– బీఆర్ఎస్ హయాంలో అప్పులపై గోబెల్స్ ప్రచారం మానండి
– కాంగ్రెస్ ఏ పేపర్ ఇస్తే, బీజేపీ వాళ్లు అదే మాట్లాడే ప్రయత్నం
– భట్టి బీజేపీని ఒక్క మాట కూడా అనలేదు
– అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీమంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ చేస్తున్న గోబెల్స్ ప్రచారం బట్టబయలైంది. ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక, బీఆర్ఎస్ హయాంలో అప్పులపై దుష్ప్రచారం చేస్తూ తప్పించుకోవాలని సీఎం రేవంత్ ప్రయత్నించారు. ఈరోజు సభలో కాగ్ రిపోర్టుతో అన్ని ఆధారాలతో, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏడాదికి చేసిన అప్పు 41 వేల కోట్లు మాత్రమే. 16 నెలలుగా మేం ఏం చెప్పామో, కాగ్ రిపోర్టు కూడా అదే చెప్పింది.
భట్టి విక్రమార్క కూడా అసెంబ్లీలో అదే విషయం చెప్పారు. బీఆర్ఎస్ పదేండ్లలో చేసిన అప్పు 4 లక్షల 17 వేల కోట్లు మాత్రమే. ఏటా 41 వేల కోట్లు- లేదా 42 వేల కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో 1 లక్షా 58 వేల కోట్ల అప్పు చేసింది, చేసిన పని సున్నా. 16 నెలల అప్పులు కట్టడానికి 88,564 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని 7 గంటల 44 నిమిషాలకు చెప్పారు.
సీఎం ఇదే విషయమై 3.58 నిమిషాలకు ఇదే అసెంబ్లీలో ఏం చెప్పారంటే… మేం 1,53,359 కోట్లు అప్పులు, మిత్తీల కింద చెల్లించామని చెప్పారు. అంటే నాలుగు గంటల్లోనే ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి మధ్య 70 వేల కోట్ల తేడా వచ్చింది. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకుల్లారా బీఆర్ఎస్ 6, 7,8 లక్షల కోట్ల అప్పు చేసిందని, గోబెల్స్ ప్రచారం మానండి.
ఈ సమావేశాలను బీఆర్ఎస్ అద్భుతంగా ఉపయోగించుకున్నది. మేం కాంగ్రెస్ తప్పిదాలను ఎత్తిచూపాం, వైఫల్యాలను ఎండగట్టాం. ఆరు గ్యారెంటీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీశాం. జగదీశ్వర్ రెడ్డి అకారణ సస్పెన్షన్ పై కూడా ప్రభుత్వం మాట తప్పింది. 12 రోజుల్లో 2 రోజులు మాత్రమే ప్రశ్నోత్తరాలు జరిపి, 10 రోజులు రద్దు చేసింది స్వల్పకాలిక చర్చలు జరపలేదు, సీఎం మంత్రుల సమాధానాల్లో సీరియస్ నెస్ లోపించింది. కేవలం రాజ్యాంగం ప్రకారంగా బడ్జెట్ పాస్ చేసుకోవడమే లక్ష్యంగా సభను నడిపారు.
డీ లిమిటేషన్ మీద మాట్లాడతామంటే కేటీఆర్ కి మైక్ ఇవ్వలేదు, సీఎం హెడ్ లైన్స్ కోసమే మాట్లాడారు. సీఎం నిన్న సుప్రీంకోర్టులో ఉన్న ఫిరాయింపుల అంశంపై ప్రస్తావించారు, దీన్ని మేం సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళతాం. రుణమాఫీ ముగిసిందని చెప్పారు. సభలో చెప్పాను. వానకాలం ఇవ్వాల్సిన రైతుబంధు 8 వేల కోట్లు ఎగ్గొట్టారు. యాసంగిలో 8వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటే 3500 కోట్లు ఇచ్చారు. 4500 కోట్లు ఎగ్గొట్టారు.
అంటే 8+4 = 12 వేల కోట్ల రూపాయలు రైతుభరోసా ఎగ్గొట్టారు, అవే డబ్బులు రుణమాఫీలో కలిపారు. 20 వేల కోట్లలో 12 వేల కోట్లు తీసేస్తే, మీరిచ్చిన రుణమాఫీ కేవలం 8 వేల కోట్లు మాత్రమే. కాంగ్రెస్ – బీజేపీ నాయకుల బంధం ఈ అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టంగా బయటపడింది. కాంగ్రెస్ ఏ పేపర్ ఇస్తే, బీజేపీ వాళ్లు అదే మాట్లాడే ప్రయత్నం చేశారు. మా సభ్యులంతా ప్రజల పక్షాన అనేక సమస్యలు లేవనెత్తారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తప్పుడు సమాచారమిస్తే మా సభ్యుడు వేముల ప్రశాంత్ రెడ్డి ఎత్తిచూపారు. మేం ప్రివిలేజ్ మోషన్ కూడా ఇచ్చాం. కాంగ్రెస్ మేనిఫెస్టోపై మేం అడిగిన ఏ ఒక్క ప్రశ్నకూ జవాబివ్వలేదు. రుణమాఫీపై కొడంగల్ పోదామా, సిరిసిల్లకు వస్తరా అని కేటీఆర్ అడిగితే, ప్రభుత్వం తోక ముడిచి పారిపోయింది. రాష్ట్ర బీజేపీ నాయకులు అప్పుల గురించి మాట్లాడుతున్నరు. 60 ఏండ్లలో ఈ దేశం చేసిన అప్పు 55 లక్షల కోట్లు మాత్రమే అయితే, దేశంలో పదేండ్లలో బీజేపీ 125 లక్షల కోట్ల అప్పు చేసింది. అంటే 57శాతం జీడీపీలో అప్పులు చేసిన బీజేపీ వాళ్లు నీతులు చెబుతున్నారు.
వంద ఎలుకలు తిన్న పిల్లి నేను శాఖాహారిని అన్నట్లుంది బీజేపీ తీరు. ఈరోజు కూడా తెలంగాణ రాష్ట అప్పులు జీడీపీలో 27శాతం మాత్రమే. మేం సభలో రుణమాఫీలో ఫెయిలైందని ఎండగట్టాం.. మహాలక్ష్మి, 4 వేల పెన్షన్, స్కూటీలు, తులం బంగారం విషయంలో నిలదీశాం. ప్రాజెక్టుల పూర్తిపై మంత్రి ఉత్తమ్ గారిని అడిగితే నీళ్లు నమిలారు తప్ప, నీళ్ల విషయం ఏమీ చెప్పలేకపోయారు.
సభలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ఎస్ పార్టీ ఎత్తి చూపింది. ప్రజల పక్షాన పోరాడి సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయ గలిగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి ఇవ్వకున్నా భట్టి మాత్రం బీజేపీని ఒక్క మాట కూడా అనలేదు, బీజేపీ కాంగ్రెస్ చెరో 8 మంది ఎంపీలు గెలిచినా అన్యాయం చేశాయని కేటీఆర్ స్పష్టంగా చెప్పారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని మేం ఎత్తి చూపగలిగాం