– ఒంటరిగా ఉండలేనని జడ్జికి వల్లభనేని వంశీ అభ్యర్ధన
సెల్‌లో నన్ను ఒంటరిగా ఉంచొద్దు
– కుదరదన్న జడ్జి
విజయవాడ : వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 3 రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా వంశీ జైలులోని సెల్‌లో తనను ఒంటరిగా ఉంచారని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. తనకు ఆస్తమా సమస్య ఉందని, ఆరోగ్య సమస్య వస్తే ఇబ్బందని తెలిపారు. తనతో పాటు సెల్‌లో మరొకరిని ఉంచాలని, భద్రతా పరంగా తనకు ఇబ్బంది లేదని కోర్టును కోరారు.
ఇప్పటికే వంశీకి దగ్గరలో అటెండర్ సౌకర్యం కల్పించారు కదా అని న్యాయమూర్తి అడిగారు. సెల్‌లో మరొకరిని ఉంచేందుకు ఇన్‌ఛార్జి జడ్జిగా తాను ఆదేశించలేనని న్యాయమూర్తి తెలిపారు. సెల్‌లో ఏమైనా జరిగితే అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించినట్టు సమాచారం.
సెల్ మార్పు కోసం శుక్రవారం రెగ్యులర్ కోర్టులో మెమో దాఖలు చేయాలని వంశీ తరఫు న్యాయవాదికి సూచించారు. సెల్ వద్ద వార్డెన్‌ను ఉంచాలని జైలు సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేశారు. వంశీ భద్రత దృష్ట్యా సెల్‌లో ఒంటరిగా ఉంచామని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఆరోగ్య పరిశీలనకు వార్డెన్‌ను ఏర్పాటు చేసేందుకు అభ్యంతరం లేదని తెలిపారు. అనంతరం విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.
కేసు తారుమారు చేయాలని చూశారు: ఏసీపీ దామోదర్
సత్యవర్ధన్‌ను బెదిరించి కేసు తారుమారు చేయాలని చూశారని విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్ తెలిపారు. వంశీ, అతని అనుచరులు సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. ‘‘సీసీ కెమెరా ఫుటేజీ, సాంకేతిక ఆధారాలు సేకరించాం. కోర్టు ఆదేశాలతో వంశీని 3 రోజులు ప్రశ్నించాం. కొన్నింటికి ఔనని.. మరి కొన్ని ప్రశ్నలకు జవాబివ్వలేదు.
కనిపించని ఫోన్ గురించి అడిగితే తెలియదన్నారు. ఈనెల 12న హైదరాబాద్ నుంచి వచ్చి జగన్‌ను కలిసినట్టు వంశీ అంగీకరించారు. మాకు ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది. మరోసారి వంశీతో పాటు ఇతర నిందితులను కస్టడీకి కోరుతూ పిటిషన్ వేస్తాం’’ అని ఏసీపీ దామోదర్ తెలిపారు.