Suryaa.co.in

Telangana

ఆర్థిక విధ్వంసం మొత్తం తవ్వి తీస్తా

– నేను యాదృచ్ఛికంగా పొలిటికల్ లీడర్ కాలేదు
– చాలా ఆలోచించి రాజకీయాల్లోకి వచ్చా
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్ : నేను యాదృచ్ఛికంగా పొలిటికల్ లీడర్ కాలేదు.. చాలా ఆలోచించి రాజకీయాల్లోకి వచ్చా.ఒక ఫ్యూడల్ వ్యవస్థలో, భావ దారిద్రంలో కూరుకుపోయిన వారిని బయటపడేయాలని రాజకీయాల్లోకి వచ్చా. సమ సమాజం స్థాపనతోనే అభివృద్ధి అది జరగాలంటే చట్టసభల ద్వారానే సాధ్యమని రాజకీయాల్లోకి వచ్చా.

ప్రజల జీవన విధానం బాగుపడాలని అంతా ఆత్మగౌరంతో జీవించడం కోసం రాజకీయాల్లోకి వచ్చా. మీలాగా వ్యక్తిగత స్వార్థం కోసం రాజకీయాల్లోకి రాలేదు. వచ్చిన అవకాశాన్ని సమ సమాజ స్థాపన కోసం వినియోగిస్తాను. మీలాగా దుర్బుద్ధితో రాజకీయాల్లోకి రాలేదు. బయట చాలా మాట్లాడుతారు అని వాటిని సభలో ప్రస్తావిస్తున్నారు. మేం మాట్లాడడం మొదలుపెడితే మీ కన్నా ఎక్కువ మాట్లాడగలం. గంజాయి రాజు, లిక్కర్ రాణి అని బయట చాలా మాట్లాడుతున్నారు. అవి సభలో మేము మాట్లాడం సభ్యత కాదు.

ఆర్థిక శాఖలో జరిగిన ఆర్థిక విధ్వంసం మొత్తం తవ్వితీస్తా. ఉన్న విషయాలు సభలో రాష్ట్ర ప్రజల ముందు పెట్టి వివరిస్తా..సంక్షేమమే మాకు ప్రాధాన్యత రంగం. రాబడి ఖర్చు ఏయే శాఖలకు ఎంత కేటాయింపులు అర్థవంతంగా అవసరాలకు తగిన విధంగా బడ్జెట్ రూపొందించాం. ప్రజల పక్షాన నిలబడి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది
మీ 10 సంవత్సరాల పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ,మైనారిటీ, శ్రీ శిశు సంక్షేమం కోసం 70,474 కోట్లు కేటాయించి ఖర్చు చేయలేదు.. ఎస్సీ సబ్ ప్లాన్ కింద 50 వేల కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు మీరు చేయలేదు.

మేం అధికారంలోకి రాగానే ఆర్థిక, సామాజిక, రాజకీయ సర్వే జరిపించాం. రాష్ట్రంలో 86% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమానికి మీరు నిధులు ఖర్చు చేయలేదని నిర్ధారణ జరిగింది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే సంక్షేమం కోసం మొట్టమొదటిసారి రికార్డు స్థాయిలో కేటాయింపులు చేశాం. మూడు లక్షల 4 వేల కోట్ల బడ్జెట్లో 1,44,156 కోట్లు సంక్షేమం కోసం కేటాయించాం.

మేం రాబడి నీ దృష్టిలో పెట్టుకొని ఆ మేరకే ఈ బడ్జెట్లో కేటాయింపులు చేశాం. 40 వేల కోట్ల బిల్స్ మీరు పెండింగ్లో పెట్టి పోయారు. ఉద్యోగుల బకాయిలు కాకుండానే 40 వేల కోట్లు పెండింగ్లో పెట్టారు. 1,59,940 లక్షల కోట్ల పనులు శాంక్షన్ చేసి పోయారు.. ఆ పనుల బిల్లులు పెండింగ్లో పెట్టి పోయారు.

ఉద్యోగులు రిటైర్ అయితే భారం మీపై పడుతుందని, మూడు సంవత్సరాలు పెంచారు. మొత్తం ఉద్యోగుల బకాయిలు 20వేల కోట్లు ఉండగా అందులో మేం 16 వేల కోట్లు క్లియర్ చేశాం. పాలనలో భాగస్వాములు ఉద్యోగులు.. వారిని పిలిచి బకాయిలకు సంబంధించి వివరాలు వెల్లడించి, రాబోయే రోజుల్లో వాటిని ఎలా క్లియర్ చేస్తామో ఉద్యోగులకు వివరించగా వారు సంతృప్తి చెందారు.

మీరు లక్ష కోట్లు అప్పు తెచ్చి లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నారు. మీరు తెచ్చిన అప్పులకు పదేళ్ల తర్వాత చెల్లింపులు ప్రారంభం అయ్యాయి.. ఆ లక్ష కోట్లు అప్పులు మాపై వదిలివేశారు. పెండింగ్ బిల్స్ రీపేమెంట్ భారం మా ప్రభుత్వం పైపడింది. మీలాగా 20% అంచనాలు పెంచకుండా వాస్తవిక బడ్జెట్ను ప్రవేశపెట్టాం.

