జగన్మోహన్ రెడ్డిపై పిటిషన్ వేసి నా ప్రాణాలపైకి తెచ్చుకున్నా

– జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే నా లక్ష్యం
– ఆ లక్ష్యంతోనే ఇన్నాళ్లు ప్రాణాలకు తెగించి పోరాడాను

– కచ్చితంగా కూటమి గెలవాలి… జగన్మోహన్ రెడ్డి పోవాలి… రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి
– జగన్మోహన్ రెడ్డి పీడ రాష్ట్రానికి వదిలించడం కోసం ఎవరు ఎంత కృషి చేశారో రాష్ట్ర ప్రజలకు తెలుసు
– ప్రజలను ఎల్లప్పుడు పూల్స్ చేస్తున్న మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి
– న్యాయస్థానాలలో సామాన్యుడికి ఒక రూల్… సీఎంకు మరొక రూలా? అని ప్రశ్నించి న్యాయవ్యవస్థను వివస్త్రను చేసే విధంగా ఉన్న ఈ నిబంధనను సుప్రీం కోర్టు దృష్టికి తీసుకు వెళ్లాను
– 77 సార్లు వాయిదా అడిగిన వ్యక్తిని మరొకసారి వాయిదా అడిగితే అతని బెయిల్ రద్దు చేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు
– జగన్మోహన్ రెడ్డి తనపై నమోదు చేసిన చార్జిషీట్ లలో మూడువేల సార్లకు పైగా వాయిదాలు అడగడం… సీబీఐ కోర్టు మంజూరు చేయడం విడ్డూరం
– జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ, ఏ ఒక్కరూ ముందుకు రాని పరిస్థితుల్లో నేనున్నానంటూ ముందుకొచ్చి పిటిషన్ వేశా
– జగన్మోహన్ రెడ్డి కేసులపై విచారణ కొనసాగాల్సిందేనని ఆదేశించిన సుప్రీం కోర్టు ధర్మాసనం
– ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డిని సిబిఐ కోర్టు విచారణకు పిలుస్తుందా? పిలిచినా జగన్మోహన్ రెడ్డి వస్తారా?
– నాకు ఏ పార్టీల అండలేదు… రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల కోసమే నేను ఒంటరి పోరాటం చేస్తున్నా
– నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

జగన్మోహన్ రెడ్డిని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఇన్నాళ్లు నా ప్రాణాలకు తెగించి పోరాటం చేశానని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. రానున్న ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి కావాలా?, వద్దా?? అన్న ప్రజాభిప్రాయం కోసమే జరగనున్నాయన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డి వద్దని, అతన్ని ఎదిరించాలనే ఉద్దేశంతోనే ఇతర పార్టీలతో జత కట్టారన్నారు.

తనకు ఎంత ప్రజాభిమానం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ నెగ్గాలో కాదు… ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తిగా తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపారన్నారు. సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…. కూటమిలో బిజెపి కూడా కలవాలని అందరికీ తెలిసే విధంగా పవన్ కళ్యాణ్ కృషి చేస్తే, ఎవరికీ తెలియకుండా నేను ఎన్నో రోజులు ఢిల్లీలో గడిపానన్నారు. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని, ఇప్పుడు నేను ఏమి మాట్లాడినా అపార్థం చేసుకునే పరిస్థితి ఉందన్నారు. అందుకనే ఏమీ మాట్లాడడం లేదని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు.

రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఈరోజు వరకు నేను సుప్రీం కోర్టులో పోరాడుతున్నాను
రానున్న ఎన్నికల్లో కచ్చితంగా కూటమి గెలవాలని ఆకాంక్షించిన రఘురామ కృష్ణంరాజు, జగన్మోహన్ రెడ్డి పదవి నుంచి దిగిపోవాలన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈరోజుకు నేను సుప్రీం కోర్టులో పోరాడుతున్నానని చెప్పారు. ప్రజలకు హాని జరుగుతుందనే భావించి, ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఏ పార్టీ సభ్యుడిని కాకపోయినప్పటికీ నా వంతు పాత్రను పోషిస్తున్నానని తెలిపారు . రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి పీడను వదిలించడానికి ఎవరు ఎంత కృషి చేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు.

