ ఖర్చు రూ.10,368 కోట్లు. ఇది సాధారణం కంటే దాదాపు నాలుగున్న ర వేల కోట్లు రూపాయలు అదనం. రెవెన్యూ ఖర్చు పేరుతో ఈ పద్దు కింద తోసేసి చేతులు దులుపుకుంటున్నారు. ఏఏ వాటికి ఎంతెంత ఖర్చు చేశారో తెలుసుకోవాలంటే ఏడాది పాటు వేచిచూడాల్సిందే. ఈ లోపు పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. అంత లోపల అన్ని ఖర్చులు తమకు కావలసిన విధంగా పెట్టేసుకొంటారు.

2022-23, 23-24 ఆర్ధిక సంవత్సరాల నెలవారి రెవెన్యూ ఖర్చుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి..
మాసం 2023-24 2022-23
అక్టోబర్ 5662 5468
నవంబర్ 5335 5092
డిసెంబర్ 6619 5171
జనవరి 10,368 7583
పై పట్టిన పరిశీలిస్తే..అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో 2022-23, 2023-24 ఆర్ధిక సంవత్సరాలలో రూ.5 వేల కోట్లుగా ఉన్న నెలవారీ రెవెన్యూ ఖర్చులు ఈ ఏడాది జనవరి మాసంలో మాత్రం అమాంతంగా రెండింతలు ఎందుకు పెరిగింది. జగన్ రెడ్డి దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలి.

2023 -24 ఆర్ధిక సంవత్సరంలో వడ్డీ చెల్లింపులు, జీత-భత్యాల వివరాలు..
మాసం వడ్డీ చెల్లింపులు జీత-భత్యాలు
సెప్టెంబర్ 2448 4029
అక్టోబర్ 2478 5016
నవంబర్ 2497 4160
డిసెంబర్ 2328 4283
జనవరి 2538 4728

పెన్షన్లపై, జీతభత్యాలపై చేసిన ఖర్చు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలలో నెలకు రూ. 15,1600 కోట్లకు మించి దాటలేదు. ఎన్నికలు వస్తున్నాయని తన అనుచరులకి, తన అస్మదీయ కంపెనీలకి, కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేసేసారు. అందుకోసమే రూ.8,484.84 కోట్లు అప్పులు కేవలం ఒక్క జనవరి మాసంలో చేసారు. కానీ, ఈ రూ.8484.84 కోట్లు అప్పుల్లో ఆర్.బి.ఐ నుంచి సేకరించిన సమాచారాన్ని చూస్తే అది కేవలం రూ.6,550 కోట్లు మాత్రమే ఆర్.బి.ఐ నుంచి జనవరిలో తీసుకున్నట్టు తెలుస్తోంది. మిగిలిన రూ. 2,300 కోట్లు ఏ కార్పొరేషన్ నుంచి అప్పు తెచ్చారు మహాశయా?

ఎన్ని కార్పొరేషన్లను మీ అప్పుల ప్రాపకానికి దివాలా తియ్యాలి ఇంకా? రూ.8,484.84 కోట్లు అప్పు తెచ్చి, వాటిలో ఆర్.బి.ఐ ద్వారా రూ.6,550 కోట్లు తెచ్చి, మిగతా 2300 కోట్లు ఏ కార్పొరేషన్ ద్వారా అప్పు తెచ్చి, ఎవరికి పేమెంట్లు చేశారు? ఎన్నికల ముంగిట్లో, కోడ్ వస్తుంటే., ఆదరా బాదరాగా ఇంత పెద్ద ఎత్తున చెల్లింపులు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఈ వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా?

కాగ్ వారికి తెలుగు దేశం పార్టీ చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే…..ఈ రెవెన్యూ ఖర్చు అనే పద్దు కింద ప్రభుత్వం చేస్తున్న ఖర్చులన్నీ తోసేయడంపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. కాగ్ ప్రకారం 2023-24 సంవత్సరంలో జనవరి దాకా మొత్తం రూ.2,09,651 కోట్లు ఖర్చు చేస్తే..అందులో రూ.85,623 కోట్లు రెవెన్యూ ఖర్చు చూపిస్తున్నారు. ఏఏ వాటి నిమిత్తం ఎంతెంత ఖర్చు చేశారో వివరాలు ఇవ్వకపోతే.. ఇక నెల వారీ ఖర్చు ఇచ్చి ఏమి లాభం? ఒక్క నెలలో నాలుగున్నర వేల కోట్లు అదనంగా ఖర్చు పెట్టేస్తే, ఆ ఖర్చు వివరాలు ఇప్పట్లో బయటకు రాకపోతే కాగ్ లెక్కల వల్ల ఏమి ప్రయోజనం?

ఏపీఎండీసీ బాండ్లు జగన్ రెడ్డి ఎలా లాక్కుంటారు?
నాలుగైదు రోజుల క్రితం ఏపీఎండీసీ నుంచి బాండ్లు జారీ చేయించి, అవి ఏపీఎండీసీ కార్పొరేషన్ కోసం ఖర్చు పెట్టనీయకుండా….రాష్ట్ర ప్రభుత్వం లాక్కున్న రూ. 7000 కోట్లు అప్పు రూపంలో తెచ్చిన నిధులు ప్రభుత్వం ఎలా ఖర్చు చేయబోతోంది.? ఇప్పటికే ఎన్నికల కోడ్ వచ్చేసింది. ఇంత పెద్ద ఎత్తున రూ.7000 కోట్ల నిధులు ప్రభుత్వం ఎందుకు తీసుకొంది? ఆర్.బి.ఐ ద్వారా చేసే అప్పులు చేస్తూనే, ఇప్పుడు రూ.7000 కోట్ల నిధులు ఏమి చేయబోతుందో ఖర్చుల వివరాలు బయట పెట్టాలి.

మీ ఇష్టం వచ్చినట్లు మీ అస్మదీయ కంపెనీలకు పేమెంట్లు చేసేసుకొంటే…రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏమిటి? వీటిపై వెంటనే ఎన్నికల సంఘం వారు దృష్టి పెట్టాలి. ఎన్నికల కోడ్ వచ్చిన నేపధ్యంలో….ప్రభుత్వ ఖర్చులపై ఈసీ నియంత్రణ విధించాలి. రూ.7000 కోట్లు ప్రభుత్వం స్వయంగా సంపాదించుకొన్న రాష్ట్ర సొంత రాబడుల్లో భాగం కాదు. అది ఏపీఎండీసీ కార్పొరేషన్ నిధులు. ఒక కార్పొరేషన్ తాను బాండ్లు జారీ చేసి తెచ్చుకొన్న నిధులను, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అంత పెద్ద ఎత్తున నిధులను రాష్ట్ర ప్రభుత్వం లాక్కుని ఇష్టం వచ్చినట్లు ఎలా వాడుకొంటుంది? దీనిపై కాగ్ వెంటనే స్పందించాలి. ఎన్నికల కమీషన్ దృష్టి పెట్టాలని తెలుగు దేశం పార్టీ డిమాండ్ చేస్తోంది

Leave a Reply