Suryaa.co.in

Andhra Pradesh

నేనూ వచ్చేస్తున్నా..

– మళ్లీ నర్సాపురం నుంచే పోటీ
– బాబు-పవన్ అన్నదమ్ముల్లా కలసిపోయారు
– మన కూటమి గెలిచినట్లే
– యుద్ధక్షేత్రంలో మనమంతా కలసి పోరాడాలి
– జండా సభలో ఎంపీ రఘురామకృష్ణంరాజు

తాడేపల్లిగూడెం: ‘‘వీడింకా ఏ పార్టీలో చేరలేదు. మొన్ననే ఆ దరిద్రపు పార్టీని వదిలేశాడు. ఇక్కడెందుకు వచ్చాడని అనుకోవచ్చు. అయితే ఇద్దరు ప్రజాస్వామ్య రక్షకులు ఒక సైకో- నియంత-దుర్మార్గుడిపై యుద్ధం చేస్తున్నప్పడు వారికి అండగా నిలవడం కోసమే ఇక్కడికి వచ్చా. పైగా నా నియోజకవర్గంలో జరుగుతున్న సభ కాబట్టి, వారికి నైతక మద్దతునివ్వడం నా బాధ్యత-ధర్మం కాబట్టి ఇక్కడకు వచ్చా. అందుకే ఇప్పుడు వెనక కూర్చున్నా. కొంతమంది వాళ్లు ఇవ్వరు, వీళ్లూ ఇవ్వరు అని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు చెబుతున్నా. రేపటి ఎన్నికల్లో మిత్రపక్షాల అభ్యర్ధిని నేనే. తర్వాత నా నియోజకవర్గంలో ఇంతకంటే పెద్ద సభ నిర్వహిస్తా’’నని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన నిర్వహించిన జండా సభలో రాజు మాట్లాడారు. ఆయన మాట్లాడుతున్నంతసేపు టీడీపీ అధినేత చంద్రబాబు-జనసేన దళపతి పవన్ ఇద్దరూ నవ్వుతూ, ఆయన ప్రసంగాన్ని ఆసక్తిగా వినడం కనిపించింది.

రఘురామకృష్ణంరాజు ఇంకా ఏమన్నారంటే… టీడీపీ-జనసేన కలవాలని, కలుస్తారని నేను ఎప్పటినుంచే చెబుతున్నా. నేను రచ్చబండలో రోజూ ఈ దుర్మార్గమైన ప్రభుత్వం దిగిపోవాలంటే, ఇద్దరూ కలవాలని చెబుతున్నా. నేను నాలుగేళ్ల క్రితం తిరుగుబాటు చేసిన తర్వాత ప్రజలు, ఆలోచించడం మొదలుపెట్టారు. చంద్రబాబు-పవన్ ప్రజాప్రభ ంజనం కూడా జనంలో ఆలోచనలు నింపింది. మన విజయం ఖాయం. వైసీపీ ఓటమి తధ్యం. ఇప్పటికి నా ఆకాంక్ష నెరవేరింది.

బ్రహ్మ-విష్ణు-మహేశ్వరుల్లా కలిశారు. రాబోయే రోజుల్లో గొప్ప అద్భుతసృష్టికి ఇక్కడ అంకురార్పణ జరిగింది. వీళ్ల పిచ్చి మందుతో మహిళల తాళిబొట్లు తెగుతున్నాయి. బాబు-పవన్ అన్నద మ్ముల్లా కలసిపోయారు. అలాగే రెండు పార్టీలు కూడా క్షేత్రస్థాయిలో కలసి పనిచేస్తున్నారు. మధ్యలో ఎవరేమన్నా పట్టించుకోవద్దు. నేను కూడా మీదగ్గరకు వచ్చేస్తా. నేను మళ్లీ ఇదే నర్సాపురం నుంచి పోటీ చేస్తా.

LEAVE A RESPONSE