లక్ష మంది అధికారులతో నభూతో న భవిష్యత్తు అన్నట్టు కుల సర్వే చేశాం.. ప్లానింగ్ శాఖను నేనే చూస్తున్నాను. ఈ రాష్ట్ర వనరులు వెనుకబడిన పేద వర్గాలకు ఎలా పంచాలి అనే విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర క్యాబినెట్ కు కమిట్మెంట్ ఉంది. కాబట్టి సర్వే పూర్తి చేశాం.. వనరులు రాజకీయాల్లో జనాభా దామాషా ప్రకారం పంపిణీకి విశ్లేషణ చేస్తున్నాం.

మీలాగా దోపిడీ చేయడానికి రాజకీయాల్లోకి రాలేదు. ఈ సమాజంలో కొన్ని దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ పరిష్కారం కాలేదు. నిజమే వాళ్లకు వాటా దక్కాలని మా ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టింది.. దశాబ్దాలుగా పరిష్కరించని సమస్యను మా సీఎం యావత్ క్యాబినెట్ పరిష్కరించింది.

కుల సర్వే ద్వారా స్టడీ చేసాం కాబట్టి సంక్షేమానికి నిధులు పెట్టాం అవి ఖర్చు పెట్టే బాధ్యత మా ప్రభుత్వానిది. ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతాం అందుకే బడ్జెట్లో 56,084 కోట్లు కేటాయించాం వాటిని తూచా తప్పకుండా అమలు చేస్తాం.

రాష్ట్రం వస్తే మేలు జరుగుతుందని నిరుద్యోగులు ఆత్మార్పణం చేసుకున్నారు. మా ప్రభుత్వం వచ్చాక 57,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసాం. జాబ్ క్యాలెండర్ ప్రకటించాం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేసి తీరుతాం.

పదేళ్లుగా మీరు స్వయం ఉపాధి పథకాలను పట్టించుకోలేదు. నిరుద్యోగుల సమస్యలను అర్థం చేసుకున్న మేము 6000కోట్లతో స్వయం ఉపాధి పథకాలు ప్రవేశపెట్టాం.. బ్యాంకు లింకేజీ తో కలిపి మొదటి ఏడాది తొమ్మిది వేల కోట్లతో స్వయం ఉపాధి పథకాలు నిరుద్యోగులకు అందించబోతున్నాం.

వైశ్య కార్పొరేషన్ కి 25 కోట్లు, బ్రాహ్మణ పరిషత్ కు గతంలో 50 కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్లో దానిని 100 కోట్లకు పెంచాం. ఎస్సీ సబ్ ప్లాన్ కు 40 వేల కోట్లు కేటాయించాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి 10 లక్షలకు పెంచాం. మీ పాలనలో రాజీవ్ ఆరోగ్యశ్రీ కి 10 సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం సగటున 540 కోట్లు కేటాయిస్తే మేము మొదటి ఏడాదిలోనే 1205 కోట్లు కేటాయించాం.

ఓవర్సీస్ స్కాలర్షిప్ అడ్డగోలుగా శాంక్షన్ లీటర్లు మీరు ఇచ్చి వెళ్లారు.. ఎన్నికల కోసం మీరు శాంక్షన్ లెటర్లు ఇస్తే.. రాష్ట్ర బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విదేశాల్లో వారు ఇబ్బందులు పడొద్దని మేము 169 కోట్లు విడుదల చేశాం.. ఏడాది ఈ సంఖ్యను మరింత పెంచుతున్నాం.

మీ పాలనలో కాంట్రాక్టర్లకు ప్రతి ఏటా ఎస్టిమేట్లు పెంచి ఎప్పటికప్పుడు బిల్లులు మంజూరు చేశారు తప్ప సంక్షేమ వసతి గృహాల పిల్లల డైట్ కాస్మోటిక్ చార్జీలను పట్టించుకోలేదు.. మేం అధికారంలోకి రాగానే 40 శాతం డైట్ చార్జీలు 25% కాస్మోటిక్ ఛార్జీలు పెంచాం.

మీ 10 సంవత్సరాల పాలనలో ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ కూడా కట్టలేదు. మీ నాయకుల కోళ్ల ఫారాలు అద్దెకు తీసుకొని రేట్లు పెంచి, వారికి చెల్లింపులు చేశారు. మీరు ఆ హద్దులు ఏడాదికి 14 కోట్లు విడుదల చేస్తే మేము 126 కోట్లు సగటున సంవత్సరానికి విడుదల చేసాం.

దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి 11,600 కోట్లు కేటాయించాం. 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఈ స్కూల్స్ నిర్మిస్తున్నాం. మండల జిల్లా పరిషత్తు పాఠశాలలు బాగు చేయడానికి విద్యా కమిషన్ నియమించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం.విద్యార్థుల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తుగా భావించి కార్యాచరణ చేపట్టాం.

LEAVE A RESPONSE