సుజనా చౌదరి విజయవాడకు ఏం చేశారో చెప్పాలి?

-ప్రజాసేవకుడు ఆసిఫ్‌ను గెలిపించాలి
-పశ్చిమ ప్రచారంలో ఎంపీ అభ్యర్థి కేశినేని నాని

విజయవాడ, మహానాడు: విజయవాడకు ఎంపీ సుజనాచౌదరి ఏం చేశారో చెప్పాలని వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని ప్రశ్నించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 56వ డివిజన్‌లో కార్పొరేటర్‌ యలకల చలపతిరావు ఆధ్వర్యంలో రాజరాజేశ్వరిపేట పరిధిలో సోమవారం ప్రచారం నిర్వహించారు. విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్‌ ఆసిఫ్‌, నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ ప్రచారంలో ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుందని అన్నారు.

పశ్చిమ నియోజకవర్గం మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, పేదలు ఎక్కువగా ఉండే నియోజకవర్గమని, మొదటినుంచి బీసీలు, మైనారిటీలే ప్రజాప్రతినిధులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. ఆసిఫ్‌ ప్రజాసేవకు అంకితమై సమస్యలను పరిష్కార దిశగా కృషి చేస్తాడని భావించి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టారని ఆయనను గెలిపించాలని కోరారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆడే నాటకాలను ప్రజలు చూస్తున్నారని, 10 ఏళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న నిరుపేద బీసీని పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. మైనారిటీలను, బీసీలను మోసం చేసి అపర కుబేరుడైన సుజనా చౌదరిని తీసుకుని వచ్చి పోటీకి నిలబెట్టారు… 12 ఏళ్లు రాజ్యసభ సభ్యుడిగా, మూడేళ్లు కేంద్రమంత్రిగా చేసిన సుజనాచౌదరి విజయవాడ కోసం ఒరగబెట్టింది ఏమీ లేదని వ్యాఖ్యానించారు.

విజయవాడ పార్లమెంట్‌కు సుజనా చౌదరి వల్ల ఏ మేలు జరిగిందో చెప్పి పశ్చిమలో అడుగుపెట్టాలని ప్రశ్నిస్తున్నా? ఇదివరకు వర్షం వస్తే పశ్చిమ నియోజక వర్గం చెరువును తలపించేదని, 2014లో తాను ఎంపీగా అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సహకారంతో స్ట్రామ్‌ వాటర్‌ సిస్టమ్‌ కోసం దాదాపు రూ.450 కోట్లతో వరద ముంపు నుంచి రక్షణ కల్పించినట్లు వివరించారు. విభజన హామీల కోసమా? కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసమా? ప్రత్యేక హోదా కోసమా? ఏ హామీ ఇచ్చారని చంద్రబాబు బీజేపీతో జతక ట్టారు? అని ప్రశ్నించారు. ఎప్పుడూ మీకు అందు బాటులో ఉంటూ ప్రజా సేవకుడిగా పని చేసే ఆసిఫ్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకో వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, డివిజన్‌ ఇన్‌చార్జీ లు, అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు, మండల ఇన్‌చార్జీలు, క్లస్టర్‌ ఇన్‌చార్జీలు, గృహ సారథులు, కన్వీనర్లు, సోషల్‌ మీడియా మిత్రులు పాల్గొన్నారు.

Leave a Reply