50 లక్షల మంది కార్యకర్తలు కలిగిన పార్టీలు కృషి చేయడం అభినందనీయమేనని పేర్కొంటూనే, ప్రాణాలకు తెగించి ఒంటరిగా పోరాటం చేయడం ఎంత కష్టమో ప్రజలు ఆలోచించాలన్నారు. మా నాన్నమ్మ చనిపోతే నా సొంత ఊరుకు కూడా వెళ్లలేని దుస్థితిని కల్పించారు. అయినా ప్రజల కోసం అన్నీ ఓర్చుకున్నాను. సొంత నియోజకవర్గంలో ప్రధానమంత్రి పర్యటిస్తుండగా ప్రోటోకాల్ నిబంధనల మేరకు జిల్లా కలెక్టర్ అతిధుల జాబితాలో నా పేరును చేర్చితే, జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి కార్యాలయానికి నేరుగా ఫోన్ చేసి, అతిథుల జాబితా నుంచి నా పేరును తొలగించారన్నారు. ఇటువంటి ప్రోటోకాల్ ఉల్లంఘన దేశంలో మరెక్కడా జరగలేదని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

నియంత, నియంత… నువ్వెంత అని ప్రశ్నించిన వ్యక్తిని నేను
జగన్మోహన్ రెడ్డి ఎన్ని అరాచకాలకు అక్రమాలకు పాల్పడిన నేను ఎదురెళ్లే పోరాటం చేశానని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి అనే దరిద్రం ఈ రాష్ట్రానికి పోవాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్లానని చెప్పారు. పోరాడే వారు ఎవరు కూడా ఈ కూటమిలో ఉండకూడదని అనుకుంటున్నారా?, అలా అనుకుంటారని నేను అనుకోవడం లేదన్నారు. కొద్దిపాటి మిస్ కమ్యూనికేషన్ వల్ల నాకు సీటు దక్కలేదని భావిస్తున్నాను. తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు నాకు తప్పకుండా న్యాయం చేస్తారనే పరిపూర్ణమైన విశ్వాసం ఉందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

ఇప్పటికీ నా పై సానుభూతి వ్యక్తం చేస్తూ, వేలాది మంది పంపుతున్న మెసేజ్లు నాకు అందుతూనే ఉన్నాయి. మెయిల్ బాక్స్ నిండిపోయిందన్నారు. కూటమిని విశ్వసించిన ప్రజలు ఈ నియంతను సాగనంపాలని భావిస్తున్నారు. అటువంటి నియంతను నువ్వెంత అని ఎవరూ ప్రశ్నించడానికి సాహసం చేయని సమయంలోనే ప్రశ్నించిన నన్ను వదిలేస్తారని నేనైతే అనుకోవడం లేదు. ఒకటి రెండు రోజుల వ్యవధిలో తప్పకుండా నాకు న్యాయం జరుగుతుందని విశ్వాసం ఉంది.

ఎందుకు ఈ విషయాన్ని ప్రతి రోజు చెబుతున్నానంటే, చాలామంది నా ముందు అభిమానంతో రకరకాల ఆప్షన్లను పెడుతున్నారు. అటువంటి ఆప్షన్లు వద్దు అని… తప్పకుండా కూటమి నాకు న్యాయం చేస్తుందనే విషయాన్ని మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేయడానికి ఈ విషయాన్ని చెబుతున్నానని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు.

