తైవాన్ లో భారీ భూకంపం

-రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.4
-వంగిపోయిన నివాస సముదాయం
-బిల్డింగుల్లో పగుళ్లు
-మియాకో, యేయామా ద్వీపాలకు కూడా సునామీ ముప్పు
-1999 తర్వాత తైవాన్‌ను ప్రభావితం చేసిన అతిపెద్ద భూకంపం ఇదే
-పరిసర దేశాలు అలర్ట్!

తైవాన్ రాజధాని తైపీలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.4గా నమోదైంది. దీంతో అధికారులు తైవాన్తో దక్షిణ జపాన్ ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తైవాన్‌ రాజధాని తైపీని భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.4గా నమోదైంది.

తైవాన్‌ కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8 గంటల సమయంలో ఈ విపత్తు సంభవించింది. ఆ దేశ భూకంప పర్యవేక్షణ సంస్థ ప్రకంపనల తీవ్రతను రిక్టర్‌ స్కేల్‌పై 7.2గా గుర్తించగా, అమెరికా జియోలాజికల్‌ సర్వే దీన్ని 7.4గా పేర్కొంది. హువాలియెన్‌ పట్టణానికి నైరుతి దిశలో 18 కిలోమీటర్ల దూరం, 35 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని తర్వాత 6.5 తీవ్రతతో మరో భూకంపం కూడా సంభవించినట్లు యూఎస్‌జీఎస్‌ వెల్లడించింది.

భూకంపం వల్ల వచ్చిన సునామీ అలలు తైవాన్‌ తూర్పు తీరంలోని హువాలియెన్‌ పట్టణాన్ని తాకాయి. పెద్ద ఎత్తున భవనాలు ధ్వంసమయ్యాయి. ఒక ఐదంతస్తుల భవనం 45 డిగ్రీల కోణంలో ఒరిగిపోవడం చిత్రాల్లో కనిపిస్తోంది. రాజధాని తైపీలో అనేక బిల్డింగుల్లో పగుళ్లు వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. జపాన్‌లోని కొన్ని దీవుల్లోనూ పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

ఒకినావా ద్వీప సమూహంలో మూడు మీటర్ల వరకు సునామీ అలలు ఎగిసిపడే ప్రమాదం ఉందని జపాన్‌ హెచ్చరించింది. భూకంపం సంభవించిన 30 నిమిషాల తర్వాత భారీ అల యొనగుని ద్వీపాన్ని తాకినట్లు తెలిపింది. మియాకో, యేయామా ద్వీపాలకు కూడా సునామీ ముప్పు పొంచి ఉందని వెల్లడించింది. తైపీలో పలు రైళ్ల సేవలను నిలిపివేశారు అధికారులు. 1999 తర్వాత తైవాన్‌ను ప్రభావితం చేసిన అతిపెద్ద భూకంపం ఇదేనని నిపుణులు చెబుతున్నారు.

తైవాన్‌లో భూకంపంతో జపాన్‌ సహా మరికొన్ని దేశాల్లోని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ ప్రకృతి విపత్తుకు సంబంధించి ప్రాణ, ఆస్తి పూర్తి నష్ట వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు తీరప్రాంతాల్లో సునామీ ప్రభావాన్ని అంచనా వేసేందుకు జపాన్ సెల్ఫ్ డిఫెన్స్ఎయిర్క్రాఫ్ట్లను ఇప్పటికే ఒకినావా ప్రాంతానికి పంపింది. అవసరమైతే బాధితులను అక్కడి నుంచి తరలించేందుకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.

Leave a Reply