జగన్మోహన్ రెడ్డి పై నేను చేసిన పోరాటమే నాకు శాపం అయ్యిందేమోననిపిస్తోంది
జగన్మోహన్ రెడ్డి పై నేను చేసిన పోరాటమే నాకు శాపం అయ్యిందేమోననిపిస్తోందని రఘురామకృష్ణం రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి ఆపేక్ష లేకుండా, రాష్ట్ర ప్రజల మేలుకోసమే నేను పోరాటం చేశాను. ఎందరెందరో పార్టీలను పెట్టుకుంటున్నారు. నాకు రాజకీయంగా స్వార్థం ఉండి ఉంటే , ఏమో నేను కూడా పార్టీ పెట్టి ఉండే వాడినేమోనని అన్నారు. కానీ నాకు అటువంటి స్వార్థం లేదు. నేను మనసా వాచా కర్మణా కోరుకున్నది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, శ్రామికుడైన చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మాత్రమేనని తెలిపారు.

చంద్రబాబు నాయుడుని ముసలోడు అంటూ జగన్మోహన్ రెడ్డి ఎగతాళి చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముసలోడు అని చెబుతున్న నారా చంద్రబాబు నాయుడు రోజుకు ఎండలో మూడు బహిరంగ సభలకు హాజరవుతుంటే, ఏసీ బస్సులో ప్రయాణం చేస్తూ, ప్రసంగించే సమయంలో అటువైపు ఇటువైపు కూలర్లను పెట్టుకొని ఒక్క సభలో పాల్గొనే జగన్మోహన్ రెడ్డి యువకుడా? అంటూ ప్రశ్నించారు. ఎవరు కుర్రాల్లో… ఎవరు యువకులో, ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగిన వారు ఎవరో ప్రజలే ఆలోచించాలని రఘురామకృష్ణంరాజు కోరారు.

కూటమి కలవాలి, గెలవాలన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ అవిశ్రాంతంగా ప్రజల్లో ఉంటూ పోరాటం చేస్తున్నారన్నారు. ఒంట్లో బాగా లేకపోయినా హైదరాబాదుకు వచ్చి, వెంటనే తిరుగు ప్రయాణమయ్యారు . ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా ప్రజా క్షేత్రంలో ఉండి పవన్ కళ్యాణ్ పోరాడుతున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

విచారణ జరగాల్సిందేనన్న సుప్రీం కోర్టు న్యాయమూర్తి
జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణ కొనసాగించాల్సిందేనని సుప్రీంకోర్టు నెంబర్ 2 న్యాయమూర్తి, భవిష్యత్తులో కాబోయే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా స్పష్టంగా ఆదేశించారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశాలతోనైనా హైదరాబాద్ సిబిఐ కోర్టు వారు జగన్మోహన్ రెడ్డి ని విచారణకు పిలుస్తారా?, పిలిస్తే జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా?? అన్నది బిలియన్ డాలర్ల ప్రశ్నేనని పేర్కొన్నారు. కేసు వాయిదా సమయంలో న్యాయవాదులు వెళ్లి నాలుగు చివాట్లు తిని, పొరపాటు జరిగిందని చెప్పి తిరిగి వస్తారన్నారు.

ఏది ఏమైనా ఎంత గొప్ప న్యాయవాదులను నియమించుకున్న , న్యాయానికి ఎప్పుడు బలం ఉంటుందని, న్యాయమే గెలుస్తుందన్నారు. నాకు ఏ పార్టీ మద్దతు లేదు. నేను చేస్తున్నది ఒంటరి పోరాటం. ఈపాటికి ప్రజలకు ఈ విషయం అర్థమై ఉంటుంది. నేను ఏ పార్టీ సభ్యుడిని కాను. సభ్యుడు కానివారికి ఏ పార్టీ కూడా మద్దతు ఇవ్వదని అంటున్నారు. నేను చేస్తున్న ఈ పోరాటం రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని పేర్కొన్న రఘురామ కృష్ణంరాజు, చంద్రబాబు నాయుడు లాంటి గొప్ప వ్యక్తి మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్నా ఆరాటం ఉబలాటంతోనే నేను ఈ పోరాటం చేస్తున్నాను. ఇది నా గొప్పల కోసం చేసిన పోరాటం కాదు.

నా పదవీకాలాన్ని ఐదేళ్లు పాటు హాయిగా అనుభవించవచ్చు. ఎవరైనా అనుభవించాలని చూస్తారు. నిన్న మొన్న టిడిపిలో, కొంతమంది బిజెపిలో చేరారు. వారు చేసిన పోరాటం సంగతి దేవుడెరుగు, పెదవి విప్పి మాట్లాడినట్టుగా చూపెడితే నేను కూటమి సీటు అడగనని రఘురామకృష్ణం రాజు సవాల్ చేశారు. ఈ పది రోజుల వ్యవధిలో తెదేపా, బిజెపిలో చేరిన వారు ఒక్కరైనా జగన్మోహన్ రెడ్డిని గతంలో ప్రశ్నించారంటే నేను రాజకీయాలనుంచి శాశ్వతంగా విరమించుకుంటానని చెప్పారు. అంతమందికి సీట్లు ఇచ్చిన కూటమి పార్టీలు బిజెపి, జనసేన, టిడిపి ఎవరైనా కావచ్చు… ప్రజల కోసం పోరాడి, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా అహర్నిశలు శ్రమించిన నన్ను విస్మరిస్తారని నేను అనుకోవడం లేదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

3 వేల పైగానే సార్లు వాయిదాలు కోరిన జగన్మోహన్ రెడ్డి
జగన్మోహన్ రెడ్డి పై మోపిన 11 చార్జి షీట్ లలో మూడు వేలకు పైగానే ఆయన వాయిదాలు కోరితే, సిబిఐ న్యాయస్థానం అనుమతించిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. 77 సార్లు వాయిదాలు కోరిన ఒక వ్యక్తిని మరొకసారి వాయిదా కోరితే బెయిల్ రద్దుచేసి అరెస్టు చేయమని సుప్రీంకోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు. సుప్రీం కోర్టు ధర్మాసనం 77 సార్లు వాయిదాలు కోరిన వ్యక్తిపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తే, ఇక్కడ వేలసార్లు వాయిదాలు కోరిన వ్యక్తికి సంబంధించిన కేసుల విచారణ అతి గతి లేదన్నారు. ఏ ఒక్కరూ కూడా ఈపిటిషన్ వేయడానికి రాష్ట్రంలో ముందుకు రాకపోతే, నేనున్నానంటూ ముందుకొచ్చి పిటిషన్ దాఖలు చేశానని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ, ఏ ఒక్కరు కూడా ధైర్యం చేయలేని పరిస్థితుల్లో గతంలో నేను ఒక్కడినే ధైర్యం చేసి పిటిషన్ వేశానని గుర్తు చేశారు. పిటిషన్ వేసినందుకు జగన్మోహన్ రెడ్డి నన్ను చంపేసి స్వర్గానికో, నరకానికో పంపే ప్రయత్నం చేశారు. పుణ్యం చేసిన వారు స్వర్గానికి, పాపం చేసిన వారు నరకానికి వెళ్తారని నమ్మకాన్ని కలిగి ఉన్న సమాజం మనదని గుర్తు చేశారు. ఎక్కడో ఒకచోటకు పంపించేందుకు జగన్మోహన్ రెడ్డి రెడీ అయ్యాడు. అయినా వెంకటేశ్వర స్వామి దయ వల్ల బ్రతికి బయటపడ్డాను.

ఏ ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి తప్పులను ఎత్తి చూపడానికి ముందుకు రాలేని పరిస్థితిల్లో ఆయన కు వ్యతిరేకంగా నేను పిటీషన్ దాఖలు చేసి నా ప్రాణం మీదకు తెచ్చుకున్నానని పేర్కొన్నారు. ఈ వ్యవహారం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వచ్చిందన్న ఆయన, సోమవారం నాడు రెండు పిటిషన్లు విచారణ జరిగాయని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి తరఫున రోజుకు పాతిక నుంచి 30 లక్షలు ఫీజులు వసూలు చేసే ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. జగన్మోహన్ రెడ్డి పై వ్యక్తిగతంగా వేసిన ఈ కేసును వాదించిన రోహత్గి కి ఆయనే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వ కేసులు ఎన్నో రోహత్గి కి అప్పగిస్తున్నారు.

ఈ కేసులో వాదించడానికి ఏమీ లేకపోయినప్పటికీ పచ్చి అబద్దాలను ముకుల్ రోహత్గి న్యాయస్థానానికి చెప్పే ప్రయత్నాన్ని చేశారు. ఈ సందర్భంగా నెంబర్ 2 జడ్జి సంజీవ్ ఖన్నా, సిబిఐ తరఫున వాదనలను వినిపిస్తున్న న్యాయవాదిని ఉద్దేశించి కేసుల పురోగతి ఏమిటని ప్రశ్నించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కోర్టులకు వెళ్లకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదని, అటువంటి వెసులుబాటును కల్పించడం సరైన విధానం కాదని వ్యాఖ్యానించారు. విచారణను చేపట్టాల్సిందేనని ఆదేశించారు.

సిబిఐ కౌన్సిల్ తరఫున న్యాయవాది ఎస్వీ రాజును ఉద్దేశించి సమగ్ర సమాచారంతో కూడిన కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించాం… కౌంటర్ దాఖలు చేశారా అని ప్రశ్నించారు. ఎందుకు ఆలస్యం జరుగుతుందని ఆయన నిలదీశారు. ఈ సందర్భంగా న్యాయవాది సివి రాజు మాట్లాడుతూ కొంత సమయం కావాలని కోరారన్నారని రఘు రామకృష్ణంరాజు వివరించారు . డిస్చార్జి పిటిషన్ల గోల ఎక్కువైందని సీనియర్ న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ కోర్టు దృష్టికి తీసుకురాగా, సిబిఐ న్యాయవాదిని ఉద్దేశించి డిస్చార్జ్ పిటిషన్ల సొల్యూషన్ మీరే చూసుకోవాలని సూచించడమే కాకుండా, ఒక ముఖ్యమంత్రి కి, పార్టీ అధ్యక్షుడికి ఇన్ని వాయిదాలు ఇచ్చి కేసును డిలే చేయడం సమంజసమా? అని నిలదీశారు. విచారణను కొనసాగించాల్సిందేనని ఆయన చాలా గట్టిగానే చెప్పడం జరిగిందని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో ఆగస్టు 5వ తేదీకి ఈ కేసును వాయిదా వేశారని వివరించారు.

దేశానికి కాబోయే ప్రధానమంత్రి నని చెప్పండి… అంత ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేదు
ఏప్రిల్ 1వ తేదీన ఎవరైనా ఇతరులని పూల్స్ చేస్తారని కానీ జగన్మోహన్ రెడ్డి నిత్యం ప్రజలను పూల్స్ చేస్తున్నారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ప్రతిరోజు రాష్ట్ర ప్రజలను పూల్స్ చేసిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి అని ఆయన విమర్శించారు. ప్రతిరోజు ప్రజలను పూల్స్ చేయడం మానేసి, ఈ ఒక్కరోజు మాత్రం ఏమి చెబుతారో అన్ని చెప్పేయండని అన్నారు.

దేశానికి కాబోయే ప్రధానమంత్రిని చెప్పండని పేర్కొన్న రఘురామకృష్ణంరాజు, ఆ మాట చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేదని, ఒకవేళ చెబితే 24 గంటల వ్యవధిలో ఏం జరుగుతుందో తెలుసునన్నారు. అవసరమైతే అమెరికా అధ్యక్షునిగా పోటీ చేసి నెగ్గగలనని చెబుతారు కానీ, దేశానికి ప్రధానమంత్రిని అవుతానని చెప్పే ధైర్యం లేదన్నారు.

Leave a Reply